రాయలసీమ జలాలపై ఐక్యంగా పోరాడదాం : జేసీపీఆర్‌

ABN , First Publish Date - 2021-08-02T06:19:24+05:30 IST

రాయలసీమ జలాల కేటాయింపుపై ఐక్యంగా పోరాడదామని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

రాయలసీమ జలాలపై ఐక్యంగా పోరాడదాం : జేసీపీఆర్‌
రఘువీరారెడ్డిని కలిసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

మడకశిర,  ఆగస్టు 1: రాయలసీమ జలాల కేటాయింపుపై ఐక్యంగా పోరాడదామని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్వగ్రామమైన  నీలకంఠాపురంలో నిర్మించి న దేవాలయాలను జేసీపీఆర్‌ సందర్శించారు. రఘువీరారెడ్డి స్వయంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ఆలయాల విశిష్టత తదితర విషయాలను ప్రభాకర్‌ రెడ్డికి వివరించారు. దేవాలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీ జెండాతో కాకుండా కేవలం అజెండాతో మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా నాయకులను కలుస్తున్నానన్నారు. ఇప్పటికే మైసూరారెడ్డితోపాటు రాయలసీమలో చాలా మంది సీనియర్‌ నాయకులను కలిశానన్నారు. భవిష్యత్‌ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందనీ, ఇదే విషయాన్ని రఘువీరారెడ్డికి కూడా తెలిపానన్నారు. ఈ అజెండాలో విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఉద్యోగులు ఉన్నారన్నారు. అందులో భాగంగా రఘువీరారెడ్డిని కలిశానన్నారు. రాయలసీమ నీటి అజెండాను వివరించానన్నారు. రఘువీరారెడ్డి త్వరలోనే తమ నిర్ణయాన్ని వెలువరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరం ఏకతాటిపైకి వచ్చి సీమ జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2021-08-02T06:19:24+05:30 IST