వ్యవసాయ శాఖలో వెలుగు చూస్తున్న అక్రమాలు

ABN , First Publish Date - 2021-06-19T06:52:27+05:30 IST

వ్యవసాయ శాఖలో జరుగుతున్న అక్రమాల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది.

వ్యవసాయ శాఖలో వెలుగు చూస్తున్న అక్రమాలు
వ్యవసాయ శాఖ కార్యాలయం

వ్యవసాయంలో స్వాహా

 వ్యవసాయ శాఖలో వెలుగు చూస్తున్న అక్రమాలు 

పొలంబడి నిధుల్లో గోల్‌మాల్‌

రూ. 30 లక్షల దాకా లావాదేవీల్లో స్వాహా పర్వం 

సొంత ఖాతాల్లో జమ చేసుకున్న అధికారులు 

ముఖ్యనేత జోక్యంతో కదులుతున్న డొంక 

సెలవులో వెళ్లిన వ్యవసాయ శాఖ ఏడీ 

రాయదుర్గం, జూన్‌ 18 : వ్యవసాయ శాఖలో జరుగుతున్న అక్రమాల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద అందిస్తున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడమే కాకుండా స్వాహా చేయటం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై వారు విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది.  ఇప్పటివరకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రికార్డులను కూడా తరలించినట్లు తెలియవచ్చింది. రూ. 30 లక్షల దాకా కొందరు అధికారులు నిర్వహించిన లావాదేవీల్లో స్వాహా చేసినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఏదో ఒక కారణంతో అధికారులు విచారణలు చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.  ఈ విషయంలో ఉన్నతాధికారులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)ని సెలవులో వెళ్లాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దీంతో రెండు రోజుల కిందట ఆరోగ్య కారణాలను చూపి ఏడీ సెలవులో వెళ్లారు. ఈ వ్యవహారం వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చకు తెరలేపింది. 


పొలంబడి నిధుల వినియోగంలో చేతివాటం 

ప్రభుత్వం పొలంబడి ద్వారా రైతులకు పంటలపై అవగాహన పెంచి, చైతన్యవంతులను చేసేందుకు నిధులను కేటాయిస్తుంది. ఈ నిధుల వినియోగంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలియవచ్చింది. నియోజకవర్గంలో ఉన్న 79 రైతు భరోసా కేంద్రాల్లో పొలంబడి నిర్వహణ కోసం ఒక్కోదానికి రూ. 16 వేల ప్రకారం ఖరీఫ్‌ సీజన్‌కు,  రబీ సీజన్‌కు సంబంధించి వీటిలో 33 రైతు భరోసా కేంద్రాలకు మొత్తం రూ. 17.92 లక్షలు మంజూరు చేసింది. వీటిని పొలంబడి నిర్వహించే కార్యక్రమానికి వినియోగించాల్సి ఉంటుంది.  వినియోగించిన ఖర్చులను వారి వారి ఖాతాల్లో జమ చేయాలి. కాగా కొందరు అధికారులు దొంగ బిల్లులను ఇచ్చి వాటిని స్వాహా చేసినట్లు సమాచారం. ప్రధానంగా వీటిపై ఆయా గ్రామాల్లో పొలంబడి నిర్వహించినట్లు రికార్డులను చూపేందుకు రైతుల ద్వారా ఖాతాలు తెరిపించి వారి ఖాతాల్లో వేయించి వసూలు చేసుకున్నట్లు సమాచారం. తూతూమంత్రంగా కార్యక్రమాన్ని నడిపించడం, కొన్ని చోట్ల ఏకంగా నడిపించకుండానే నడిపించినట్లు రికార్డులు సృష్టించి స్వాహా చేసినట్లు తెలియవచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. 


