భర్తలు ఆశిస్తే... భార్యలకు దక్కిన అవకాశం

ABN , First Publish Date - 2021-07-18T06:18:54+05:30 IST

నామినేటెడ్‌ పదవుల కోసం..

భర్తలు ఆశిస్తే... భార్యలకు దక్కిన అవకాశం

10 మందికి నామినేటెడ్‌ పదవులు

ఐదు చొప్పున రాష్ట్ర.. జిల్లాస్థాయి పదవులు 

ముఖ్య నేతలకు భంగపాటు


అనంతపురం(ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల కోసం అధికార వైసీపీ నాయకులు ఎందరో ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తారా అని ఎదురుచూస్తూ వచ్చారు. అదిగో... ఇదిగో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారైందంటూ ఆ పార్టీ పెద్దలు ఆశావహుల్లో ఆశలు రేపుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ నెల ఆరంభంలోనే పోస్టులు భర్తీ చేస్తామనే ప్రచారం సాగినప్పటికీ పక్షం రోజులు ఆలస్యంగానైనా శనివారం నామినేటెడ్‌ పదవుల జాబితాను విడుదల చేశారు. ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో తమకు తప్పనిసరిగా నామినేటెడ్‌ పదవి దక్కుతుందని చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతల్లోని కొందరు కంగుతినేలా పదవుల పంపకాలు ఉండటంతో ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. వైఎస్‌ కుటుంబానికి వెన్నంటి నడిచిన నేతలకు నామినేటెడ్‌ పదవుల పంపకాల్లో మొండిచేయి చూపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్‌ పదవులను భర్తలు ఆశిస్తే.. భార్యలకు అవకాశం కల్పించడమూ కొంత విస్మయానికి గురిచేస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో లేకపోలేదు. ఏదేమైనప్పటికీ నామినేటెడ్‌ పదవులు ఆ పార్టీలోని నేతల్లో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం కలిగించాయి.


10 మందికి చోటు

నామినేటెడ్‌ పదవుల పంపకాల్లో 10 మందికి చోటు కల్పించారు. ఇందులో ఐదుగురికి రా ష్ట్రస్థాయి, మరో ఐదుగురికి జిల్లాస్థాయి పదవులు దక్కాయి. అందులోనూ ఎస్సీ, బీసీలకు ఐదు, మిగిలిన ఐదు పదవులు ఓసీ సామాజికవర్గానికి కట్టబెట్టారు. రాష్ట్రస్థాయి పదవుల విషయానికొస్తే.. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌ నవీన్‌ నిశ్చల్‌ను ఏపీ ఆగ్రోస్‌ డెవల్‌పమెంట్‌ చైౖర్మన్‌గా నియమించారు. ఆయన ఆదినుంచి హిందూపురం నియోజకవర్గ పదవిని ఆశిస్తూ వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి కట్టబెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మెట్టు గోవిందురెడ్డిని ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. అనంతపురం పార్లమెంటు పార్టీ కన్వీనర్‌గా పనిచేస్తున్న నదీం అహమ్మద్‌కు ఉర్దూ అకాడమీ చైర్మన్‌ పదవి దక్కింది. ఈయన 2014 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. వైసీపీ అనుబంధ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌ భార్య వై. హరితకు నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ పదవి అనూహ్యంగా దక్కింది. ఈమె ఇప్పటి వరకూ గృహిణిగానే ఉంటున్నారు. అనూహ్యంగా రాష్ట్రస్థాయి పదవి కట్టబెట్టడంతో రాజకీయ అరంగేట్రం చేసినట్లయింది. ఆ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు. అనూహ్యంగా ఆయన భార్య మంజులను ఆర్టీసీ రీజినల్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈమె కూడా గృహిణి. తాజా పదవితో రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. 


జిల్లాస్థాయి పదవుల విషయానికొస్తే అహుడా చైౖర్మన్‌ పదవి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివా్‌సను వరించింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మహాలక్ష్మి శ్రీనివాస్‌ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పుట్టపర్తి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ చైౖర్‌పర్సన్‌(పుడా)గా లక్ష్మీనరసమ్మను నియమించారు. గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి భార్య ఉమాదేవిని నియమించారు. ఈమె గృహిణి. రాజకీయాలకు కొత్త. గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ పదవితో తెరపైకి వచ్చారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఇదివరకూ అదే పోస్టులో పనిచేసిన తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డినే రెండోసారి ఆ పదవి వరించింది. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు కుమార్తె లిఖితను బ్యాంకు చైర్‌పర్సన్‌గా నియమించారు. లిఖిత ఇటీవలే బీటెక్‌ పూర్తి చేసుకుంది. ఈ పదవితో రాజకీయ ప్రవేశం చేసినట్లయింది. వీరాంజనేయులు కుటుంబానికే ఆ పదవి దక్కినట్లయింది.


