నా స్టైలే వేరు!

ABN , First Publish Date - 2021-08-02T06:17:04+05:30 IST

: ఆ ఉన్నతాధికారి స్టైలే వేరు. పని వేళలు అస్సలు గుర్తుండవు.

నా స్టైలే వేరు!
హౌసింగ్‌ ఏఈ కార్యాలయంలో రాత్రి 11 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లు, సిబ్బంది

జిల్లా హౌసింగ్‌లో  ఉన్నతాధికారి

మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి అర్ధరాత్రి వరకూ సమీక్షలు

ఇష్టారీతిన సిబ్బంది బదిలీ

ఉన్నతాధికారి వైఖరితోబెంబేలెత్తిపోతున్న ఉద్యోగులు తీరు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు1: ఆ ఉన్నతాధికారి స్టైలే వేరు. పని వేళలు అస్సలు గుర్తుండవు. తాను ఏ సమయానికి కార్యాలయానికి వచ్చినా లెక్కలేదు. కానీ తాను పని చేసేంతవరకు శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది పని చేయాల్సిందే. అది అర్ధరాత్రి 12 గంటలైనా సరే. సాధారణంగా ఉద్యోగులకు భోజన విరామం మధ్యాహ్నం 1 గంటకో రెండు గంటలకో ఉంటుంది. తనకు మాత్రం సాయంత్రం 4 గంటలకట. అరకొర వేతనంతో బతికే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బదిలీలు, ఇతర చర్యలతో ఇబ్బందిపెడుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉన్నతాధికారి వింత వైఖరితో రెండు మూడేళ్లకు ఉద్యోగ విరమణ చేయాల్సిన ఉద్యోగులు సైతం ఇప్పుడే వీఆర్‌ఎస్‌ తీసుకుందామని చర్చించుకుంటున్నారు. ఇలాంటి వివాదాలకు జిల్లా గృహనిర్మాణ శాఖ కేంద్రమవుతోంది. 

      అధిక పని వేళలతో గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటలకే విధులకు హాజరైతే రాత్రి 11 గంటల వరకు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. శాఖలోని ఓ ఉన్నతాధికారి వైఖరితో అటు అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. చిరుద్యోగులపై కర్రపెత్తనం చేస్తూ అనేక సమస్యలను సృష్టిస్తున్నారనే విమర్శలు ఆయనపై గట్టిగా వినిపిస్తున్నాయి. అరకొర వేతనం వచ్చే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సైతం సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి బదిలీ చేయడంతో ఆ బాధిత ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. హౌసింగ్‌ పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఐదుగురిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, స్వీపర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లపై కర్ర పెత్తనం చేస్తున్న ఆ ఉన్నతాధికారి వైఖరిపై సర్వత్రా వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు వి రుద్ధంగా సొంత అజెండాతో విధుల నిర్వహణ, పనివేళలు విధించడంపై ఆ శాఖలో ఇంజనీర్లు, ఉద్యోగులు విసిగి వేసారిపోతున్నారు. 


డమ్మీగా మారిన హౌసింగ్‌ పీడీ పోస్టు

ఇదివరకు హౌసింగ్‌ పీడీ పోస్టు చాలా కీలకంగా ఉండేది. అంతేగాక జిల్లా స్థాయి అధికారుల్లో హౌసింగ్‌ పీడీకి ప్రత్యేక స్థానం, ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రభుత్వ ప్రొటోకాల్‌, నియమ, నిబంధనల మేరకు ఏ ఫైల్‌ అయినా పీడీ నుంచి ఉన్నతాధికారికి వెళ్లాలి. అయితే ప్రస్తుతం హౌసింగ్‌లో నిబంధనలకు తూట్లు పొడుస్తూ నేరుగా ఉన్నతాధికారే జోక్యం చేసుకుని ప్రతిదీ తన గుప్పెట్లో నడవా ల్సిందేననే వింత వైఖరితో ఇంజనీర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. 


మడకశిర నుంచి జిల్లా కేంద్రానికి స్వీపర్‌ బదిలీ 

ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న స్వీపర్‌ను మడకశిర నుంచి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ పీడీ కార్యాలయానికి బదిలీ చేశారు. అరకొర వేతనం(రూ.10 వేలు) వచ్చే ఆ స్వీపర్‌ మడకశిర నుంచి అనంతపురానికి అప్‌అండ్‌డౌన్‌ చేయడానికి నిత్యం రూ.300 వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.  నెలకు రానుపోను ప్రయాణ ఖర్చు రూ.9 వేలు వస్తుంది. దీంతో వేతనంలో ఆ ఉద్యోగికి నెలకు మిగిలేది రూ.1000 మాత్రమే. ఇలా చాలా మంది ఉద్యోగులు హౌసింగ్‌ ఉన్నతాధికారి వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌసింగ్‌ పీడీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందిని ఇటీవల ఉన్నఫలంగా బదిలీ చేశారు. దీంతో ఇక్కడ జరగాల్సిన పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. 


మాకొద్దు ఈ ఉద్యోగం...

హౌసింగ్‌లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది సైతం ఆ ఉన్నతాధికారి  వైఖరితో విసిగివేసారిపోయారు. మాకు ఈ ఉద్యోగం వద్దు...జీతం వద్దు రాజీనామా చేస్తామంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగ విరమణకు నాలుగైదేళ్లు ఉన్నప్పటికీ వీఆర్‌ఎస్‌ తీసుకుంటామని పలువురు ఇంజనీర్లు, ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం. 30ఏళ్లుగా పనిచేసినా తాము ఎటు వంటి శ్రమ, అదనపు పనికి ఇబ్బంది పడలేదని...ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని భరించలేకున్నామని వారు వాపోతున్నారు. హౌసింగ్‌ పీడీ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధికారికి కేవలం వారం రోజుల్లోనే 5 మెమోలు జారీ చేయడం ఆ ఉన్నతాధికారి ఆనందానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కార్యాలయంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా... తన గురించే చర్చించుకుంటున్నారా లేక ఏ విషయాలను బయటకు చేరవేస్తున్నారా అనే విధంగా ఉన్నతాధికారి ఆరా తీయడం గమనార్హం. 


ఆ ఉన్నతాధికారి విధుల సమయమే వేరు !

హౌసింగ్‌లో ఉన్నతాధికారి విధుల సమయమే వేరు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కార్యాలయాల పని వేళలు ఒక రకమైతే హౌసింగ్‌లో పనివేళలే వేరుగా నడు స్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయానికి వ చ్చే ఆ ఉన్నతాధికారి సాయంత్రం 4 గంటలకు భోజన విరామానికి వెళ్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు కా ర్యాలయానికి వస్తే ఇక రాత్రి ఏ 11 గంటలో...ఏ 12 గంటలో కావాల్సిందే.  జిల్లా వ్యాప్తంగా ఉన్న హౌసింగ్‌ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది కూడా ఇదే సమయానికి అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. హౌసింగ్‌ ఉన్నతాఽఽధికారి వీడియో కాన్ఫరెన్స్‌, టెలీకాన్ఫరెన్స్‌, సమీక్షా సమావేశమంటే ఇంజనీర్లు, ఉద్యోగులకు ఇక ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇలా హౌసింగ్‌లో ఉన్నతాధికారి వైఖరితో ఇంజనీర్లు, ఉద్యోగులు సమస్యను ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్‌ జో క్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని రహస్యంగా ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు సమాచారం.  

Updated Date - 2021-08-02T06:17:04+05:30 IST