పరిషత్‌ ఎన్నికల్లోపేట్రేగిన అధికార పార్టీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-04-09T06:42:16+05:30 IST

అనుకున్నదే అయింది.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వందశాతం ఫలితాలను సాధించాలని అధికార పార్టీ అధినాయకత్వం ఆదేశాల దిశగానే.. జిల్లాలో ఆ పార్టీ నాయకులు, శ్రేణుల అరాచకాలు, దౌర్జన్యాలు గురువారం పోలింగ్‌ సందర్భంగా ప్రస్ఫుటమయ్యాయి.

పరిషత్‌ ఎన్నికల్లోపేట్రేగిన అధికార పార్టీ శ్రేణులు
కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన టీడీపీ మద్దతుదారుడు నరసింహారెడ్డి

టీడీపీ ఎన్నికలు బహిష్కరించినా...

గెలుపు కోసం దాడులు, దౌర్జన్యాలు

ఓట్లు వేయనీయకుండా అడ్డగింత

పోలింగ్‌ కేంద్రాల నుంచి విపక్షాల ఏజెంట్ల గెంటివేత

ఓట్ల శాతం పెంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం

గతంతో పోలిస్తే.. భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం

58.37 శాతానికే పరిమితం

అనంతపురం, ఏప్రిల్‌8(ఆంధ్రజ్యోతి): అనుకున్నదే అయింది.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వందశాతం ఫలితాలను సాధించాలని అధికార పార్టీ అధినాయకత్వం ఆదేశాల దిశగానే.. జిల్లాలో ఆ పార్టీ నాయకులు, శ్రేణుల అరాచకాలు, దౌర్జన్యాలు గురువారం పోలింగ్‌ సందర్భంగా ప్రస్ఫుటమయ్యాయి. యథేచ్ఛగా, ఏకపక్షంగా పోలింగ్‌ నిర్వహించుకునేందుకు అధికార దర్పాన్ని చాటారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి విపక్షాల ఏజెంట్లను తరిమేయటంతోపాటు వారిపై పిడిగుద్దులు గుద్ది రక్తం కళ్లజూశారు. టీడీపీకి ఓటు వేస్తారేమోనని అనుమానం వచ్చిన వారిపై ఏకంగా దాడులకు దిగి, ఆస్పత్రుల పాలు చేశారు. ఇలా అధికార పార్టీ నాయకులు యథేచ్చగా దౌర్జన్యకాండకు దిగుతున్నా.. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే.. ఎన్నికల పోలింగ్‌ ఏ తీరుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఓట్ల శాతం పెంచుకునేందుకు అధికార పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదనే చెప్పాలి. పోలింగ్‌ సందర్భంగా క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే.. అధికార పార్టీ నాయకులు ఏ తీరుగా దౌర్జన్యాలు, అరాచకాలకు తెరలేపారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ధర్మవరం మండలంలోని రేగాటిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర నేత చిలకం మధుసూదన్‌రెడ్డి ఇంటిపై ఆ ప్రాంత వైసీపీ ముఖ్య నాయకుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌ రెడ్డి అనుచరులు రేగాటిపల్లి సర్పంచ్‌ సురే్‌షరెడ్డి తన అనుచరులతో రాళ్ల దాడి చేశారు. అంతటితో ఆగక మధుసూదన్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. ప్రేక్షకపాత్ర వహించారు. అదే మండలంలోని వెంకటతిమ్మాపురం పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ ఏజెంట్‌పై వైసీపీ నాయకుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారు. బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థికి ఏజెంట్‌గా కూర్చున్న నారాయణస్వామిని సుధాకర్‌ రెడ్డి వర్గీయులు పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి, చితకబాది అతడి రక్తం కళ్లచూశారు. తీవ్ర రక్తగాయాలతో ప్రస్తుతం నారాయణస్వామి ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలవ్యాప్తంగా వైసీపీ నేతలు యథేచ్చగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తూముచెర్లలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఓట్లు వేసేందుకు వస్తున్న గుంతపల్లికి చెందిన టీడీపీ మద్దతుదారులను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఓట్లు వేసేకి లేదంటూ రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త నరసింహారెడ్డి తీవ్ర రక్తగాయాల పాలవటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యలకుంట్లలో ఏజెంట్లపై దాడి చేయడంతో ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిని బోదుల స్వాతి పోలింగ్‌ బూత్‌ ఎదుట మద్దతుదారులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎన్నికలు సజావుగా జరగలేదని అధికార పార్టీ నేత లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కనుక రీపోలింగ్‌ జరపాలని ఆమె డిమాండ్‌ చేశా రు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో టీడీపీ ఏజెంట్‌ వెంకటే్‌షపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. యాడికి మం డలం రాయలచెరువులో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పీఏ.. టీడీపీ ఏజెంట్‌ రమే్‌షబాబుపై బెదిరింపులకు దిగారు. డిక్లరేషన్‌ ఫారం లేదంటూ పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించకుండా బయటకు పంపించేశారు. కణేకల్లు మండలం ఎన్‌. హనుమాపురంలో వైసీ పీ నాయకులు.. టీడీపీ అభ్యర్థులను దుర్భాషలాడుతూ.. ‘చూసుకుందాం రా..’ అంటూ జబ్బలు చరిచారు. ఉరవకొండలోని 8వ పోలింగ్‌ కేంద్రంలోకి 10 మందిదాకా గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అక్కడి సిబ్బంది కేక లు వేయడంతో పారిపోయారు. ఆ పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పేపర్లను చించేసినట్లు సమాచారం. ఇలా.. ఏ పోలింగ్‌ కేంద్రంలో చూసినా వైసీపీ ఏజెంట్లు మినహా.. ఇతర పార్టీల వారిని కూర్చోనీయకుండా ఏకపక్షం గా ఎన్నికలు జరుపుకున్నారు. మధ్యాహ్నం తరువాత పోలింగ్‌ కేంద్రాన్ని అ నుకూలంగా మార్చుకుని, ఓట్లు దండుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వై సీపీకి కాకుండా ఇతర పార్టీకి ఓటు వేస్తారని అనుమానం వచ్చిన వారిపైన అధికార పార్టీ శ్రేణులు రుబాబు ప్రదర్శించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం తమ హక్కని మొర పెట్టుకున్నా.. వినని విధంగా అధికార పార్టీ శ్రే ణులు వ్యవహరించాయంటే ఈ ఎన్నికలు ఎలా సాగాయో అర్థమవుతోంది.



