Abn logo
Sep 23 2021 @ 00:59AM

తల్లిదండ్రుల కమిటీల ఎన్నికల వేళ అధికార వైసీపీలో కుమ్ములాటలు

ఇరువెందులలో ఒక వర్గం రాళ్లదాడి..

రాళ్ల దాడులు, ధర్నాలు

తల్లిదండ్రుల కమిటీల ఎన్నికల వేళ అధికార వైసీపీలో కుమ్ములాటలు

‘ఫీజుల’ కమిటీ కార్యదర్శి సాంబ ప్రాంతంలోనే అధికం

పలుచోట్ల నిరసనలు, ధర్నాలు

వైపీసీకి పట్టం కట్టేందుకు కొందరు హెచ్‌ఎంల హైడ్రామాలు

3,858 స్కూళ్లలో ఎన్నికలు

వందలాది పాఠశాలల్లో వాయిదా

అనంతపురం విద్య, సెప్టెంబరు 22: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలను అధికార పార్టీ నేతలు రాజకీయాలకు వేదికగా మార్చేశారు. బాహాబాహీకి దిగి, రాళ్లు కూడా రువ్వుకున్నారు. అంతర్గతంగా ఉన్న వర్గ, ఆధిపత్య పోరు, బలాబలాలను బడిలో చూపించారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ (పీఎంసీ) ఎన్నికల వేళ నిరసనలు, ధర్నాలకు దిగారు. అక్కడితో ఆగకుండా చైర్మన్‌పోస్టు కోసం భౌతికదాడులు చేసుకున్నారు. రక్తం కూడా చిందించారు. బుధవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో ఏకంగా పరస్పరం దాడులు చేసుకున్నారు. వీరి తీరు చూసి ఉపాధ్యాయులు విస్తుపోయారు. ప్రజలు వీరెక్కడి అధికార పార్టీ నాయకులంటూ ముక్కున వేలేసుకున్నారు. మొత్తంగా జిల్లాలో  3,858 స్కూళ్లలో పేరెంట్స్‌ కమిటీల నియామకానికి ఎన్నికలు నిర్వహించారు. దాడులు, ధర్నాలు, నిరసనల వల్ల వందలాది స్కూళ్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. టీడీపీ మద్దతుదారుల బలం ఉన్నా.. వైసీపీకి పట్టం కట్టేందుకు కోరం లేదని సాకులు చెబుతూ.. హైడ్రామా సృష్టించారు. శింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ తదితర నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి.


శింగనమల నియోజకవర్గంలో భారీగా గొడవలు, నిరసనలు

శింగనమల మండలం ఇరువెందులలో రెండువర్గాలు దాడులకు తెగబాడ్డాయి. ఇరువెందుల పీఎంసీ ఎన్నికల్లో చైర్మన్‌ పోస్టు కోసం అధికార పార్టీకి చెందిన నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి, పోటీ పడ్డాయి. కుళ్లాయప్ప, రవి మధ్య పోటీ నెలకొంది. కుళ్లాయప్ప ఓట్లతో చైర్మన్‌గా గెలిచాడు. ఎన్నికల తర్వాత ఓడిపోయిన రవికి, కుళ్లాయప్పకు మాటామాటా పెరిగి, ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. తరిమెల జడ్పీ హైస్కూల్‌లో సైతం అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ, ఆ పార్టీ రెబల్‌ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కోరం ఉన్నా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపిస్తూ ఒక వర్గం (వైసీపీ రెబెల్స్‌) అక్కడి నుంచి బయటకు వచ్చి... స్కూల్‌ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో సైతం ఎన్నిక వాయిదా పడింది. తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనేందుకు ముందుకురావడంతో చైర్మన్‌పోస్టు టీడీపీ మద్దతుదారులకు దక్కుతుందన్న అక్కసుతో వాయిదా వేసినట్లు సమాచారం. దయ్యాలకుంటపల్లిలో సైతం స్థానిక సర్పంచ్‌.. కమిటీ చైర్మన్‌ ఎన్నిక పత్రాన్ని చింపివేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నజలాలపురంలో సైతం చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలు సాక్షాత్తు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ప్రాంతమైన శింగనమలలో జరగడం గమనార్హం. సోమందేపల్లి మండలం ఈదులబలాపురం స్కూల్‌లో కమిటీ ఎన్నికల్లో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. తమ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా స్కూల్‌లో చైర్మన్‌ను ప్రకటించారంటూ వారు ధర్నా చేపట్టారు.


