Abn logo
Sep 19 2021 @ 01:35AM

కరువు రైతుకు తప్పని నిరీక్షణ

సూక్ష్మసేద్యానికి సబ్సిడీ వర్తింపజేస్తూ

జీఓ జారీతో సరిపెట్టిన ప్రభుత్వం 

ఆఖరు దశలో డ్రిప్‌ కంపెనీలతో టెండర్ల ప్రక్రియ 

మార్గదర్శకాల జారీలో నిర్లక్ష్యం

అయోమయంలో అన్నదాతలు

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 18: 

సబ్సిడీ సూక్ష్మసేద్య పరికరాల కోసం కరువు జిల్లా రైతుకు నిరీక్షణ తప్పట్లేదు. ఇంకా ఎంతకాలం వేచి చూడాలో తెలియని అయోమయం నెలకొంది. వైసీపీ అధికారం చేపట్టాక డ్రిప్‌, స్ర్పింక్లర్ల కోసం నిధులు మంజూ రు చేయకపోవడంతో సబ్సిడీ పరికరాలకు అన్నదాతలు దూరమయ్యారు. ఈ ఏడాది జూలై మొదటి వారంలో సబ్సిడీ వర్తింపజేస్తూ జీఓ జారీ చేయడంతో ప్రభుత్వం సరిపెట్టింది. కొత్త నిబంధనల మేరకు ఐదెకరాల్లోపు రైతులకు 90 శాతం, ఐదెకాల నుంచి పదెకరాల్లోపు వారికి 70 శాతం సబ్సిడీని వర్తింపజేయాలని నిర్ణయించారు. మార్గదర్శకాల జారీలో జాప్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఆరు మాసాలు గడుస్తున్నా డ్రిప్‌, స్ర్పింక్లర్ల మంజూరు ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 


మార్గదర్శకాల జారీలో వీడని నిర్లక్ష్యం 

సూక్ష్మసేద్య పరికరాలకు సబ్సిడీ వర్తింపజేస్తూ ఈ ఏడాది జూలై మొదటి వారంలో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. డ్రిప్‌, స్ర్పింక్లర్ల మంజూరుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండటం గమనార్హం. సూ క్ష్మసేద్యం పరికరాల సరఫరాకు డ్రిప్‌ కంపెనీలతో రాష్ట్రస్థాయిలో టెండర్లు ఆహ్వానించారు. ఆ ప్రక్రియ పూర్తయితేనే ఆయా కంపెనీల పేర్లపై రైతులతో రిజిస్ర్టేషన చేసే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, టెండర్లను పూర్తి చేసి, కంపెనీలను ఖరారు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్గదర్శకాల జారీలో నిర్లక్ష్యం వీడి, తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు పాలకులు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.


కొత్త సబ్సిడీ వర్తింపు ఇలా.. 

ఐదెకరాల్లోపు విస్తీర్ణం కలిగిన ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన రైతులకు గతంలో 100 శాతం సబ్సిడీ వర్తింపజేసేవారు. ఐదెకరాల్లోపు రైతులకు 90 శాతం సబ్సిడీ (యూనిట్‌ విలువ రూ.2లక్షలు), ఐదెకరాల నుంచి పదెకరాలోపు విస్తీర్ణం కలిగిన రైతులకు (యూనిట్‌ విలువ రూ.2.80 లక్షలు) 90 శాతం సబ్సిడీ వర్తింపజేస్తూ వచ్చారు. పదెకరాలకుపైగా భూమి విస్తీర్ణం కలిగిన రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చారు. కొత్త నిబంధనల మేరకు ఐదెకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 90 శాతం, ఐదెకరాల నుంచి పదెకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 70 శాతం సబ్సిడీ వర్తింపజేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ బంద్‌ చేశారు. మిగతా రైతులతోపాటు భూమి విస్తీర్ణం ఆధారంగా సబ్సిడీ వర్తింపజేయాలని నిర్ణయించారు.


ఆదేశాలు రాగానే రిజిస్ర్టేషన ప్రారంభిస్తాం

- ఫిరోజ్‌ ఖాన, ఏపీఎంఐపీ పీడీ

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రైతులతో రిజిస్ర్టేషన ప్రక్రియ ప్రారంభిస్తాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత కొత్త నిబంధనల మేరకు అర్హులైన రైతులందరికీ డ్రిప్‌, స్ర్పింక్లర్ల పరికరాల మంజూరుకు చర్యలు తీసుకుంటాం.

ఎప్పుడిస్తారో.. ఏమో..?: రైతు సూరి, విడపనకల్లు 

డ్రిప్‌ ఎప్పుడిస్తారో ఏమో అర్థం కావడం లేదు. పదెకరాల్లో మిరప పెట్టా. పెద్ద పైపుల ద్వారా నీటిని పెడుతున్నా. డ్రిప్‌ కోసం దరఖాస్తు చేసుకుందామని అధికారులకు వద్దకు వెళ్లినా ఫలితం లేదు. ప్రభుత్వం నుం చి ఉత్తర్వులు రాగానే రిజిస్ర్టేషన చేసుకుంటామని చెబుతున్నారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడొస్తాయో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అం దించి, ఆదుకోవాలి.

రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా

డ్రిప్‌ పరికరాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. అధికారులను ఎప్పుడు అడిగినా ఇంకా ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. 15 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నా. ప్రభుత్వం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు పంపిణీ చేయకపోవడంతో పాత పద్ధతిలోనే పంటకు నీటి తడులు పెడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, డ్రిప్‌ పరికరాలు పంపి ణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.

-  రైతు బండి ప్రసాద్‌, విడపనకల్లు