భర్తలు ఆశిస్తే.. భార్యలకు దక్కిన అవకాశం

తొలి నుంచీ నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న నేతల్లో కొందరికి ఆ అవకాశం చేజారింది. అయితే వారి భార్యలకు అవకాశం దక్కింది. వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌ నామినేటెడ్‌ పదవిని ఆశించారు. ఆయన స్థానంలో భార్య వై.హరితకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవిని కట్టబెట్టారు. నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు నామినేటెడ్‌ పదవిని ఆశిస్తూ వచ్చారు. తనకు తప్పనిసరిగా పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. అనూహ్యంగా ఆయన భార్య మంజులకు ఆర్టీసీ రీజినల్‌ బోర్డు చైౖర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి నామినేటెడ్‌ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దాదాపుగా ఆయనకు ఖరారైందనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన భార్య ఉమాదేవికి గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ పదవినిచ్చారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఇదివరకూ పనిచేసిన పామిడి వీరాంజనేయులు తనకు నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ఆశించారు. ఆయన స్థానంలో కుమార్తె లిఖితకు అవకాశం కల్పించారు. ఎవరికో ఒకరికి పదవి దక్కింది కదా అన్న సంతోషంతో ఆ నేతలు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


భంగపడ్డ ముఖ్య నేతలు

నామినేటెడ్‌ పదవుల్లో తమకు తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని ధీమాతో ఉన్న ఆ పార్టీ ముఖ్య నేతల్లో కొందరికి నామినేటెడ్‌ పదవుల పంపకాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్‌ పదవులు ఆశించిన వారిలో మాజీ మేయర్‌ రాగే పరశురాం, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయకులు చవ్వా రాజశేఖర్‌ రెడ్డి, కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, బీసీ రమేష్‌గౌడ్‌, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, లోచర్ల విజయభాస్కర్‌ రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, నూర్‌ మహమ్మద్‌, మిద్దె కుళ్లాయప్ప, కళ్యాణదుర్గం తిప్పేస్వామి, తాడిపత్రి రమే్‌షరెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు. వీరిలో కొందరు వైఎస్‌ కుటుంబానికి సన్నిహితులు కూడాను. అయినప్పటికీ.. పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు వారి సన్నిహితవర్గాల ద్వారా అందిన సమాచారం. నామినేటెడ్‌ పదవుల పంపకాలు వైసీపీలో రానున్న రోజుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసే పరిస్థితులు లేకపోలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 


ఎవరి దారి వారిదే...

నామినేటెడ్‌ పదవులు పొందడంలో ఎవరికి వారే రహదారి ఏర్పరచుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే పదవులు పొందారన్న ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. పుడా చైౖర్మన్‌ పదవిని లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి ఆశించారు. ఆయన ఆశలకు గండికొట్టేలా అక్కడ ఓ ముఖ్య నాయకుడు పావులు కదిపినట్లు స్థానిక పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్‌ పదవి పామిడి వీరాంజనేయులు కుమార్తెకు దక్కడం వెనుక ఓ అమాత్యుడు చక్రం తిప్పినట్లు సమాచారం. మహాలక్ష్మి శ్రీనివాస్‌, నదీం అహమ్మద్‌కు నామినేటెడ్‌ పదవులు దక్కడం వెనుక ఆ పార్టీ పెద్దల్లో ముఖ్యులు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంజులను నామినేటెడ్‌ పదవి వరించడం వెనుక ఆ పార్టీలో ఆ సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత అండదండలే కారణమని సమాచారం. హరితను రాష్ట్రస్థాయి చైర్‌పర్సన్‌ పదవి వరించడంలో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న నాయకుడి ఆశీస్సులున్నట్టు ప్రచారం సాగుతోంది. మెట్టు గోవిందురెడ్డికి కీలక పదవి దక్కడం వెనుక దూరదృష్టి రాజకీయాలు పనిచేసినట్లు సమాచారం. స్థానిక నాయకుల సిఫార్సుల కంటే... ఎవరికి వారు ఎంచుకున్న దారిలో వెళ్లడంతోనే పదవులు దక్కాయన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.



Updated Date - 2021-07-18T06:18:54+05:30 IST