ఎమ్మెల్యే బావ అంటే ఎలా ఉండాలో.. అచ్చం అదే రేంజ్‌లో..

ABN , First Publish Date - 2021-07-22T06:54:07+05:30 IST

అధికార పార్టీ నేతల..

ఎమ్మెల్యే బావ అంటే ఎలా ఉండాలో.. అచ్చం అదే రేంజ్‌లో..
బుక్కరాయసముద్రం స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న దృశ్యం

ఎమ్మెల్యే బావా.. మజాకా!

ఏకంగా బీకేఎస్‌ స్టాక్‌పాయింట్‌ నుంచే ఇసుక దొంగగా తరలింపు

రెండ్రోజులకోసారి టిప్పర్‌లు నగరంలోకి..

ఒక్కో దానిపై రూ.25 వేల చొప్పున వసూలు

నిద్రమత్తులో అధికారులు


అనంతపురం: అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎమ్మెల్యే బావ అంటే ఎలా ఉంటది? ఆ రేంజ్‌లోనే వ్యవహారం సాగిస్తున్నాడు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు. వంకలు, కాలువల్లో ఇసుక తోడి, రవాణా చేయడం.. అంత రిస్కు అవసరమా అనుకున్నట్లున్నాడు. ఏకంగా ఇసుక స్టాక్‌ పాయింట్‌కే గురిపెట్టాడు. పబ్లిక్‌గా ఇసుక తరలిస్తూ.. లక్షలు దోచుకుంటున్నాడు. జిల్లాలో రోజూ ఎక్కడ చూసినా.. అక్రమ మద్యం పట్టుకున్నాం, జూదరులను అరెస్టు చేశామని హంగామా చేసే సెబ్‌ అధికారులు.. స్టాక్‌ పాయింట్‌ నుంచే ఇసుక తరలిపోతున్నా.. కళ్లు మూసుకున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


అధికార పార్టీ నేత కావడంతో గతంలో ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు రవాణా చేసే టెండర్‌ దక్కించుకున్నారు. బిల్లులు కూడా చేసేసుకున్నారు. ఇటీవల ఇసుక తవ్వకాలు, సరఫరా బాధ్యతలను జేపీవీ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. అయినా ఆ వైసీపీ నేత ఇసుకను వీడలేదు. బీకేఎస్‌ స్టాక్‌పాయింట్‌లో ఉన్న ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. అలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబు నింపుకుంటున్నాడు.


వైసీపీ నేతలు అవినీతి కార్యకలాపాలకు పరాకాష్టగా నిలుస్తున్నారు. ప్రజాప్రతినిధులైనా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి, ఆయన అత్యంత సమీప బంధువులు ఇసుక వ్యవహారంలో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే యల్లనూరు మండలంలోని లక్షుంపల్లి ఇసుక రీచ్‌లో తమ వాహనాలతో ఇసుక నింపుకుని, ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా కాదని చెప్పి.. ఏకంగా ఇసుక డంప్‌పైనే కన్నేశారు. తమ పరిధిలోని బుక్కరాయసముద్రం చెరువు కట్ట ఎదురుగా ఉన్న ఇసుక స్టాక్‌పాయింట్‌నే ఖాళీ చేసేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి ఇసుకను అధికారికంగా ఎక్కడికీ సరఫరా చేయడం లేదు. కొత్తగా ఇసుక బాధ్యతలు దక్కించుకున్న జేపీవీ కంపెనీ కూడా ఇసుక రవాణా చేయట్లేదు. కానీ, ఇసుక తరలిపోతోంది. అధికార పార్టీ నేతే తరలిస్తున్నాడని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 


గతేడాది వర్షాకాలం నేపథ్యంలో ఉరవకొండ, కొర్రపాడు, బుక్కరాయసముద్రంలో నాలుగు లక్షల టన్నులు స్టాక్‌ ఉంచారు. ప్రస్తుతం బీకేఎస్‌ స్టాక్‌పాయింట్‌లోనే 1.50 లక్షల టన్నులుపైగా నిల్వ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారం అండతో టిప్పర్లతో అనంతపురం నగరానికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేలు..

బుక్కరాయసముద్రం నుంచి అనంతపురం నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఒక్కో టిప్పర్‌లో ఇసుక నింపేసుకుని, నగరంలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. బాడుగ మినహా... ఎవరికీ రూపాయి కూడా చెల్లించకుండా మొత్తం జేబులోకి వేసేసుకుంటున్నారు. రెండ్రోజులకోసారి 15 నుంచి 20 ట్రిప్పుల వరకు తరలిస్తున్నట్లు తెలిసింది. అంటే వారానికి రూ.15 లక్షల చొప్పున నెలకు రూ.60 లక్షల వరకు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక అధికారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలేమో. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఇంత వ్యవహారం సాగుతున్నా గనులశాఖ, సెబ్‌, విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోలేదంటే ఏ స్థాయిలో పర్యవేక్షణ ఉందో అర్థమవుతుంది.


కీలకం.. ఎమ్మెల్యే బావ

సామాన్యుడేమో గంపెడు ఇసుక దొరక్క అల్లాడిపోతుంటే వైసీపీ నేతలు మాత్రం ఆ ఇసుక ఆధారంగానే రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. లక్షుంపల్లి ఇసుక రీచ్‌లో ప్రజాప్రతినిధి భర్త సమీప బంధువులే వ్యవహారం నడుపుతున్నారు. బుక్కరాయసముద్రం స్టాక్‌పాయింట్‌లో సంబంధిత ఎమ్మెల్యే బావ కీలకంగా చక్రం తిప్పుతున్నారు. ఎక్స్‌కవేటర్‌తో ప్రత్యేకంగా టిప్పర్లకు లోడ్‌ చేయిస్తున్నాడు. తన అనుచరులను అక్కడే ఉంచి, లోడింగ్‌కు అవాంతరాలు తలెత్తకుండా పర్యవేక్షణ చేయిస్తున్నాడట. బీకేఎస్‌ చెరువుకట్ట ఎదురుగా రోడ్డు పక్కనే ఓ పెద్ద ఇసుక డంప్‌ ఉంది. అక్కడి నుంచి కొంతముందుకెళ్తే రెండు వేర్వేరు ఇసుక డంప్‌లున్నాయి. నడిరోడ్డుపక్కనైతే అందరికీ కనిపిస్తుందని దూరంగా ఉన్న డంప్‌ల వెనుకవైపు నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రెండ్రోజులకోసారి ఇసుక టిప్పర్లను అనంతపురం నగరానికి తరలిస్తున్నారు. అది కూడా సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపుతున్నారు.

Updated Date - 2021-07-22T06:54:07+05:30 IST