కళ్యాణదుర్గం పరిధిలో 23 స్కూళ్లలో ఎన్నికలు వాయిదా

కళ్యాణదుర్గం నియోజవకర్గంలోని పలు స్కూళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఆధిపత్యపోరు ప్రదర్శిస్తూ... ఎన్నికల బరిలో దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్కూళ్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చెర్లోపల్లిలో స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా ఉండటంతో ఆయన మద్దతుదారులు చైర్మన్‌ కాకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కుందుర్పి ఎస్సీ కాలనీలో వైసీపీలోని రెండు వర్గాలు, బ్రహ్మసముద్రం మండలం నంజాపురంలో స్థానిక సర్పంచ్‌, జడ్పీటీసీ అభ్యర్థి వర్గాలు వేర్వేరుగా ఎన్నికల బరిలో నిలవడంతో వాయిదా పడ్డాయి. కళ్యాణదుర్గం పరిధిలోని 23 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదాపడినట్లు సమాచారం. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం మాదాపురం, కనగానపల్లి ఉన్నత పాఠశాల, ఆ మండలంలోని నెమలివరం స్కూల్‌లోనూ కోరం లేదంటూ ఎన్నికలు వాయిదా వేశారు. ఉరవకొండ నియోజకవర్గంలోని చాబాల స్కూల్‌లో సైతం వాయిదా పడ్డాయి.


హెచ్‌ఎంలతో నాయకుల చెట్టాపట్టాల్‌

పీఎంసీ ఎన్నికల్లో కొందరు ప్రధానోపాధ్యాయులు అధికార పార్టీ నాయకులతో చెట్టాపట్టాల్‌ వేసుకుని వ్యవహరించారన్న విమర్శలున్నాయి. చాలా గ్రామాల్లోని పాఠశాలల్లో తల్లిదండ్రులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికల బరిలో నిలబడితే... ఎక్కడ టీడీపీ మద్దతు దారులు గెలుస్తారోనన్న భయంతో వైసీపీ నేతలు రాజకీయాలు చేసినట్లు తెలుస్తోంది. కోరం లేదన్న సాకుచూపి, తల్లిదండ్రులు, టీడీపీ మద్దతుదారులు సంతకాలు చేసి, బయటకు వెళ్లగానే అధికార పార్టీ నాయకులను చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా ప్రకటించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు ప్రధానోపాధ్యాయులు తలొగ్గి, వైసీపీకి పట్టం కట్టేలా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కమిటీ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మద్దతుదారులైన తల్లిదండ్రులను అడ్డుకుని, అధికార పార్టీ వారికి పట్టం గట్టారన్న చర్చ సాగుతోంది. 3,858 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు ఉపక్రమించగా.. వందలాది చోట్ల వాయిదా పడ్డాయి. బుధవారం రాత్రికి 3,575 స్కూళ్ల నుంచి రిపోర్టులు వచ్చాయనీ, ఇంకా రావాల్సి ఉందని సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు వాయిదా పడిన అంశాన్ని అధికారులు కప్పి పుచ్చుతున్నారు. అధికార పార్టీ మద్దతుదారు లు, నాయకులనే లోపాయికారీగా చైర్మన్‌, వైస్‌చైర్మన్లుగా ప్రకటించే ఎత్తుగడ కూడా సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఘర్షణలో గాయపడిన రవి


