అడ్డుకట్ట ఏదీ?

ABN , First Publish Date - 2021-06-20T06:46:00+05:30 IST

నిషేధిత గుట్కా, అక్రమ మద్యం రవాణా, వ్యాపారానికి అడ్డుఅదుపు లేకుండా సాగుతోంది.

అడ్డుకట్ట ఏదీ?
తూమకుంటలో పోలీసు దాడుల్లో పట్టుబడిన గుట్కా (ఫైల్‌ ఫొటో)

అడ్డుకట్ట ఏదీ?

గుట్టుగా గుట్కా..

యథేచ్ఛగా కర్ణాటక మద్యం విక్రయాలు

చెక్‌పోస్టులు దాటి.. జిల్లాలోకి అక్రమ రవాణా

అక్రమార్కులకు కలిసి వచ్చిన కరోనా..

రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్న వైనం

హిందూపురం, జూన్‌ 19: నిషేధిత గుట్కా, అక్రమ మద్యం రవాణా, వ్యాపారానికి అడ్డుఅదుపు లేకుండా సాగుతోంది. కొన్ని రోజులుగా పోలీసుల దాడుల్లో గుట్కా, కర్ణాటక మద్యం పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం. జిల్లాకు కర్ణాటక సరిహద్దు ప్రాంతం అధికంగా ఉండటంతో భారీగా నిషేధిత గుట్కా, అక్రమ మద్యం రవాణాకు మార్గమేర్పడుతోంది. ఇదే హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో కొందరు గుట్కా, అక్రమ మద్యం వ్యాపారాలకు కలిసి వస్తోంది. కరోనా కర్ఫ్యూ కూడా కర్ణాటక మద్యం, గుట్కా విక్రయాలకు కలిసి వస్తోంది. ఓవైపు కర్ణాటక నుంచి మద్యం, గుట్కా జిల్లాకు భారీగా వస్తుంటే ఇంకోవైపు జిల్లా నుంచి రేషన్‌ బియ్యం కర్ణాటకకు తరలింపు యఽథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దుల్లో గ్రామీణ రహదారుల్లో సెబ్‌, శాండ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా నిలువరించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. 


 ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం

ఇటీవల కర్ణాటక సరిహద్దులోని మద్యం దుకాణాలకు భారీగా ఆదాయం వస్తోంది. బాగేపల్లి, గౌరీబిదనూరు, తుమకూరు, పావడగ, మధుగిరి తాలుకాల్లోని జిల్లా సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం మరిన్ని మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతిచ్చింది. సరిహద్దులో కర్ణాటక భారీగా మద్యం దుకాణాల ఏర్పాటుతో చాలామంది ఆ మద్యాన్ని జిల్లాలోకి అక్రమంగా రవాణా చేసి, రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కర్ణాటక మద్యం దుకాణాలే వెలిసినట్లుగా వ్యాపారం సాగుతోంది. హిందూపురంతోపాటు పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్ల, రొద్దం ప్రాంతాల్లో సరిహద్దులు దాటి పెనుకొండ, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం ప్రాంతాలకు రవాణా అవుతుండటంతో కర్ణాటక మద్యం ఏరులైపారుతోంది. ఈ మద్యం  జాతీయ రహదారితోపాటు జిల్లాలోకి వచ్చే అడ్డదారుల్లో కర్ణాటక నుంచి రోజూ దిగుమతి అవుతోంది. ఇటీవల హిందూపురం, పరిగి, చిలమత్తూరు, లేపాక్షి, రొద్దం, గోరంట్ల మండలాల్లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వారు ప్రతిరోజు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. కొందరు ద్విచక్రవాహనాలతోపాటు కార్లు, గూడ్స్‌ వాహనాల్లో తరలిస్తున్నట్టు తెలిసింది. తాజాగా రూటు మార్చి ఏకంగా సెప్టిక్‌ ట్యాంక్‌లో పావగడ నుంచి కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వారిని పెనుకొండ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసింది. ఇలా పలు మార్గాల్లో నిత్యం సరిహద్దు దాటి కర్నాటక మద్యం జిల్లాలోకి వచ్చేస్తోంది.


 ఆగని గుట్కా విక్రయాలు 

ఇటీవల కర్ణాటక నుంచి గుట్కా అక్రమ రవాణా పెరిగింది. గుట్కా వ్యాపారులు బెంగళూరు, చింతమణి, చిక్‌బళ్లాపురం, పావగడ, మధుగిరి ప్రాంతాల నుంచి ద్వి చక్రవాహనాలు, గూడ్స్‌ వాహనాలు, కార్లలో జిల్లాకు రవాణా చేస్తున్నారు. హిందూపురం పట్టణం కర్ణాటక సరిహ ద్దులో ఉండటం గుట్కా వ్యాపారులకు మరింత కలిసొచ్చినట్లు చెప్పవచ్చు. గత సోమవారం హిందూపురం మండలం తూముకుంటలో పోలీసులు దాడుల్లో భారీఎత్తున గుట్కా ప్యాకెట్లు, గుట్కా తయారీ పౌడరు, గుట్కా ప్యాకింగ్‌ చేసే పేపర్‌ రోల్స్‌, తయారుచేసే యంత్రం పట్టుబడటం ఆందోళన కల్గిస్తోంది. వారం కిందట పట్టణంలోని గుట్కా వ్యాపారులపై పోలీసులు నిఘా ఉంచి, దాడులు చేయగా హస్నాబాద్‌, అహ్మద్‌నగర్‌, ముక్కడిపేట, రహమత్‌పురం, కోటప్రాంతంలో గుట్కాను సరఫరా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.1.60 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఇటీవల గుట్కా విక్రయదారులు పోలీసులకు పట్టుబడుతునే ఉన్నారు. హిందూపురం నుంచే పెనుకొండ, పరిగి, మడకశిర, గోరంట్ల ప్రాంతాలకు గుట్కా సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా కర్ఫ్యూతో పోలీసులు కరోనా నియంత్రణపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే అదునుగా గుట్కా, అక్రమ మద్యం వ్యాపారులు కర్ణాటక నుంచి నిషేధిత పదార్థాలు రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ఉక్కుపాదం మోపకపోతే మద్యం, గుట్కా మాఫియాలు రాజ్యమేలే పరిస్థితి వస్తుందన్న ఆందోళన నెలకొంది.


నిఘా పెట్టాం: మహబూబ్‌బాషా, డీఎస్పీ, పెనుకొండ

కర్ణాటక నుంచి మద్యం, గుట్కా అక్రమ రవాణాపై నిఘా పెట్టి, అడ్డుకట్టు వేస్తున్నాం. కర్ణాటక నుంచి వచ్చే ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ దారుల్లోని సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టుల్లో తనిఖీలు పెంచడంతోపాటు అడ్డదారులపై నిఘా పెట్టి, చర్యలు చేపడుతున్నాం. ఇటీవల కర్ణాటక మద్యం రవాణా, నిషేధిత గుట్కా విక్రయించే వారిపై కేసులు నమోదు చేశాం. గుట్కా మూలాలను వెతుకుతున్నాం. కర్ణాటక మద్యం రవాణా కాకుండా సరిహద్దులో ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నాం.

Updated Date - 2021-06-20T06:46:00+05:30 IST