ఇప్పటికి రెండు లైన్లే..

ABN , First Publish Date - 2021-06-23T06:49:56+05:30 IST

పట్టణంలోని మెయిన్‌ రోడ్డు విస్తరణ రాజకీయ చదరంగంలో చిక్కుకుని ముందుకు కదలడంలేదు.

ఇప్పటికి రెండు లైన్లే..
’కదిరిలోని మెయిన్‌ రోడ్డు

‘రాజకీయాల దారి’ద్య్రం

ఇప్పటికి రెండు లైన్లే..

పరిహారం ఇచ్చాకే.. నాలుగు లైన్లు..

అడ్డదిడ్డంగా ఆక్రమణల తొలగింపు

గుంతల రోడ్డుతో ప్రజల ఇబ్బందులు

ట్రాఫిక్‌ జామ్‌లతో వాహనదారుల అగచాట్లు

కదిరి, జూన్‌ 22: పట్టణంలోని మెయిన్‌ రోడ్డు విస్తరణ రాజకీయ చదరంగంలో చిక్కుకుని ముందుకు కదలడంలేదు. రోడ్డు విస్తరణను కుదించినా.. అవాంతరాలు తప్పడంలేదు. విస్తరణ పనులు సగం వరకే సాగనున్నాయి. మిగిలిన సగం పనులు ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తరువాతే చేయనున్నారు. ఇప్పటికే పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మొయిన్‌ రోడ్డు విస్తరణ పనులు ఏడాదిగా ముందుకు కదలట్లేదు. దీంతో గతుకుల రోడ్డులో వెళ్లలేక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఏ దుకాణానికి వెళ్లాలన్నా తప్పకుండా మెయిన్‌ రోడ్డుకు వెళ్లాల్సిందే. ఈ రోడ్డులోనే బెంగుళూరు, హిందూపురానికి వాహనాలు వెళ్లాలి. గతుకుల రోడ్డుకు మరమ్మతులు చేయడానికి మున్సిపల్‌ అధికారులు టెండర్లు పిలిచారు. రోడ్డులో ఆక్రమణలు తొలగించాలనీ, 80 అడుగుల రోడ్డు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీనిని సవరించి 60 అడుగులకే కుదించారు. అది కూడా ఎన్టీఅర్‌ సర్కిల్‌ నుంచి రాయలసీమ సర్కిల్‌ వరకు మాత్రమే వేయడానికి పనులు ప్రారంభించారు. మంగళవారం మార్కింగ్‌ పనులు మొదలుపెట్టారు. పట్టణంలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ప్రస్తుతానికి వాయిదాపడినట్లే కనిపిస్తోంది.


పరిహారం ఇచ్చాకే మిగిలిన రోడ్డు విస్తరణ

ఎన్టీఅర్‌ సర్కిల్‌ నుంచి రాయలసీమ సర్కిల్‌ వరకు ప్రస్తుతం 60 అడుగుల రోడ్డు వేయడానికి మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఅర్‌ సర్కిల్‌ నుంచి కోనేరు వరకు పూర్తిగా రోడ్డు వేయడానికి అధికారులు గతేడాది అక్టోబరులో దాదాపు రూ.2.30 కోట్లతో టెండర్లు పిలిచారు. ఆ తరువాత మార్కింగ్‌ వేశారు. మొదట 80 అడుగుల రోడ్డుకు మార్కింగ్‌ వేశారు. కొంతమంది ఇళ్ల యజమానులు కోర్టుకెళ్లడంతో రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్‌ పడింది. ఆ తరువాత కరోనా మొదటి, రెండో వేవ్‌లు, స్థానిక సంస్థల ఎన్నికలతో జాప్యమైంది. మున్సిపల్‌ అధికారులు 80 అడుగుల రోడ్డు వేయడానికి నిర్ణయించినా.. 60 అడుగులకే విస్తరణ చేస్తున్నారు. రాయలసీమ సర్కిల్‌ నుంచి కోనేరు వరకు ప్రస్తుతం రోడ్డు వేయడం లేదు. ఇక్కడ ఎక్కువ మంది ఇళ్లు కోల్పోనున్నారు. వీరంతా పట్టాలు కలిగిన వారు. వీరందరికీ పరిహారం ఇవ్వాలని కోర్టుకెళ్లారు. గతంలో ఈ రోడ్డు తిరువీధులకే పరిమితం అయి ఉండేది. కాలక్రమేణా హిందూపురం రహదారిగా మారింది. అప్పటి నుంచి ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. జనాభా పెరగడంతో ట్రాఫిక్‌ అధికమైంది. దీంతో రోడ్డు విస్తరించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఎక్కువ మంది సొంత ఆస్తి కావడంతో పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. టీడీఅర్‌ (ట్రాన్స్‌ఫర్‌ అఫ్‌ రైట్స్‌) ద్వారా ఇళ్లను ఇవ్వాలని మున్సిపాలిటీ కోరగా అందుకు సమ్మతించలేదు. ఇళ్ల యజమానులు పరిహారం కోసం కోర్టుకెళ్లారు. వారందరికీ పరిహారం చెల్లించాలంటే కోట్ల రూపాయలు అవసరం. ప్రస్తుతం మున్సిపాలిటీ రోడ్డు విస్తరణ మొదలుపెట్టింది రూ.2.30 కోట్లతోనే. అందువల్లే రాయలసీమ సర్కిల్‌ నుంచి కోనేరు వరకు రోడ్డు విస్తరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లే.


ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు

పట్టణంలో హిందూపురం క్రాస్‌ నుంచి కోనేరు వరకు ఉన్న ఇరుకు రోడ్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డులో రెండు పెద్ద వాహనాలు ఎదురెదురుగా వస్తే ముందుకెళ్లడం తీవ్ర  కష్టంగా ఉంది. దీంతో వెనుక ఉన్న వాహనాలు రెండువైపులా బారులు తీరుతాయి. ఈ రోడ్డు 20 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీనికితోడు మలుపులు కూడా ఎక్కువుగా ఉన్నాయి. శుక్ర, శని, అదివారాల్లో ఈ రోడ్డు మరింత రద్దీగా ఉంటుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈ రోడ్డు నుంచే వెళ్లాలి. దీంతో ఆలయానికి వచ్చే వాహనాలు, భక్తులతో రద్దీ పెరిగిపోతుంది. ట్రాఫిక్‌ జామ్‌ నిత్యకృత్యం. రాత్రి వేళల్లో సిమెంటు లారీల ధాటికి ద్విచక్రవాహనదారులు, కాలినడకన వెళ్లేవారు భయపడుతున్నారు. సిమెంటు లారీల కింద పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. టవర్‌క్లాక్‌ నుంచి  కోనేరు వరకు రోడ్డు మరీ చిన్నదిగా ఉండడంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.


రోడ్డు విస్తరణ మొదలు పెట్టాం

మెయిన్‌ రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టాం. రోడ్డు చిన్నదిగా ఉండడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. హిందూపురం రోడ్డులో ఉండే ఇళ్ల యజమానులు శబ్దాలు, దుమ్ము వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. రోడ్డు విస్తరణ తథ్యం. 80 అడుగుల రోడ్డు విస్తరణను 60 అడుగులకు కుదించాం. కోర్టుకెళ్లిన వారు ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ఆలోచించాలి.

- పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే


60 అడుగుల రోడ్డుకే కట్టుబడి ఉన్నాం

ఎన్టీఅర్‌ సర్కిల్‌ నుంచి రాయలసీమ సర్కిల్‌ వరకు 60 అడుగుల రోడ్డుకే కట్టుబడి ఉన్నాం. ఎక్కువమంది ఇళ్లు కోల్పోకుండా 60 అడుగులకే రోడ్డు విస్తరణ కుదించాలని అధికారులకు తెలిపాం. అ మేరకు రోడ్డు పనులు చేయాలని కోరుతున్నాం. రాయలసీమ సర్కిల్‌ నుంచి కోనేరు వరకు ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం అందించిన తరువాత రోడ్డు వేయాలన్నది మా డిమాండ్‌. రోడ్డు విస్తరణకు మేం అనుకూలం.

- కందికుంట వెంకటప్రసాద్‌, కదిరి టీడీపీ ఇన్‌చార్జి


పరిహారం చెల్లించి, రోడ్డు విస్తరించాలి

మెయిన్‌ రోడ్డు విస్తరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. పట్టణంలో ట్రాఫిక్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు కోల్పోయే ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలి. ఆక్రమణలో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణానికి డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. ఉన్నఫలంగా తొలగిస్తే నష్టపోతారు. కావున అందరికీ పరిహారం చెల్లించాలి.

- జీఎల్‌ నరసింహులు, సీపీఎం జోనల్‌ కార్యదర్శి


బలిపీఠాలు ముట్టుకోకూడదు

మెయిన్‌రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులు అత్యవసరం. వెంటనే ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం చెల్లించి, రోడ్డు విస్తరించాలి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం పడమర గోపురం ఎదురుగా ఉన్న బలిపీఠాలను తొలగించకూడదు. ఇది ఆలయ పవిత్రతకు సంబంధించిన విషయం. ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి.

- వజ్ర భాస్కర్‌రెడ్డి, బీజేపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు


ఆక్రమణలు తొలగించాల్సిందే

మెయిన్‌రోడ్‌ను విస్తరించాలంటే ఆక్రమణలు తొలగించాల్సిన అవసరముంది. ప్రైవేటు ఆస్తులకు న్యాయంగా రావాల్సిన పరిహారం అందించాలి. ఇళ్లు కోల్పోయే వారిని భయపెట్టకుండా సామరస్యంగా విస్తరణ పనులు చేయాలి.

- వేమయ్యయాదవ్‌, సీపీఐ డివిజన్‌ కార్యదర్శి


మొదట రాయలసీమ సర్కిల్‌ వరకే..

మెయిన్‌రోడ్డు విస్తరణ మొదట ఎన్‌టీఅర్‌ సర్కిల్‌ నుంచి రాయలసీమ సర్కిల్‌ వరకు ఉం టుంది. అ తరువాత రాయలసీమ సర్కిల్‌ నుంచి కోనేరు వరకు రోడ్డు విస్తరణ ఉంటుంది. 60 అడుగుల రోడ్డు విస్తరణకు మార్కింగ్‌లు వేశాం. ఆక్రమణలు తొలగించుకోవడానికి సమ యం ఇచ్చాం. తొలగించుకోకపోతే తామే తొలగిస్తాం.

-  ప్రమీల, మున్సిపల్‌ కమిషనర్‌


మెయిన్‌రోడ్డు విస్తరణ అవసరమే.. 

మెయిన్‌రోడ్‌ విస్తరణ అవసరమే.. ప్రస్తుత జనాభాకు తగ్గట్టు రోడ్డు వెడల్పు చేయాలి. ఆక్రమణలు తొలగించాలి. ప్రయివేటు ఆస్తులను తొలగిస్తే వారికి నష్టపరిహారం చెల్లించాలి.

- షానవాజ్‌, కదిరి కాంగ్రెస్‌ ఇన్‌చార్జి 

Updated Date - 2021-06-23T06:49:56+05:30 IST