ఈదుల బలాపురంలో ధర్నా చేస్తున్న దృశ్యం


సమీక్షిస్తున్న ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి

వాయిదాపడిన చోట్ల తర్వాత ఎన్నికలు

ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి

పాఠశాలల్లో విస్తృత పర్యటన

ఎన్నికలపై డీఈఓ, ఏపీసీతో సమీక్ష

కోరం లేక పీఎంసీ ఎన్నికలు వాయిదా పడిన పాఠశాలల్లో తర్వాత నిర్వహిస్తారని పాఠశాల విద్యా శాఖ కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ముదిగుబ్బ, ధర్మవరం, సీకేపల్లి, రాప్తాడు మండలాల్లోని పలు పాఠశాలల్లో ఎన్నికల తీరును బుధవారం ఆయన పరిశీలించారు. తర్వాత నూతన డీఈఓ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం డీఈఓ రంగస్వామి, ఏపీసీ తి లక్‌ విద్యాసాగర్‌ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్జేడీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 3,858 స్కూళ్లలో ఎన్నికలు నిర్వహించారన్నారు. శింగనమల ఇరువెందుల పాఠశాలలో ఘర్షణపై విచారణ చేయించామనీ, ప్రధానోపాధ్యాయుడితో రిపోర్టు తెప్పించామన్నారు. ఆ స్కూల్‌లో ఎన్నిక ముగిసిన తర్వాత ప్రతిజ్ఞ చేయించే క్రమంలో కొందరు రాళ్లు విసిరినట్లు తెలుస్తోందన్నారు. ఏదైనా స్కూల్‌లో కోరం లేక ఎన్నిక వాయిదా పడి ఉం టే... తర్వాత ఉన్నతాధికారులు తేదీ ప్రకటిస్తారనీ, అపుడు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా సాగాయని తెలిపారు. సమావేశంలో ఏడీలు రవూఫ్‌, క్రిష్ణయ్య, సూపరింటెండెంట్లు శ్రీనాథ్‌, ఆదినారాయణ, ప్రసాద్‌, జగదీష్‌ పాల్గొన్నారు.పాఠశాల ఎన్నికల్లోనూ డబ్బు పంపకాలు..!

తల్లిదండ్రులకు రూ.500

శింగనమలలో నేతల వర్గపోరుతో తాయిలాలు

నాడు-నేడు పనులున్న స్కూళ్లలోనే ఈ తరహా వ్యూహాలు

అనంతపురం విద్య, సెప్టెంబరు 22: ఇప్పటి వరకు స్థానిక, పరిషత, సాధారణ ఎన్నికల్లోనూ డబ్బు పంపకాలు చూస్తున్నాం. ఇప్పుడు పాఠశాల ఎన్నికల్లోనూ ఆ సంప్రదాయం వచ్చేసింది. ఏ కంగా డబ్బు పంచేస్తున్నారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.500 ఇచ్చేశారట. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ నిజం. నాడు-నేడు పనులు సాగుతున్న పాఠశాలల్లోనే ఈ తంతు సాగడం గమనార్హం. పాఠశాలల పీఎంసీ ఎన్నికల్లోనూ తా యిలాలు ప్రవేశించాయి. కొన్ని స్కూళ్లలో తమ మనుషులే చైర్మన్లుగా ఉండాలనీ, తమ ఆధిపత్యమే సాగాలన్న పంతంలో అధికార పార్టీ నాయకులు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.500 చొప్పున పంచినట్లు సమాచారం. పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు ముందురోజు అంటే మంగళవారం రాత్రి శింగనమల ప్రాంతంలోని కొందరు అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.500 ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నార్పల మండలంలో ఎన్నికల ముందురోజు రాత్రి భారీగానే డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు తమ ఆధిపత్యం సాగాలనీ, తమ అనుయాయులను చైర్మన్లుగా గెలిపించుకోడానికి డబ్బు పంచినట్లు సమాచారం. నాడు-నేడు పనులు పెద్దఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా ఉంటే... రూ.5 లక్షలు, రూ.10 లక్షలు గుడ్‌ విల్‌ కింద లాగేయొచ్చు అన్నది చాలామంది అధికార పార్టీ నాయకుల ఆలోచన. ఈ క్రమంలో 2వ విడత నాడు-నేడు పనుల కింద గుర్తించిన స్కూళ్లలోనూ కమిటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అధికార పార్టీ నాయకులే చైర్మన్‌ స్థానానికి పోటీపడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైర్మన్‌ పోస్టుకు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలోని ఒక  ప్రజాప్రతినిధి, మరో బలమైన నాయకుడి మధ్య నెలకొన్న వర్గపోరు కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తాయిలాలు ఇచ్చి, తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా రూ.500 పంచినట్లు సమాచారం. ఏకంగా ఆ నియోజకవర్గంలో రాళ్ల దాడులు, ధర్నాలు, నిరసనలకు తెరలేపి, స్కూళ్లను రాజకీయ రచ్చకు కేంద్రాలుగా మార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.