మోపెడ్‌ వదిలి.. గాడిద జట్కాపై సవారీ..

ABN , First Publish Date - 2021-06-14T06:35:58+05:30 IST

పెట్రో ధరల పెరుగుదలకు అడ్డే లేదు.

మోపెడ్‌ వదిలి.. గాడిద జట్కాపై సవారీ..
రాయదుర్గం రోడ్లపై చక్కర్లు కొడుతున్న గాడిద జట్కా

రాయదుర్గం, జూన్‌ 13: పెట్రో ధరల పెరుగుదలకు అడ్డే లేదు. ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ప్రజలు భరించలేనంత లా. ఇక పెట్రోలు వేసుకుని, బండిలో తిరగలేమనే స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. ఇక వల్లకాదని రాయదుర్గం వాసి రమేష్‌.. ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నాడు. ఇతడు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. తన వృత్తి పనులను మోపెడ్‌ వాహనంపై తిరుగుతూ చేసుకునేవాడు. గతంలో మార్కెట్లో గాడిదల ధరలు విపరీతంగా పెరగడంతో పెట్రో ఇంధనంతో నడిచే వాహనాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. మార్కెట్లో గాడిదల ధర కంటే పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయి. గాడిదలే నయమని భావించి, వినూత్నంగా ఆలోచించాడు. తనకున్న మో పెడ్‌ వాహనానికి అయ్యే ఖర్చును బేరీజు వేసుకుని ఏకంగా గాడిదకు జట్కాను ఏర్పాటు చేశాడు. దీంతో పెట్రో భారం నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతున్నాడు. తన వృత్తిని సాఫీగా సాగిస్తాడు. తను ఏర్పాటు చేసిన రిక్షాను గాడిదకు కట్టి పట్టణంలో చక్కర్లు కొట్టిస్తున్నాడు. వింతగా చూస్తున్న ప్రజలు ఆరాతీస్తున్నారు. పెట్రోలు ధరలను భరించలేక పూర్వీకులు నమ్ముకున్న గాడిదలే నయమని భావించి, ఆధునికతను జోడించి రిక్షాను ఏర్పాటు చేశాననీ, దీని ద్వారా డబ్బు మిగలడమే కాకుండా ఒకేసా రి దుస్తులు మొత్తం తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని రమేష్‌ పే ర్కొంటున్నాడు.

Updated Date - 2021-06-14T06:35:58+05:30 IST