ఘాటెక్కిన ఉల్లి

ABN , First Publish Date - 2020-10-30T09:26:06+05:30 IST

ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 20 రోజుల కిందట వరకు కిలో రూ.30 పలికిన ఉల్లి ధరలు ప్రస్తుతం రూ.వందకు చేరా యి.

ఘాటెక్కిన ఉల్లి

 కిలో రూ.100పైమాటే

పెరిగిన ధరలతో జనం బెంబేలు

 రాయితీ ఉల్లిగడ్డలకు పెరిగిన డిమాండ్‌


అనంతపురంరూరల్‌, అక్టోబరు 29 : ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 20 రోజుల కిందట వరకు కిలో రూ.30 పలికిన ఉల్లి ధరలు ప్రస్తుతం రూ.వందకు చేరా యి. బహిరంగ మార్కెట్‌ల్లో మొదటి రకం ఉల్లి ధర రూ.100 ఉంటే ఆతరువాత రకం రూ.80 పలుకుతోంది. చిన్న సైజు ఉల్లిగడ్డలు సైతం రూ.60 పలుకుతున్నాయి.   


అధిక వర్షాలతో పెరిగిన ధరలు

ఇటివల కురిసిన అధిక వర్షాలతో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది. ప్రతి రోజు జిల్లాకు దాదాపు 200 నుంచి 300 టన్నుల వరకు ఉల్లి దిగుమతి జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల మహారాష్ట్రలో పంట పూర్తిగా దెబ్బతింది. కర్నూలులోను ఇదే పరిస్థితి. ఈనేపథ్యంలో   మహారాష్ట్రలోనే కిలో రూ.30కంటే ఎక్కువగా పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలులోనూ రూ.40పైనే పలుకుతున్నాయి. దీంతో జిల్లాలో ఉల్లి ధరలు మరింతగా పెరిగాయి. 


జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం

ఉల్లి ధరలు పెరగడానికి జిల్లాలో ఉల్లి సాగు తగ్గడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. జిల్లాలో రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, యాడికి, రాయలచెరువు ప్రాంతాల్లో ఉల్లి సాగు అధికంగా ఉంటోంది. ఈప్రాంతాలన్నింటిలోకి రాయదుర్గం ప్రాంతం ఉల్లి సాగులో ముందు ఉంటోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉల్లి కోతలు పూర్తిగా అయిపోయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉల్లి సాగులోనే ఉంది. ఈ ఖరీఫ్‌లో 2వేల హెక్టార్లలో పంట సాగైనట్లు ఉద్యాన శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది జిల్లాలో దాదాపు 4500 హెక్టార్లలో ఉల్లి సా గైంది. ఈ ఏడాది దాదాపు సగానికి సగం సాగు తగ్గిపోయింది.   


రాయితీ గడ్డలకు పెరిగిన డిమాండ్‌..

బహిరంగ మార్కెట్‌ల్లో ఉల్లి ధరలు పెరగడంతో ప్రభుత్వ రాయితీ ఉల్లిగడ్డలకు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో రాయితీపై కిలో రూ.40తో ఉల్లిగడ్డలు అందిస్తోంది. ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలోని రైతుబజారులో ఉల్లి విక్రయాలు ప్రారంభించారు. ప్రారంభం నుంచి రాయితీ ఉల్లి గడ్డల కోసం జనం క్యూ కడుతున్నారు. కిలో మీటర్ల మేర  బా రులు తీరుతున్నారు. రోజుకు 5 టన్నులకు పైగా రాయితీ ఉల్లి గడ్డలు అయిపోతున్నట్లు రైతుబజారు అధికారులు చెబుతున్నారు. దీని బట్టి రాయితీ ఉల్లిగడ్డలకు ఏస్థాయి లో డిమాండ్‌ ఉందో అర్థమవుతోంది.


30టన్నులు వచ్చాయి : నారాయణమూర్తి, ఏడీ మార్కెటింగ్‌శాఖ.

 విక్రయాల ప్రారంభంలో 8.55 టన్నులు కర్నూలు నుంచి దిగుమతి చేసుకున్నాం. మూడు రోజుల కిందట  మహా రాష్ట్ర నుంచి 26 టన్నులు దిగుమతి చేసుకున్నాం. ప్రస్తు తం రైతుబజారులో మాత్రమే విక్రయిస్తున్నాం. త్వరలోనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లోను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మార్కెట్‌ కమిటీల్లోను ఉల్లి విక్రయాలు ప్రారంభిస్తాం. 


కొనకుండానే కంటనీరు తెప్పిస్తోంది : కృష్ణవేణి, గృహిణి, ఆజాద్‌ నగర్‌

వంటింట్లో ఉల్లిపాయ లేకుండా కూరలు వండాలంటే ఎం తో కష్టం. రైతుబజారులో రాయితీ ఉల్లిగడ్డల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రూ.100 వెచ్చించి బయట మార్కెట్‌ల్లో కొనలేము. ప్రభుత్వం ఎక్కువ మొ త్తంలో సరుకు తెప్పించి వినియోగదారులకు అందించాలి.

రూ. వందకు 5 కేజీలు వచ్చేవీ : గౌరమ్మ, గృహిణి, మన్నీల

గతంలో వంద రూపాయలకు 5కేజీలు ఎర్రగడ్డలు వచ్చేవి. ఒక నెలరోజుల పాటు మాకుటుంబ అవసరాలు తీరేవీ. ఇప్పుడు వంద రూపాలకు ఒక కేజీ వంద రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాలాంటి వారు వంద రూపాయలు పెట్టి ఎర్రగడ్డలు కొనాలంటే భయమేస్తోంది. 

Updated Date - 2020-10-30T09:26:06+05:30 IST