బిగిసిన పిడికిలి

ABN , First Publish Date - 2021-08-03T06:36:13+05:30 IST

సీపీఎస్‌ ఉద్యోగులు పిడికిలి బిగించారు.

బిగిసిన పిడికిలి
విడపనకల్లులో టీచర్ల నిరసన

సీపీఎస్‌ రద్దుపై జిల్లావ్యాప్తంగా నిరసనలు

నల్లబ్యాడ్జీలతో విధులకు టీచర్లు 

వారం రోజులు ఇదే హోరు

అనంతపురం విద్య, ఆగస్టు 2: సీపీఎస్‌ ఉద్యోగులు పిడికిలి బిగించారు. సీపీఎ్‌సను రద్దు చేస్తామని పట్టించుకోకపోవడంపై సీపీఎస్‌ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. జిల్లావ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేయిచేయి కలిపి, ఐక్యంగా అడుగేశారు. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్‌సఈఏ) ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని విడపనకల్లు, రామగిరి, గోరంట్ల, పెనుకొండ, హిందూపురం, కదిరి, తనకల్లు, సోమందేపల్లి, రొద్దం, బ్రహ్మసముద్రం, గుడిబండ, శెట్టూరుతోపాటు అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించారు. విధి నిర్వహణలో పాల్గొంటూనే నిరసనలు తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ... సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. జిల్లాలో 18 వేల మంది వరకూ సీపీఎస్‌ ఉద్యోగులు ఉండగా, వేలాది మంది నిరసనలో పాల్గొన్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్‌ గుడిబండ మండలంలో నిరసనలో పాల్గొన్నారు. నిరసనలను వారం రోజులపాటు హోరెత్తించనున్నారు. జిల్లా అధ్యక్షుడు గోపాలప్ప మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  సీపీఎస్‌ ఉద్యోగులు, టీచర్లు జిల్లా నలుమూలలా నిరసనల్లో భాగస్వాములయ్యారు. సీపీఎస్‌ రద్దు చేయకుంటే దశలవారీగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. సెప్టెంబరు 1వ తేదీన జిల్లా కేంద్రం, జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తామన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.



Updated Date - 2021-08-03T06:36:13+05:30 IST