విద్యుత్‌ సమస్యలు వినేవారెవరు..?

ABN , First Publish Date - 2021-05-14T06:44:04+05:30 IST

వినియోగదారులు, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలి.

విద్యుత్‌ సమస్యలు వినేవారెవరు..?
అనంతపురంలోని విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయం

సకాలంలో స్పందించని అధికారులు, కేత్రస్థాయి సిబ్బంది

సొంతంగా విద్యుత్‌ పనులు చేసుకుంటున్న రైతులు

జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి

కార్యాలయాల్లో మూగబోయిన ల్యాండ్‌ఫోన్లు

ఏఈఈల ఫోన్లు స్విచాఫ్‌

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 

వినియోగదారులు, రైతులకు తప్పని కష్టాలు 



ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం బత్తలపల్లి మండలం పోట్లమర్రిలోనిది. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో రైతులే విద్యుత్‌ ఫీజులు వేస్తూ కనిపించారు. ఇదేమని అడిగితే.. ఫీజులు పోతే తర చూ తామే వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఫీజులు వేసుకోవడమే కాదు, ఏ సమస్య వచ్చినా చేసుకోమంటున్నట్లు రైతులు చెబుతున్నారు. లైన్‌మెన్‌ తాము ఎల్‌సీ ఇస్తామనీ, పనులు చేసుకోండి అంటున్నారన్న రైతులు చెప్పుకురావడం కొసమెరు పు. దీనిని బట్టి చూస్తే క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సిబ్బంది పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


మూడు రోజుల కిందట జిల్లా కేంద్రంతో పాటు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. అనంతపురంరూరల్‌, జిల్లా కేంద్రంలోని డి-5, డి-3 సెక్షన్ల పరిధిలో రాత్రి 9 గంటలకు ఆగిపోయిన విద్యుత్‌ సరఫరా.. అర్ధరాత్రయినా రాని దుస్థితి. ఈ క్రమంలో సంబంధిత అధికారులకు, కార్యాలయాలకు వినియోగదారులు విద్యుత్‌సరఫరా ఎప్పుడు వస్తుందని తెలుసుకునేందుకు ఫోన్లు చేశారు. వారి నుంచి స్పందన కరువైంది. అధికారుల ఫోన్లు స్విచాఫ్‌లో ఉండగా.. కార్యాలయాల్లోని ఫోన్లు మోగని పరిస్థితి. దీంతో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. అసలే వేసవికాలం కావడంతో వినియోగదారులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డి-2 సెక్షన్‌ పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఆ సెక్షన్‌ పరిధిలో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని వినియోగదారులు వాపోతున్నారు.


అనంతపురంరూరల్‌, మే 13: వినియోగదారులు, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలి. నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు.. ఇవి తరచూ సమావేశాల్లో విద్యుత్‌ ఉన్నతాధికారులు చెప్పే మాటలు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను, మాటలను క్షేత్రస్థాయిలో పనిచేసే విద్యుత్‌ ఏఈఈలు, ఉద్యోగులు, సిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. వినియోగదారుల  సమస్యలను పరిష్కరించడం కాదు.. కదా.. కనీసం ఫోన్లు ఎత్తడం లేదు. వినియోగదారులు తరచూ అధికారులకు ఫోన్‌ చేయడం తప్పా.. ఏఈఈల నుంచి స్పందన ఉండట్లేదు. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఫోన్లు పనిచేయడం లేదు. అధికారులు, కార్యాలయాల్లోని ఫోన్లు తరచూ స్విచా్‌ఫలో ఉండటం, రింగ్‌ అవుతున్నా సమాధానం లేకపోవటం పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. కార్యాలయాల్లో కూడా అంతే. దీంతో విద్యుత్‌ పరమైన సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో.. ఏదైనా సమాచారం ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వినియోగదారులు ఉండిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 14.22 లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. ఇందులో వ్యవసాయ కనెక్షన్లు 2.86లక్షలున్నాయి. గృహ, వాణిజ్య, పరిశ్రమలు తదితర కనెక్షన్లు 11.35 లక్షలున్నాయి.


గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై స్పందిస్తే.. ఒట్టు

గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు, రైతులకు సంబంధించిన విద్యుత్‌ సమస్యలపై స్పందించేవారు కరువయ్యారు. పగలు, రాత్రి వేళల్లో తరచూ విద్యుత్‌ సరఫరా ఆగిపోతోందని వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్‌ నిలిచిపోయిన గంట, రెండు గంటలైనా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికితోడు రైతులకు సంబంధించిన సమస్యలపై కనీస స్పందన ఉండటం లేదన్న వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా స్యయంగా రైతులే చేసుకోవాల్సి వస్తోందని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎగ్‌ఫీజులు పోయినా లైన్‌మెన్‌కు చెబితే ఎల్‌సీ ఇస్తున్నారు. ఆ సమయంలో రైతులే ఆ పనులు వేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక విద్యుత్‌ పరమైన ఏ సమస్య వచ్చినా ఎవరూ స్పందించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. 


జిల్లా కేంద్రంలో మరీ దారుణం..

జిల్లా కేంద్రంలో ఆరు సెక్షన్లున్నాయి. ఒక్కో సెక్షన్‌ పరిధిలోకి కొన్ని ప్రాంతాలను తీసుకువచ్చి వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్యలను తెలియజేయాడానికి, సమాచారం తెలుసుకోవడానికి ఏఈఈల ఫోన్‌ నెంబర్లతోపాటు కార్యాలయ ల్యాండ్‌లైన్‌ నెంబర్లు కేటాయించారు. ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే ప్రస్తుతం స్పందించేవారే కరువయ్యారు. వినియోగదారులు ఎవ్వరైనా ఫోన్‌ చేసినా సమాధానం ఇచ్చేవారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. చాలా శాతం ఫోన్‌ రింగ్‌ అవుతున్నా.. స్పందించడం లేదన్న వాదనలున్నాయి. ఒకవేళ ఫోన్‌ ఎత్తి సమస్య తెలియజేసినా ఎంత సేపటికీ పరిష్కరించడం లేదన్న వాదనలు బలంగా ఉన్నాయి. సంబంధిత కార్యాలయాల ఏఈఈలు ఫోన్‌లో సమాధానాలు చెప్పడం కాదు కదా.. ఫోన్‌ కూడా ఎత్తరన్న వాదనలున్నాయి. ఫోన్లు మరీ ఎక్కువైతే ఏకంగా స్విచాఫ్‌ చేసుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.  ఇప్పటికైనా అధికారులు.. వినియోగదారుల సమస్యకు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లలోనూ నిర్లక్ష్యమే..

ఇటీవల జిల్లా కేంద్రంలో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఏదైనా సమస్య కారణంగా విద్యుత్‌ సరఫరా ఆగిపోయిందంటే గంటల తరబడి పునరుద్ధరించట్లేదు. వేసవికాలంలో ప్రస్తుతం విద్యుత్‌ వినియోగం పెరిగిపోయింది. రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల నుంచి 20 యూనిట్ల వరకు వినియోగం ఉంటోంది. మూడు రోజుల కిందట నేషనల్‌ పార్కు సమీపంలో ఓవర్‌లోడు కారణంగా విద్యుత్‌ వైర్లు కాలిపోయాయి. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా.. సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ్య చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓవర్‌లోడు సమస్యను అధిగమించేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు తదితర చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం కారణంగా తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి.



ఏ సమయంలోనైనా స్పందించాల్సిందే..!

వినియోగదారుల సౌకార్యార్థం ల్యాండ్‌ లైన్‌ ఫోన్లు కార్యాలయాల్లో ఏర్పాటు చేశాం. ఏ సమయంలోలైనా సరే ఫోన్‌ వచ్చిందంటే స్పందించాలి. ఎవరు ఫోన్‌ చేసినా ఏఈఈలు ఫోన్లు ఎత్తి, సమాదానం చెప్పాలి. వినియోగదారుల కోసమే పనిచేస్తోంది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవు.

- వరకుమార్‌, ఎ్‌సఈ

Updated Date - 2021-05-14T06:44:04+05:30 IST