Abn logo
Sep 23 2021 @ 00:55AM

సర్వర్‌ సమస్యతో సతమతం

అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఈ-పోస్‌ మిషన్లతో నిరసన తెలుపుతున్న డీలర్లు

ఎఫ్‌పీ షాపు డీలర్ల నిరసన బాట 

దుకాణాలకు తాళాలు  

తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నినాదాలు

ఈ-పోస్‌ యంత్రాలు అప్పగింత

సమస్య పరిష్కరించాలని డిమాండ్‌

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 22: సర్వర్‌ సమస్యతో సతమతమవుతున్నామని చౌకధాన్యం దుకాణాల (ఎఫ్‌పీ షాపుల) డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై నిరసన బాట పట్డారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా 3 వేల ఎఫ్‌పీ షాపులకు బుధవారం తాళాలు వేశారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఈ-పోస్‌ మిషన్లతో నిరసన చేపట్టారు. అనంతపురం నగరంలో ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డి, నగరాధ్యక్షుడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పనిచేయని ఈ-పోస్‌ యంత్రాలతో ధర్నా చేశారు. సర్వర్‌ సమస్య పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. గుంతకల్లులో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింకల వెంకటేశ్వర్లు, ధర్మవరంలో ప్రధాన కార్యదర్శి పరంధామరెడ్డి ఆధ్వర్యంలో డీలర్లు.. తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మిగిలిన అన్ని మండలాల్లో స్థానిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో డీలర్లు నిరసన తెలియజేశారు. కొన్ని మండలాల్లో ఈ-పోస్‌ యంత్రాలను తహసీల్దార్‌ కార్యాలయాల్లో అప్పగించారు. స్థానిక అధికారులు.. డీలర్లతో చర్చించి, సర్వర్‌ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తిరిగి ఈ-పోస్‌ యంత్రాలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డి మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తొలిరోజు నుంచే సర్వర్‌ సమస్య ఎక్కువగా ఉండటంతో బియ్యం పంపిణీకి ఇబ్బందిగా మారిందన్నారు. కార్డుదారులు గంటల తరబడి ఎఫ్‌పీ షాపుల వద్దనే నిరీక్షించాల్సి వస్తోందన్నారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో వారికి సమాధానం చెప్పలేక నానా అవస్థలు పడుతున్నామన్నారు. కొందరు కార్డుదారులు వాగ్వాదానికి దిగుతున్నారన్నారు. సర్వర్‌ సమస్యపై ఇదివరకే ఉన్నతాధికారులకు తెలియజేసినా.. ఇప్పటికీ పరిష్కరించలేకపోతున్నారన్నారు. సమస్యను పరిష్కరించకపోతే బియ్యం పంపిణీ కష్టమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఉన్నతాధికారులు తక్షణం సర్వర్‌ సమస్యను పరిష్కరించి, కార్డుదారులు, డీలర్లకు ఉపశమనం కలిగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.