పింఛన్‌ టెన్షన్‌..!

ABN , First Publish Date - 2021-08-01T06:51:52+05:30 IST

జిల్లాలో పింఛన్‌ పంపిణీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పింఛన్‌ టెన్షన్‌..!

పింఛన్ల పంపిణీ 

సవ్యంగా సాగడంపై అనుమానాలు

సచివాలయాలకు డబ్బు జమలో జాప్యం

శనివారం రాత్రి వరకు బ్యాంకుల్లో వేచిచూసిన వలంటీర్లు

డబ్బు జమకాకపోవడంతో నిరాశతో వెనక్కి

నేడు జమ చేసినా.. డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు సెలవు

బయోమెట్రిక్‌ డివైజ్‌ల కొరతతో అవస్థలు

సోమందేపల్లి-1 సచివాలయంలో వలంటీర్ల నిరసన 

అయోమయంలో యంత్రాంగం

అనంతపురం వ్యవసాయం, జూలై 31: జిల్లాలో పింఛన్‌ పంపిణీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎ్‌సఆర్‌ పింఛన్‌ కానుక ద్వారా పింఛన్ల సొమ్ము పంపిణీ సవ్యంగా సాగేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్‌ సొమ్మును ఆదివారం నుంచి మూడు రోజులపాటు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలకు సంబంధించి జిల్లాకు 5.18 లక్షల మందికి రూ.126.69 కోట్లు మంజూరు చేశారు. ప్రతి నెలారంభానికి ముందురోజే మొత్తం డబ్బులను ఆయా సచివాలయాలకు ప్రభుత్వం జమ చేస్తోంది. ఆ డబ్బును సచివాలయ అధికారులు డ్రా చేసుకుని, వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయిస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి శనివారం రాత్రిదాకా వందలాది సచివాలయాలకు పింఛన్‌ డబ్బు జమ చేయలేదు. అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలకు కూడా శనివారం అర్ధరాత్రి వరకు డబ్బు జమ కాలేదు. నగరంలో రాత్రి  సమయానికి ఎనిమిది సచివాలయాలకు మాత్రమే పింఛన్‌ డబ్బు జమైనట్లు సమాచారం. జమకాని సచివాలయాలకు సంబంధించిన అధికారులు, వలంటీర్లు బ్యాంకులు, కార్యాలయాల్లోనే నిరీక్షించారు. రాత్రి 10 గంటలు దాటినా డబ్బు జమ కాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద వలంటీర్లు వేచి చూసి డబ్బు పడకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. జిల్లావ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి దాకా రూ.90 కోట్లు మాత్రమే సచివాలయాలకు జమైనట్లు సమాచారం. సాయంత్రంలోపు జమైన సచివాలయాల పరిధిల్లో డబ్బు డ్రా చేసుకున్నారు. రాత్రి సమయంలో డబ్బు జమ కావడంతో మరికొన్ని సచివాలయ అధికారులు బ్యాంకుల్లో డ్రా చేయలేకపోయారు. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులు పనిచేయవు, కావున డబ్బు డ్రా చేసుకునే అవకాశం లేదు. సోమవారం తీసుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో తొలి రోజు పింఛన్‌ పంపిణీ జిల్లాలో సవ్యంగా సాగడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.


డివైజ్‌ల కొరతతో వలంటీర్ల అవస్థలు 

పింఛన్‌ సొమ్ము పంపిణీ చేసేందుకు వలంటీర్లకు తగిన బయోమెట్రిక్‌ డివైజ్‌లు లేకపోవడంతో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో అవస్థలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 30 శాతానికిపైగా వలంటీర్లకు డివైజ్‌ల కొరత ఉన్నట్లు సమాచారం. దీంతో తమకు అనుకూలమైన వలంటీర్లతో డివైజ్‌లు ఇప్పించుకుని, వంతుల వారీగా పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏడాదిగా వలంటీర్లు డివైజ్‌ల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సోమందేపల్లి-1 సచివాలయం పరిధిలోని వలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. డివైజ్‌లు తగినన్ని ఇవ్వకుండా ఎలా పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను నిలదీశారు. వలంటీర్లందరికీ డివైజ్‌లు ఇస్తేనే పింఛన్‌ సొమ్ము పంపిణీ చేస్తామని భీష్మించారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... ఈ నెలలో కొన్ని సచివాలయాలకు డబ్బు జమ కావడంలో కొంత జాప్యమైన మాట వాస్తవమేనన్నారు. ఆదివారం సెలవు కావడంతో డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రతినెలా మూడు రోజులు పింఛన్‌ సొమ్మును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. మూడు రోజుల్లో వంద శాతం పింఛన్‌దారులకు డబ్బు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-01T06:51:52+05:30 IST