టీకాపై అయోమయం..!

ABN , First Publish Date - 2021-06-20T06:47:15+05:30 IST

కరోనా కొంత శాంతించినా జనంలో మాత్రం భయం ఇంకా తగ్గలేదు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం టీకా వేయించుకోవడమేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

టీకాపై అయోమయం..!

అధికారుల నిర్ణయంపై గందరగోళం

సమాచారం లేక జనం అవస్థలు

నేడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు నిర్ణయం

45 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు టీకా

అనంతపురం వైద్యం, జూన్‌ 19: కరోనా కొంత శాంతించినా జనంలో మాత్రం భయం ఇంకా తగ్గలేదు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం టీకా వేయించుకోవడమేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. దీంతో కరోనా టీకా వేయించుకోవడానికి జనం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం అవసరం మేరకు సరఫరా చేయలేకపోవడంతో అనుకున్న సమయానికి టీకా వేయించుకోలేకపోతున్నారు. ఏ టీకా ఎప్పుడు వేస్తారో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. ఒకసారి కోవాగ్జిన్‌ రెండో డోసు అంటారు. ఇంకోసారి ఒకటో డోసు వారికంటారు. ఓసారి ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్ల వారికి అంటారు. మరోసారి జిల్లా అంతా కోవాగ్జిన్‌ టీకా వేస్తామంటారు. కోవాగ్జిన్‌ వేయించుకుంటే రెండో డోసు దొరుకుతుందా లేదా అనే అనుమానాలు జనాన్ని వెంటాడుతున్నాయి. ఇక కొవిషీల్డ్‌ టీకా పరిస్థితి కూడా జిల్లాలో గందరగోళంగా ఉం ది. ఇటీవల కొవిషీల్డ్‌ టీకా కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో ఈ టీకా ఏ రోజు ఎప్పుడు వేస్తారో అర్థం కావడం లేదు. కొవిషీల్డ్‌ కూడా ఓసారి తొలి డోసు వారికంటారు. మరోసారి రెండో డోసు వారికంటారు. ఇలా అధికార యంత్రాంగం తీరుతో జనంలో గందరగోళం ఏర్పడుతోంది. జిల్లాలో 120 కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నామంటారు. ఆ కేంద్రాలకు వెళితే టీకా రాలేదనీ, వేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. రోజూ జిల్లాలో టీకా పంపిణీ అస్తవ్యస్తంగానే సాగుతోంది. కనీసం పత్రికలకు కూడా ఏ కేంద్రాల్లో ఏ టీకా వేస్తున్నామనే సమా చారం ఇవ్వడం లేదంటే జిల్లాలో కరోనా టీకా పంపిణీ ఎంత గందరగోళంగా సాగుతోందో ఊహించుకోవచ్చు.


నేడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

కరోనా వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను ఆదివారం చేపడుతున్నారు. బాఽధ్యతలు తీసుకున్న తర్వాత ఒకేరోజు 90 వేల మందికి కరోనా టీకా వేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సె ల్వరాజన్‌ నిర్ణయం తీసుకున్నారు. కొవిషీల్డ్‌ టీకా పంపిణీకి ఆదివారం ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ తెలిపారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి, ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకా వేస్తున్నట్లు వారు తెలిపారు. 120 కేంద్రాల్లో పంపిణీకి చర్యలు చేపట్టారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను మండలస్థాయి అధికారులకు కలెక్టర్‌ అప్పగించారు. కాన్ఫ రెన్స్‌ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి, అర్హులైన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించేలా చూడాలని ఆదేశించారు. వైద్యాధికారులు, ఎం పీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ మెగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2021-06-20T06:47:15+05:30 IST