ఖాళీ స్లిప్పుల్లో సంతకాలు 

రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 300 ప్రకారం మంజూరు చేస్తోంది. 79 కేంద్రాలకు రూ. 23,700 నిధులు మంజూరవుతాయి. ప్రతి నెలా మీటింగ్‌ నిర్వహించినట్లు రికార్డులు సృష్టించి ఖాళీ స్లిప్పుల్లో సంతకాలు తీసుకుని వాటిని ఖర్చుచేసినట్లు చూపి దిగమింగినట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులకు ఈ వ్యవహారం తెలియడంతో దీనిపై కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. వీటితో పాటు ప్రభుత్వం వేరుశనగ కొనుగోలు చేసేందుకు మండలానికి ఇద్దరిని నియమించుకుని కొనుగోలు ప్రక్రియ సాగించేందుకు ఒకొక్కరికి రూ. 12 వేల ప్రకారం వేత నం అందిస్తోంది. ఇందులో కూడా చేతివాటం ప్రదర్శించినట్లు తెలియవచ్చింది. 


వేరుశనగ కొనుగోలులో కుమ్మక్కు 

ప్రభుత్వం కొనుగోలు చేసే వేరుశనగ వ్యవహారంలో అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు బలంగా వచ్చాయి. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయకుండా అనుకూల మైన వ్యక్తులను మధ్యవర్తులుగా పెట్టుకుని వారి ద్వారానే కొనుగోలు చేసి రైతుల వద్ద నుంచి చేసినట్లు రికార్డులు సృష్టించుకుని కుమ్మక్కు వ్యవహారాన్ని నడిపినట్లు ఫిర్యా దులు అందాయి. కమీషన్లతో పాటు వాటాలు కూడా పెట్టుకున్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు వ్యవసాయ అధికారులు చేతివాటం చూపి సొంత ఖాతాల్లో సొమ్మును వేసుకున్నట్లు తెలియ వచ్చింది. వీటన్నింటిపై ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. ఇప్పటికే వీటికి సంబంధించిన రికార్డులను సమగ్ర విచారణ చేస్తున్నట్లు సమాచారం. 


బెడిసికొట్టిన వ్యవహారం 

ప్రభుత్వం మంజూరు చేసే నిధులను ఖర్చుపెట్టి రికా ర్డులను సృష్టించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చేసుకోవడంలో కొందరు అధికారులు నేర్పరులు. ప్రధానం గా ఇప్పటివరకు జరిగిన వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించిన డబ్బు పంపకాల్లో మనస్పర్థలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో గుట్టుగా దోచుకునే డబ్బు వ్యవహా రాన్ని బట్టబయలు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేదాకా కొందరు వ్యవహారాన్ని నడిపినట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు లోతైన విచారణ చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఇద్దరు వ్యవసాయాధికారులు కీలకపాత్ర పోషిస్తు న్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ అండదం డలతో ఆ వ్యవహారం బయట పడకుండా కప్పి పుచ్చే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు తెలిసింది. కానీ సమగ్ర విచారణలో ఆ వ్యవసాయాధికారులను రక్షించే బాధ్యత మరో ఉన్నతాధికారి భుజస్కంధాలపై వేసుకున్న ట్లు సమాచారం. 


సెలవులో ఏడీ 

వ్యవసాయ శాఖ మంజూరు చేస్తున్న నిధుల వినియోగంలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు బలంగా వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఏడీని సెలవులో వెళ్లాల్సిందిగా ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఇప్పటికే రికార్డులను సమగ్ర తనిఖీ నిర్వహిస్తున్న నేపథ్యంలో తారుమారు జరిగే అవకాశం ఉండటమే కాకుండా దీని వెనుక కీలక సూత్రధారులు ఎవరనే విషయంపై కూడా నివేదికను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్య నేత జోక్యంతో అక్రమాల డొంక కదులుతున్నట్లు తెలి యవచ్చింది. దీంతో ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టడంతో ఏడీని సెలవులో పంపించినట్లు  సమాచారం. 

Updated Date - 2021-06-19T06:52:27+05:30 IST