Abn logo
Sep 24 2021 @ 00:54AM

‘ఎన్నికలు’ తెచ్చిన తంటా.. బడిలో మధ్యాహ్న భోజనం బంద్‌

శింగనమల మండలం పి. జలాలపురం గ్రామంలో ఖాళీ ప్లేట్లతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు

తన వర్గీయుడు చైర్మన్ కాలేదన్న అక్కసుతో వంట వండని ఏజెన్సీ నిర్వాహకుడు

ఆకలితో అలమటించిన విద్యార్థులు

ఖాళీ ప్లేట్లతో నిరసన


శింగనమల: పాఠశాల తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ (పీఎంసీ) ఎన్నికల పుణ్యమాని విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. తన వర్గీయుడు పాఠశాల పీఎంసీ చైర్మన్ కాలేదనే అక్కసుతో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకుడు అర్ధాంతరంగా చేతులెత్తేశాడు. భోజనం వండననీ, ఏజెన్సీ వదులుకుంటున్నట్లు తెగేసి చెప్పాడు. దీంతో మండలంలోని పి. జలాలపురం పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారు. పాఠశాలలో ఈనెల 22న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులే రెండు వర్గాలుగా విడిపోయి, పోటీ చేశాయి. సర్పంచ్ మద్దతుదారుడు అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. ఎన్నిక ఏకపక్షంగా నిర్వహించారని మరోవర్గం ఫిర్యాదు చేసింది.


అలాగే ఐదేళ్లుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్న నాగరాజు.. తన వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ కాలేదన్న అక్కసుతో గురువారం ఉదయం ఏజెన్సీ వదులుకుంటున్నట్లు తెగేసి చెప్పాడు. హెచ్ఎం ప్రాధేయపడినా భోజనం చేయలేదు. దీంతో 30 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనంలేక అల్లాడిపోయారు. ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మండల విద్యాధికారి (ఎంఈఓ) నరసింహరాజును అడగ్గా.. పి. జలాలపురం పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుడు ఆర్ధాంతరంగా మానేశాడన్నారు. వెంటనే కొత్త నిర్వాహకుడిని నియమిస్తామన్నారు.