Abn logo
Aug 3 2021 @ 01:03AM

పోటాపోటీ..!

ఆఫీసులో ఉన్న సిబ్బందికి నమస్కరిస్తున్న చైర్మన్‌

ఇద్దరు నేతల మధ్య పంతాలు

మున్సిపల్‌ అధికారులు ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి

ముందురోజే సమీక్షకు ఆదేశించిన మున్సిపల్‌ చైర్మన్‌

పోటీగా సమీక్ష జరిపిన శాసనసభ్యుడు

ఎమ్మెల్యే కార్యక్రమానికే హాజరైన సిబ్బంది

ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీపీఆర్‌

కమిషనర్‌ కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ కార్యాలయంలోనే తిష్ట

కమిషనర్‌తోపాటు ఇతర అధికారులకు సంజాయిషీ నోటీసులకు సిద్ధం

ఆర్‌డీతోపాటు ఇతర ఉన్నతాధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు 


తాడిపత్రి(అనంతపురం): ఇద్దరు ప్రజా ప్రతినిధులు పంతాలకు పోతుండటంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిలు సోమవారం పోటాపోటీగా మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఎటుపోతే ఏమొస్తుందో, పోకపోతే ఏమొస్తుందోనని ఆందోళన చెందారు. వివరాలు ఇలా... 


పట్టణ అభివృద్ధిపై సోమవారం ఉదయం 10.30 గంటలకు కౌన్సిలర్లు, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని ముందురోజే మున్సిపల్‌ చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉదయం 10 గంటలకు సమీక్షా సమావేశం పేరుతో కమిషనర్‌ నరసింహప్రసాద్‌తోపాటు ఇతర అధికారులను కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు పిలిపించారు. కొద్దిసేపు అధికారులతో మాట్లాడిన ఆయన అక్కడి నుంచి వారితోపాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపై తిరుగుతున్న వారికి మాస్క్‌లు పంపిణీ చేశారు. ఆక్రమణలు తొలగించాలని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఉదయం 10.30 గంటలకు చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్‌ కార్యాలయానికి  సమీక్షా సమావేశానికి వచ్చారు.


కార్యాలయంలో అధికారులు కనపడకపోవడంతోపాటు సిబ్బంది అరకొరగా ఉండటంపై ఆరాతీశారు. ఎమ్మెల్యే సమీక్షా సమావేశానికి హాజరై అక్కడి నుంచి పట్టణంలో ఆయనతోపాటు పర్యటించారని తెలుసుకున్నారు. వీరి తీరుపై చైర్మన్‌ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తంచేశారు. సమీక్షా సమావేశం ఉందని ముందురోజు తెలియజేసినా ప్రొటోకాల్‌ పాటించకుండా కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు ఎలా వెళతారని కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికారుల తీరును ఎద్దేవా చేస్తూ తన హావభావాలను ప్రదర్శించారు. కిందిస్థాయి సిబ్బందికి వంగి నమస్కరిస్తూ చేతులు కట్టుకొని నిలబడుతూ, రెండు చేతులు చాచి ప్రాధేయపడుతున్నట్లు నటించారు. ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చిన చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్‌, ఇతర అధికారుల కోసం వేచి ఉన్నారు. కమిషనర్‌ కోసం అక్కడున్న సిబ్బంది ఫోన్‌చేస్తే అనారోగ్యం కారణంగా తాను సెలవులో ఉన్నానని కార్యాలయానికి రాలేనని చెప్పుకొచ్చారు.


అలాంటప్పుడు ఉదయం జరిగిన ఎమ్మెల్యే సమీక్షా సమావేశం, పట్టణ పర్యటనలో ఇతర అధికారులతో కలిసి ఆయన ఎలా పాల్గొంటారని చైర్మన్‌ సిబ్బందిని ప్రశ్నించారు. కమిషనర్‌ వచ్చేంతవరకు కార్యాలయం విడిచి వెళ్లేదిలేదని కౌన్సిలర్లతోపాటు భీష్మించుకొని కూర్చొన్నారు. మధ్యాహ్నం కౌన్సిలర్లతో కలిసి కార్యాలయంలోనే భోజనం చేశారు. ఉదయం నుంచి రాత్రి అయినా చైర్మన్‌ జేసీపీఆర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో తిష్టవేశాడన్న సమాచారం పట్టణంలో చర్చనీయాంశమైంది. చివరికి 7.30 గంటలకు ఇంటికి వెళ్లారు. మరోవైపు కమిషనర్‌తోపాటు ఇతర అధికారుల వైఖరిని నిరసిస్తూ ఆర్‌డీఎంఏతోపాటు జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులతో చైర్మన్‌ ఫోన్‌లో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చైర్మన్‌ సంజాయిషీ నోటీసు పంపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. 


ఉద్యోగుల ఆచూకీ తెలపాలని పోలీసులకు  ఫిర్యాదు

తాడిపత్రి: మున్సిపాలిటీలోని 26 మంది ఉద్యోగులు ఉదయం నుంచి కనిపించడం లేదని వారిని ఎవరైనా బెదిరించారా అన్న కోణంలో విచారణ జరిపి ఆచూకీ కనుగొనాలని సోమవారం రాత్రి పట్టణ పోలీసులకు మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా శనివారమే మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌తో పాటు ఉద్యోగి చాంద్‌బాషాలకు తెలియజేశానన్నారు. ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా మెసేజ్‌లు పంపిం చారన్నారు. సమీక్షా సమావేశం కోసం సోమవారం ఉదయం మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లగా అక్కడ 26 మంది ప్రధాన అధికారులు, ఉద్యోగులు వారివారి సీట్లలో లేరన్నారు. హాజరుపట్టికను పరిశీలించగా వారు హాజరైన సంతకాలు లేవన్నారు. మధ్యాహ్నం 2.05గంటలకు ఉద్యోగి రాము వచ్చి కమిషనర్‌ సెలవు పెట్టారని ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ రాజేశ్వరిబాయికి బాధ్యతలు ఇచ్చారని అందుకు సంబంధించిన కాపీ ఇచ్చాడన్నారు.


ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ రాజేశ్వరిబాయి కూడా తన సీటులో లేదన్నారు. టెంకాయ వ్యాపారస్తుల విషయంలో కొందరు మున్సిపల్‌ ఉద్యోగులు హెచ్చరికలు జారీచేశారన్నారు. ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని అధికారులు, ఉద్యోగులకు హాని తలపెట్టి బంధించారేమోనన్న అనుమానం ఉందన్నారు. తాను ఎంతో ఆందోళనతో ఉదయం నుంచి రాత్రివరకు మున్సిపల్‌ ఆఫీసులో ఉండి అధికారులు, ఉద్యోగుల ఆచూకీ కోసం అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్నారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించాలంటూ  చైర్మన్‌ పోలీసులను ఫిర్యాదులో కోరారు. 

మున్సిపల్‌ కార్యాలయంలో తిష్టవేసిన చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి


ఎమ్మెల్యే సమీక్షా సమావేశానికి హాజరైన కమిషనర్‌, ఇతర అధికారులు