1945 ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-30T06:22:19+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ను జిల్లా అధికారులు అటకెక్కించారు. ప్రజలు ఇచ్చుకున్న అర్జీలకు బూజు పట్టింది.

1945 ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం

స్పందన అర్జీలకు బూజు

1945 ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం

గడువుదాటినా పట్టించుకోని వైనం

మండల, డివిజన్‌స్థాయి 

అధికారుల బాధ్యతారాహిత్యం

సంబంఽధిత శాఖల 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం

సీఎం ఆదే శాలతో జిల్లా యంత్రాంగం సీరియస్‌

ఇప్పటికైనా మార్పు వచ్చేనా..?

అనంతపురం వ్యవసాయం, జూలై 29:  ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ను జిల్లా అధికారులు అటకెక్కించారు. ప్రజలు ఇచ్చుకున్న అర్జీలకు బూజు పట్టింది. ‘స్పందన’  అర్జీల పరిష్కారంపై  కొన్ని శాఖల అధికారులు స్పందించడం లేదు. మండల, డివిజన్‌ స్థాయిల్లో అధికారులకు అనేకసార్లు తమ సమస్యను విన్నవించినా పట్టించుకోకపోవడంతో జిల్లాస్థాయి స్పందనకు బాధితులు క్యూ కడుతున్నారు. స్పందన పోర్టల్‌లో నమోదైన అర్జ్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. జిల్లాస్థాయి స్పందన  కార్యక్రమంలో పలు మార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు నిట్టూరుస్తున్నారు. రాష్ట్రస్థాయిలో స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీ లు ఎక్కువ శాతం పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఏడాదిన్నరగా కరోనా నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. సందట్లో సడేమియా అన్న చందంగా ప్రజా సమస్యలను కొందరు మండల, డివిజన్‌, పలు శాఖ ల ఉన్నతాధికారులు గాలికొదిలేశారు. నిర్దేశించిన గడువు దాటినా ఇప్పటికీ వందలాది ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉండటం విస్మయం కలిగిస్తోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్పందనకు వచ్చిన అర్జ్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. గడు వు తీరిన అర్జీలను పరిష్కరించి, రిపోర్టులు పంపాలంటూ జిల్ల్లా యంత్రాంగం సీరియస్‌ కావడంతో మంగళవారం ఉదయం నుంచి ఆయా శాఖల్లో హడావుడి మొదలైంది. ఈ  నేపథ్యంలో గడువు దాటిన అర్జ్జీలను పరిష్కరించాలని పలు శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. మరికొన్ని శాఖల ఉన్నతాధికారులు డొంకతిరుగుడు సమాధానాలు నమోదు చేసి, రిపోర్టులు పంపించి, పెండింగ్‌ సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా తాము చేసిన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానాతంటాలు పడుతున్నట్లు సమాచారం.


గడువుదాటినా పట్టించుకోని వైనం

జిల్లావ్యాప్తంగా ఇప్పటిదాకా స్పందన కార్యక్రమానికి 29819 అర్జీలు వచ్చాయి. వీటిలో 26123 పరిష్కరించారు. 2551 పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇందులో అత్యఽధికంగా 1945 అర్జ్జీలు నిర్దేశించిన గడువు దాటినా పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం. 606 అర్జీలు ప్రస్తుతానికి గ డువులోపు పెండింగ్‌లో ఉన్నా.. మరికొన్ని రోజులు దాటితే గడువు మీరనున్నట్లు తెలిసింది. పలు రకాల కారణాలతో మరో 1145 ఫిర్యాదులను తిరిగి పరిష్కరించేందుకు ప్రారంభించారు. ప్రస్తుతం అవన్నీ పలు దశల్లో ఉన్నాయి. దాదాపు పది విభాగాల్లో పదికిపైగా అపరిష్కృత అర్జీలున్నాయి. మిగతా విభాగాల్లో అంతకన్నా తక్కువ ఉన్నాయి. అత్యధికంగా జిల్లా ఇసుక అధికారి పరిధిలో 94 ఉన్నాయి. 


బాధ్యతారాహిత్యం 

జిల్లాలోని పలు మండలాలు, డివిజన్‌ స్థాయి అధికారులు స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి సోమవారం మండల, డివిజన్‌, జిల్లాస్థాయిల్లో మూడంచెల విధానంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా నిర్వహించలేదు. తాజాగా స్పందన కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. ఇది వరకు మండల, డివిజన్‌ స్థాయిల్లో స్థానిక ప్రజలు పలు రకాల సమస్యలతో అర్జీలు సమర్పించినా పట్టించుకోకపోవడంతో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి పరుగు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రతివారం వందలాది అర్జీలు వస్తూనే ఉన్నాయి. కరోనా సమయంలోనూ ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు పదుల సంఖ్యలో బాధితులు వచ్చారు. స్పందన కార్యక్రమం లేకపోవడంతో ఆ విభాగ సిబ్బంది కొన్నిరోజులు అర్జీలు తీసుకున్నారు. మరికొన్ని రోజులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్దే అటెండర్లు అర్జ్జీలు తీసుకున్నారు. వాటిలో ఎక్కువ శాతం అర్జ్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదన్న విమర్శలున్నాయి. మండల స్థాయిలో అధికారులు న్యాయం చేయకపోవడంతో కలెక్టర్‌, జేసీలకు తమ బాధలు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధితులు క్యూ కడుతున్నారు. జిల్ల్లా ఉన్నతాధికారులు కొన్ని అర్జీలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశిస్తూ పరిష్కరిస్తున్నా... అర్జ్జీలను స్వీకరించి ఆయా శాఖలు, మండలస్థాయి అధికారులకు రెఫర్‌ చేసిన వాటిలో ఎక్కువశాతం పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా స్పందన అర్జీల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది. మరి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2021-07-30T06:22:19+05:30 IST