Abn logo
Sep 24 2021 @ 00:55AM

అప్పుల వంట వండలేం బాబోయ్‌..!

యాడికి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిస్తున్న టీచర్లు

చేతులెత్తేసిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు

భారీగా బిల్లులు పెండింగ్‌

రెండ్రోజులుగా ఏజెన్సీ బంద్‌

సొంత డబ్బుతో భోజనం చేయిస్తున్న హెచఎం

పాఠాలు వదిలి.. వంట పనులు చూస్తున్న టీచర్లు..

యాడికి, సెప్టెంబరు 23: బిల్లులు అందక అప్పులు తెచ్చి ఎన్నాళ్లు వంట వండాలంటూ పాఠశాలలో మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకురాలు చేతులెత్తేసింది. ఏజెన్సీ నుంచి తప్పుకుంది. దీంతో యాడికి ఉన్నత పాఠశాలలో హెచఎం సొంత డబ్బుతో రెండ్రోజులుగా మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు.. వంట పనులను పర్యవేక్షించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. యాడికి ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. రోజూ 600 నుంచి 700 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. బిల్లులు పెద్దఎత్తున పెండింగ్‌లో ఉన్నాయని ఏజెన్సీ నిర్వాహకురాలు అమరావతి చేతులెత్తేసింది. మంగళవారం నుంచి మధ్యాహ్న భోజనం చేయట్లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పాఠశాల ఉపాధ్యాయులు పడ్డారు. కొత్త ఏజెన్సీ నిర్వాహకుడి నియామకానికి అధికారులు చర్యలు చేపట్టలేదు. బిల్లులు ఎప్పుడు పడతాయోనన్న అభద్రతతతో కొత్తగా ఏజెన్సీ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. విద్యార్థుల కడుపు మాడ్చలేక ప్రధానోపాధ్యాయురా లు విజయమ్మ సొంత డబ్బుతో వంట సరుకులను తెప్పించి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు భోజనం పెట్టిస్తున్నారు. ఉపాధ్యాయు లు బోధన పక్కనపెట్టి.. వంటావార్పుకు దిగాల్సి వస్తోంది. ఇలా ఎన్నిరోజులో అని వారు ఆవేదన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని, ఏజేన్సీ సమస్యను పరిష్కరించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం అందేలా చూడాలని తల్లిదండ్రులు, టీచర్లు కోరుతున్నారు.