సబ్‌స్టేషన్‌లో చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2021-03-08T06:53:49+05:30 IST

పరిగి మండలంలోని సేవామందిరం వద్ద ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు చెలరేగాయి.

సబ్‌స్టేషన్‌లో చెలరేగిన మంటలు
మంటలు ఎగిసిపడుతున్న దృశ్యం

కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లు 

రాత్రి 11 గంటలు దాటినా పూర్తిగా అదుపులోకి రాని మంటలు 

నష్టంపై ఇప్పుడే 

చెప్పలేమన్న అధికారులు 

అంధకారంలో 

వందలాది గ్రామాలు 

హిందూపురం టౌన్‌, మార్చి 7 : పరిగి మండలంలోని సేవామందిరం వద్ద ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న సిబ్బంది భయంతో  పరుగులు తీశారు. ఇక్కడ ఉన్న 220/132 కేవీ సబ్‌స్టేషన్‌కు గుత్తి నుంచి నేరుగా విద్యుత్‌ సరఫరా అవుతుంది. తర్వాత ఈ సబ్‌ స్టేషన్‌ నుంచే హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్‌, ప ట్టణంతో పాటు పరిగి మండలం మడకశిర ప్రాంతాలకు  విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సబ్‌స్టేషన్‌లోని ఓ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మంటలు పెద్దగా రావడంతో అక్కడి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గుత్తికి ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేసి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న ఆయిల్‌ అంటుకుని మంటలు వ్యాపించి దట్టంగా పొగ కమ్ముకుంది. పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్‌లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో పెనుకొండ, మడకశిర నుంచి కూడా ఫైరింజన్లు రప్పించారు. రాత్రి 11గంటల వరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ట్రాన్స్‌కో డీఈ భూపతి, ఏడీలు, ఏఈలు, సాం కేతిక నిపుణులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.  షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందా లేదా ఏదైనా ప్రమాదమా అనేది ఇప్పట్లో చెప్పలేమని మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే సోమవారం మధ్యాహ్నంకల్లా ఒక అంచనాకు వస్తామని డీఈ తెలిపారు. రూ.50 లక్షల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని ఈ నష్టం పెరిగే అవకాశం కూడా ఉండవచ్చన్నారు. రాత్రి 7.30 నుంచి హిందూపురం నియోజకవర్గం, మడకశిర ప్రాంతంలో విద్యుత్‌సరఫరా ఆగిపోవడంతో వందలాది గ్రామాలు అంధకారంలో మునిగాయి. హిందూపురం పట్టణానికి తూముకుంట పారిశ్రామికవాడ నుంచి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రి 11 గంటల తరువాత లేపాక్షి, చిలమత్తూరు ప్రాంతాలకు కూడా విద్యుత్‌ సరఫరాను మరోలైను ద్వారా పునరుద్ధరించా రు. సోమవారం మధ్యాహ్నానికి సమస్యను పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. కానీ సబ్‌స్టేషన్‌ మరమ్మతులు చేపట్టాలంటే మరో నాలుగైదు రోజులు పట్టవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్‌ను అధికంగా వాడకుండా ఆదాచేయాలని ట్రాన్స్‌కో డీఈ కోరారు. 

Updated Date - 2021-03-08T06:53:49+05:30 IST