ఇసుక కష్టాలు..!

ABN , First Publish Date - 2021-01-17T06:31:01+05:30 IST

నిర్మాణాలకు ఇసుక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పామిడి వద్ద నదిలో రీచ్‌ మూతపడటంతో ఇసుక దొరక్క స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇసుక కష్టాలు..!
ఖాళీగా దర్శనమిస్తున్న గుంతకల్లు ఇసుక స్టాక్‌ పాయింట్‌

పామిడి వద్ద మూతపడిన రీచ్‌

గుంతకల్లు ప్రాంత ప్రజలకు ఇక్కట్లు

అధిక ధర చెల్లించి.. దూరప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న వైనం

గుంతకల్లు, జనవరి 16: నిర్మాణాలకు ఇసుక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పామిడి వద్ద నదిలో రీచ్‌ మూతపడటంతో ఇసుక దొరక్క స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికంగా వెచ్చించి, ఇతర ప్రాంతా ల నుంచి కొనాల్సిన దుస్థితి దాపురించింది. గుంతకల్లులో స్టాక్‌ పాయింట్‌ ఉన్నా, ఇసుక అందుబాటులో లేదు. దీంతో లచ్చుమర్రి, నరసాపురం రీచ్‌ల నుంచి ఇసుకను ఎక్కువ ధర చెల్లించి, తెప్పించుకుంటున్నారు. ఇసుక స్టాక్‌ పాయింట్‌ నడుస్తున్న తరుణంలోనూ 20 టన్నుల టిప్పర్లు ఇక్కడ అందుబాటులో లేని కారణంగా తక్కువ పరిమాణంలో కొనాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నెలలు గడుస్తున్నా ఇసుక కష్టాలు తీరకపోవడంతో గృహ నిర్మాణదారులు ఉసూరుమంటున్నారు.


మూతపడిన స్టాక్‌ పాయింట్‌

గుంతకల్లు స్టాక్‌ పాయింట్‌ పదిరోజుల కిందట మూతపడింది. దీంతో స్థానిక నిర్మాణాలకు అవసరమైన ఇసుక దొరకటం గగనమైపోయింది. ఈ స్టాక్‌ పాయింట్‌కు ఇసుకను తరలించే పామిడి రీచ్‌లో తవ్వకాల లక్ష్యం పూర్తికావడంతో అది మూతపడింది. ఈ కారణంగా స్థాని క మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన స్టాక్‌ పాయింట్‌కు ఇసుక రాకపోవడంతో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ క్లోజ్‌ అయ్యింది. ఉరవకొండ స్టాక్‌ పాయింట్‌లో అక్రమాలు జరగడంతో దాన్ని అధికారులు నిలిపివేశారు. ఫలితంగా స్థానికులకు ఇసుక కావాలంటే అధిక రవాణా చార్జీలు ఉన్న లచ్చుమర్రి, నరసాపుర రీచ్‌ల నుంచి కొనాల్సి వ స్తోంది. దాదాపు 80 కి.మీ. దూరంలో ఉన్న ఈ రీచ్‌ల నుంచి ఇసుకను తెప్పించుకోవాలంటే రవాణా ఖర్చుల కింద 10 టన్నుల ఇసుకకు అదనంగా రూ.2 వేలు, 20 టన్నులకు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ కాని సందర్భాల్లో మరో రూ.4 వేలు చెల్లించి కొంటున్నారు. తక్కువ మోతాదులో ట్రాక్టరు ద్వారా ఇసుకను తెప్పించుకోవడానికి వీలు లేకుండాపోయింది.


చెరువుల్లో ఇసుకకు డిమాండ్‌

ఇసుక రీచ్‌ మూసివేసిన కారణంగా నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కొనడానికి స్థానికులు, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ పరిమాణంలో ఇసుక అవసరమైనవారికి, టిప్పర్లు రావడానికి వెడల్పు రోడ్లు లేని చోట్ల ట్రాక్టరుతో తెప్పించుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో ట్రాక్టరు ఇసుకను బుక్‌ చేసుకునే సదుపాయం లేకపోవడంతో చెరువుల ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. మండలంలోని కదిరిపల్లి, కొంగనపల్లి గ్రామాలలోని వం కల ఇసుకను కొంటున్నారు. కదిరిపల్లిలో వంకల ఇసు కపై బయటి నాయకులు పెత్తనం ఎక్కువైపోవటంతో స్థానిక నాయకులు కినుక వహిస్తున్నారు. దీంతో వారి మధ్య స్పర్థలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిందటి వారంలో కదిరిపల్లి నుంచి తరలి వస్తున్న ఇసుక ట్రాక్టర్లను రూరల్‌ పోలీసులు సీజ్‌ చేశారు. అక్రమ ఇసుకను అడ్డుకుంటే మంచిదేకానీ, స్థానికుల కష్టాలను తీర్చాల్సిన అవసరముంది. పామిడి రీచ్‌ను పునఃప్రారంభించి, స్టాక్‌ పాయింట్‌లో ఇసుక అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది.

Updated Date - 2021-01-17T06:31:01+05:30 IST