రోడ్డు పనులా.. వద్దు బాబోయ్‌..!

ABN , First Publish Date - 2021-04-14T06:54:00+05:30 IST

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రోడ్ల పనులంటే కాంట్రాక్టర్లు విపరీతమైన ఆసక్తి చూపేవారు. వాటిని దక్కించుకునేందుకు ఎందాకానైనా వెళ్లేవారు.

రోడ్డు పనులా.. వద్దు బాబోయ్‌..!

టెండర్లు పిలిచినా.. స్పందన కరువు..

దాఖలుకాని బిడ్‌లు..

ఆర్‌అండ్‌బీ పరిధిలో బిల్లుల భయం

రూ.250 కోట్లకుపైగా పెండింగ్‌

కొత్తగా టెండర్లు వేయడానికి 

ముందుకురాని కాంట్రాక్టర్లు

రెండోసారి టెండర్లు 

పిలిచిన అధికారులు

అనంతపురం కార్పొరేషన్‌, ఏప్రిల్‌13: 

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రోడ్ల పనులంటే కాంట్రాక్టర్లు విపరీతమైన ఆసక్తి చూపేవారు. వాటిని దక్కించుకునేందుకు ఎందాకానైనా వెళ్లేవారు. బెదిరింపులు, రాజకీయ సిఫార్సులు, ఒ త్తిళ్లు అన్ని అస్త్రాలనూ వాడేవారు. ఇ దంతా గతం. ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. ప్రస్తుతం ఆ పనులకు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు పట్టించుకోవట్లేదు. ఆ పనులు వద్దు బాబోయ్‌.. అంటూ దూరంగా ఉండిపోతున్నారు. ఎందుకంటే గతంలో చేసిన పనులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవటం, అసలు వస్తాయా, రావా.. అన్న సందేహాలే కారణం. గతంలో పనులు చేసి, బిల్లులు కాక నష్టపోయామనీ, ఆ పనుల జోలికి రామంటున్నారు. వెరసి ఆర్‌అండ్‌బీ పనులకు బిడ్లు దాఖలు చేసేవారు కరువయ్యారు. చేసేదిలేక, అధికారులు రెండోసారి టెం డర్లు పిలవాల్సి వచ్చింది. ఈసారి బిల్లులు తొందరంగా వస్తాయంటూ కాంట్రాక్టర్లను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. స్పందించేవారు కరువయ్యారు.

      ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో పనులు చేయడానికి ముందున్నంత ఉత్సాహం కాంట్రాక్టర్లలో లేదనే విషయం తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న కోట్లాది రూపాయల బిల్లులే. ఇవన్నీ కొత్త పనులు చేయడానికి ఆసక్తి ఉన్నవారిని వెక్కరిస్తున్నాయి. అప్పులు చేసి, పనులు చేస్తే... బిల్లులు వచ్చేలోపు వడ్డీలు తడిసి మోపెడవుతాయని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర రహదారులు (స్టేట్‌ హైవేస్‌), మేజర్‌ డిస్ర్టిక్ట్‌ రోడ్స్‌ (ఎండీఆర్‌) పనులకు సంబంధించి జిల్లాలో ఆర్‌అండ్‌బీ అధికారులు పిలిచిన టెండర్లకు పెద్దగా స్పందన లేకపోవటమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా 5 శాతం పనులకు మాత్రమే టెండర్లు పడినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే  ఆ శాఖ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతున్నాయి. అయినా.. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేని దుస్థితి నెలకొంది. బిల్లుల పెండింగ్‌ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందనీ, ఆ పనులకు అన్నిచోట్లా అదే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచిచూడాల్సిందే.


రూ.165 కోట్ల పనులకు ముందుకురాని కాంట్రాక్టర్లు

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, దీర్ఘకాలంగా మరమ్మతులు చేయని వాటి పునురుద్ధరణ పనులు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఆ మేరకు జిల్లాలో అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో రూ.165 కోట్ల నిధులతో 97 పనులు కేటాయించారు. రాష్ట్ర రహదారుల విభాగంలో 25 పనులకుగాను రూ.68.25 కోట్లు, జిల్లా మేజర్‌ డిస్ర్టిక్ట్‌ రోడ్స్‌ (ఎండీఆర్‌) పరిధిలో 72 పనులకుగాను రూ.97.85 కోట్లు వ్యయం చేయనున్నారు. వీటికి సంబంధించి గత నెలలోనే టెండర్లు పిలిచారు. కేవలం మడకశిర, పెనుకొండ నుంచి మాత్రమే తక్కువ సంఖ్యలో బిడ్లు దాఖలు చేశారు. గతంలో చేసిన పనులకు సకాలంలో చెల్లింపులు జరగక తీవ్రంగా నష్టపోయామనీ, ఇప్పుడు కూడా బిల్లులు వెంటనే అవుతాయనే నమ్మకం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈసారి బిల్లుల చెల్లింపునకు ఆటంకం ఉండబోదని ఆర్‌అండ్‌బీ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి రెండ్రోజుల క్రితం టెండర్లు పిలిచారు. ఈనెల 20 వరకు గడువు విధించారు. మరి ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారా..? లేదా..? అనేది మరో వారంరోజుల్లో తేలనుంది.


పెండింగ్‌లో రూ.250 కోట్లకుపైగా బిల్లులు

నాలుగేళ్లపాటు ఆర్‌అండ్‌బీ శాఖ నిధు ల లేమితో కొట్టుమిట్టాడింది. ఏటా రూ.వందల కోట్ల నుంచి రూ.వేల కోట్ల పనులతో బిజీగా ఉండే కాంట్రాక్టర్లు సైతం ఖాళీగా ఉన్నారు. 8 నెలలు గా పనులు కేటాయిస్తూ వచ్చారు. ఆ శాఖలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీర్ఘకాలంగా చేసిన పనుల నుంచి గతేడాది వరకు పూర్తయిన వాటికి సంబంధించి రూ.250 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-04-14T06:54:00+05:30 IST