పోలింగ్‌ సరళి ఇలా..

జిల్లాలోని 62 జడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే... ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైనప్పటికీ.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి కనబరచలేదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో మొత్తం 22,83,065 మంది ఓటర్లుండగా.. 13,32,633 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. 9,50,432 మంది దూరంగా ఉండిపోయారు. ఈ లెక్కన 58.37 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ 7.76 పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఆ తరువాత పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు రావడం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు 11.07 శాతం నమోదైంది. ఆ తరువాత వేగం పుంజుకుంది. 11 గంటలకు 22.88 శాతం, 12 గంటలకు 30.59 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 37.09 శాతం నమోదైంది. ఆ తరువాత పోలింగ్‌ నెమ్మదించింది. మధ్యాహ్నం ఎండ వేడిమి అధికం కావడమే ఇందుకు కారణం. మధ్యాహ్నం 2 గంటలకు 41.94 శాతం, 3 గంటలకు 46.69 శాతం, సాయంత్రం 4 గంటలకు 51.88 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆఖరు గంటలో మరో 7 శాతం దాకా పోలింగ్‌ నమోదు కాగా.. మొత్తంగా 58.37 శాతానికి చేరింది. అత్యధికంగా అగళిలో 75.98 శాతం, అత్యల్పంగా తాడిపత్రిలో 45.73 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలించి, భద్రపరిచారు. హైకోర్టు తీర్పు వెలువరించిన తరువాతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.



భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం

జిల్లాలో 2014లో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పోలిస్తే... గురువారం పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. 2014 ఎన్నికల్లో 82.30 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తాజాగా 58.37 శాతానికి పడిపోయింది. అంటే 23.93 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓడీసీలో 100 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ప్రస్తుతం 54.61 శాతమే ఓటేశారు. 45.39 శాతం మంది ఆసక్తి చూపలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలోని 63 మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. డి. హిరేహాళ్‌, ధర్మవరం మండలాల్లో గతంలో కంటే ఓటింగ్‌ శాతం పెరిగింది. మిగిలిన 61 మండలాల్లో ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం భారీగా తగ్గింది. 10 నుంచి 50 శాతం వరకూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించడం ఒక కారణమైతే.. అధికార పార్టీ ఆగడాలు, అరాచకాలకు భయపడి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు శ్రద్ధ చూపలేదన్న విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గర నుంచి పోలింగ్‌ నిర్వహణ వరకూ ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఓటింగ్‌ శాతం భారీగా తగ్గడానికి ప్రధాన కారణమన్న అభిప్రాయం మేధావివర్గం నుంచి వినిపిస్తుండటం గమనార్హం.



అందరికీ అభినందనలు: కలెక్టర్‌ గంధం చంద్రుడు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అభినందనలు తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా అన్నిరకాల పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నందుకు పోలీసులను అభినందించారు. ఎన్నికలు విజయవంతం అయ్యేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేశారని ఆయన ప్రశంసించారు.







Updated Date - 2021-04-09T06:42:16+05:30 IST