విద్యా‘వారధి’ అమలుపై సందేహాలు

ABN , First Publish Date - 2021-08-02T06:13:54+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సర్కారీ బడుల పిల్లలకు విద్యాబోధన అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యావారధి.. మిథ్యావారధిగా మారుతోంది.

విద్యా‘వారధి’ అమలుపై సందేహాలు
విద్యావారధి వర్క్‌షీట్‌

మిథ్యావారధి..!

విద్యా‘వారధి’ అమలుపై సందేహాలు

గతనెల 15 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులంటూ ఆదేశాలు

సాంకేతిక కారణమంటూ అర్ధంతరంగా రద్దు

తెరపైకి బేస్‌లైౖన్‌ పరీక్షలు

అవి కూడా మొక్కుబడిగా నిర్వహణ

వేలాది మంది హాస్టళ్ల విద్యార్థులు దూరం

ఆన్‌లైన్‌ క్లాసులకు ముందు ‘వారధి’ వర్క్‌షీట్లు

ఇప్పటికీ పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని దుస్థితి

పిల్లల చేతికి అందేందుకు మరో పక్షం రోజులు

అనంతపురం విద్య, ఆగస్టు 1: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సర్కారీ బడుల పిల్లలకు విద్యాబోధన అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యావారధి.. మిథ్యావారధిగా మారుతోంది. నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా పూటకో ఆదేశం, రోజుకో జీఓ ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. విద్యావారధిని నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాశాఖలో ఎప్పుడు ఏం చెబుతారో.. ఏది అమలు చేస్తారో అంతుపట్టని దుస్థితి నెలకొంది. ఇటీవల విద్యార్థులకు ‘ఆన్‌లైన్‌’ క్లాసులు పెడతామన్నారు. అర్ధంతరంగా వాటిని రద్దు చేశారు. ఉన్నఫలంగా బేస్‌లైన్‌ పరీక్షలు పెట్టారు. పైగా వాటిని మొక్కుబడిగా చేశారు. ఉత్తర్వులివ్వడం, పరీక్షలు పెట్టడం, దానికితోడు అస్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థులు దూరంగా ఉండాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 15 వేల నుంచి 25 వేల మంది వరకూ హాస్టల్‌ విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. తాజాగా ‘ఆన్‌లైన్‌’ క్లాసులకు ముందు వర్క్‌షీట్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. నేటికీ పూర్తిగా అవి జిల్లాకు, మండలాలకు, పిల్లలకు చేరలేదు. ఈ క్రమంలో కొవిడ్‌, ఇతర పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా 4.14 లక్షల మంది ఉంటే ఆ వర్క్‌షీట్లు ఏ మేరకు చేరుతాయి? విద్యా‘వారధి’గా ఎలా నిలుస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


అటకెక్కిన ఆన్‌లైన్‌ క్లాసులు

కరోనా నేపథ్యంలో పాఠశాల విద్య సాగడం గగనంగా మారింది. 2020-21 విద్యాఏడాదిలో తరగతులు అరకొరగా సాగాయి. 2021-22కి సంబంధించి కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం ఆన్‌లైన్‌  క్లాసులు నిర్వహించాలనుకుంది. గత నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తామని ప్రకటించింది. దూరదర్శన్‌ ద్వారా క్లాసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. క్లాసుల ప్రారంభానికి ముందు విద్యా ‘వారధి’ వర్క్‌షీట్లు అందిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఆన్‌లైన్‌ క్లాసులు చూసి, వర్క్‌షీట్లలో సాధన చేయాల్సి ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏం ఆలోచించారో తెలియదు కానీ... ఉన్నఫలంగా సాంకేతిక సమస్య నెపంతో క్లాసులు ప్రారంభించలేదు. అనుకోకుండా బేస్‌లైన్‌పరీక్షలను తెరపైకి తీసుకొచ్చారు.


మొక్కుబడిగా పరీక్షలు

బేస్‌లైన్‌ పరీక్షలు మొక్కుబడిగా నిర్వహించారు. గతనెల 27 నుంచి 31వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగాయి. వీటి నిర్వహణకు అధికారులు అస్పష్టమైన ఆదేశాలివ్వడంతో వేలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. పరీక్ష పేపర్లు తయారుచేసి, విద్యార్థులకు చేరేలా వారి తల్లిదండ్రులకు ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రస్తుతం వారు సొంతూళ్లలో ఉంటున్నారు. వారి ఇళ్లకు పరీక్ష పేపర్లు చేర్చడం ఉపాధ్యాయులకు కష్టంగా మారింది. దీంతో వేలాది మంది వీటికి దూరంగా ఉండిపోయారు. ఇక పరీక్షలు కూడా మార్కెట్‌లో అమ్మే కామన్‌ పేపర్లతోనే నిర్వహించి, మమ అనిపించారు.


4.14 లక్షల మందికి వర్క్‌షీట్లు చేరేనా..?

విద్యాశాఖ అధికారులు చెబుతున్న గణాంకాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో 4.14 లక్షల మంది విద్యార్థులున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకూ తెలుగు మీడియంలో 2,17,456 మంది చదువుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియంలో 1,86,048 మంది, కన్నడ మాధ్యమంలో 2,129 మంది, ఉర్దూ మీడియంలో 8,811 మంది చదువుతున్నారు. వీరికి ఆయా మాధ్యమాల్లో ముద్రించిన వర్క్‌షీట్లు ఇవ్వాలి. రాష్ట్రస్థాయి నుంచి ఆలస్యంగా జిల్లాకు వర్క్‌షీట్లు చేరాయి. జిల్లాకేంద్రంలోని ఉపాధ్యాయ భవన్‌లోని డీసీఈబీలో వాటిని భద్రపరిచారు. వాటిని ఎమ్మార్సీలకు, స్కూల్‌కాంప్లెక్స్‌కు సరఫరా చేసి తర్వాత స్కూళ్లకు అందజేస్తారు. స్కూళ్ల నుంచి వర్క్‌షీట్లు విద్యార్థులకు చేర్చాల్సి ఉంది. నేటికీ మండలాలకు పూర్తిస్థాయిలో అవి చేరలేదు. విద్యాశాఖ అధికారులు చెప్పిన సమయానికి  ఆన్‌లైన్‌ క్లాసులే నిర్వహించలేకపోయారు. ఇక వర్క్‌షీట్లు ఏ మేరకు సప్లై చేస్తారో... కరోనా కష్టకాలంలో స్కూల్‌, టీచర్లకు, విద్యార్థులకు వాటిని విద్యా వారధిగా ఏ మేరకు నిలుపుతారో వేచిచూడాలి.



Updated Date - 2021-08-02T06:13:54+05:30 IST