‘చేయూత’లో కోత అన్యాయం

ABN , First Publish Date - 2021-06-23T06:53:25+05:30 IST

బడుగు, బలహీనవర్గాల మహిళలకు అందించే చేయూత సాయంలో కోతలు విధించడం అన్యాయమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కా లవ శ్రీనివాసులు మండిపడ్డారు.

‘చేయూత’లో కోత అన్యాయం

లబ్ధి తగ్గించడం దుర్మార్గం 

మాజీ మంత్రి కాలవ ధ్వజం

అనంతపురం వైద్యం, జూన్‌22: బడుగు, బలహీనవర్గాల మహిళలకు అందించే చేయూత సాయంలో కోతలు విధించడం అన్యాయమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కా లవ శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ మరోసారి బడుగు మహిళలను మోసం చేసిందన్నారు. ఏటా కొత్తకొత్త నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం దుర్మార్గమన్నారు. చేయూత రెండో విడత కింద జిల్లాలో మంగళవారం 199370 మందికి రూ373.82 కోట్లు మంజూరు చేశారన్నారు. గతేడాది జిల్లా లో 229329 మందికి రూ429.97 కోట్లు విడుదల అందించారన్నారు. ఏడాదిలో 60 ఏళ్లు పైబడిన వారు 30969 మంది ఉన్నారని, వారిని జాబితా నుంచి తొలగించారన్నారు. 44 ఏళ్ల నుంచి 45 ఏళ్లు నిండినవారు 41622 మంది ఉన్నారన్నారు. మరో 10 వేల మంది పెరిగారని  వీరందరికీ చేయూత సాయం అందాల్సి ఉందన్నారు. ఈ సంఖ్యను కుదించడం వల్ల జిల్లాలో దాదాపు 41 వేల మంది బడుగు మహిళలకు మొండిచేయి చూపారన్నారు. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు 45 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్‌ ఇ వ్వాల్సి ఉందన్నారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూసి, ఈ పెన్షన్‌ నిర్ణయాన్ని ప్రకటించానని అప్పట్లో జగన్‌ గొప్పలు చెప్పారన్నారు. పెన్షన్‌ హామీని పక్కనపెట్టి చేయూత పేరుతో మోసానికి దిగారన్నారు. దీని వల్ల ఐదేళ్లలో ఒక్కో మహిళ సరాసరిగా రూ85 వేలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న కోటి మంది మహిళల్లో 80 శాతానికిపైగా బలహీన వర్గాల వారేనన్నారు. అందులో 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారు 75 శాతం ఉంటారన్నారు. ప్రభుత్వం కేవలం 23.14 లక్షల మందికి చేయూతనందించడం పెద్దమోసంగా కాలవ అభివర్ణించారు.

Updated Date - 2021-06-23T06:53:25+05:30 IST