Abn logo
Sep 24 2021 @ 00:52AM

ఉత్కంఠకు తెర.. జడ్పీ పీఠం ఆమెకే..!

జడ్పీ చైర్‌పర్సన్‌గా తొలిసారి బీసీ మహిళ

వైస్‌చైర్మన్లుగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మకు చాన్స్?

మంత్రి శంకరనారాయణ చేతిలో సీల్డ్‌ కవర్‌

రేపు ఎన్నిక లాంఛనమే


అనంతపురం(ఆంధ్రజ్యోతి): జడ్పీ పీఠం ఎవరు అధిరోహించనున్నారనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు గిరిజమ్మకే చైర్‌పర్సన్ పదవి దక్కినట్లు అధికార పార్టీ ముఖ్యనేతల ద్వారా అందిన సమాచారం. బీసీ మహిళకు జడ్పీ కుర్చీ ఖరారైన నేపథ్యంలో ఆ సామాజికవర్గంలోని నాలుగు ప్రధాన కులాలకు చెందిన అభ్యర్థులు పోటీపడ్డారు. ఆ మేరకు ఎవరి స్థాయిలో వారు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అదేక్రమంలో పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకూ పావులు కదిపారు. ప్రధానంగా బోయ, కురుబ, యాదవ, ఈడిగ సామాజికవర్గాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులే చైర్‌పర్సన్ పదవికి పోటీపడ్డారు.


ఆత్మకూరు జడ్పీటీసీ బోయ గిరిజమ్మ, గుత్తి జడ్పీటీసీ నారావేణి రాధిక, రాప్తాడు జడ్పీటీసీ హేమావతి, తనకల్లు జడ్పీటీసీ జక్కల జ్యోతి ఉన్నారు. ఈనెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో 62 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 60 చోట్ల వైసీపీ విజయం సాధించింది. దీంతో ఆ నలుగురు జడ్పీటీసీ సభ్యురాళ్లతోపాటు వారి భర్తలు, పార్టీ ముఖ్య నేతలంతా తాడేపల్లిలోనే మకాం వేశారు. గురువారం సాయంత్రం వరకూ జడ్పీ చైర్‌పర్సన్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. రా ష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కూడిన ఫోర్‌మెన్ కమిటీ జడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్ల ఎంపికను భుజానకెత్తుకున్నారు.


నాలుగు రోజులపాటు కసరత్తు చేశారు. అభ్యర్థులను ఖరారు చేసిన ఆ ఫోర్‌మెన్ కమిటీ నివేదికను ముఖ్యమంత్రికి అందజేయగా, ఆ నివేదికలో పొందుపరిచిన పేర్లను ఆమోదిస్తూ... సీఎం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. జడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్ల పేర్లున్న సీల్డ్‌ కవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణకు అందజేశారు.


వీడిన జడ్పీ పీఠముడి....

జడ్పీ పీఠముడి వీడింది. ఆ పార్టీ ముఖ్యుల విశ్వసనీయ సమాచారం మేరకు... జిల్లాలో ఆ పార్టీ వర్గాల్లోనూ, ప్రజాప్రతినిధుల్లోనూ ముందునుంచీ జడ్పీ చైర్‌పర్సన్ ప్రచారంలో ముందంజలో ఉన్న ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు బోయ గిరిజమ్మనే ఆ అదృష్టం వరించింది. ఆమె పేరునే అధిష్టానం ఖరారు చేసింది. ఇక్కడ ఓ విషయం స్పష్టంగా వెల్లడి కావడం లేదు. ఐదేళ్లపాటు బోయ గిరిజమ్మనే జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగిస్తారా...? రాష్ట్ర మంత్రి మండలి తరహాలోనే రెండేన్నరేళ్లకే పరిమితం చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యుల సమాచారం మేరకు... ముందుగా జడ్పీ చైర్‌పర్సన్‌గా బోయ గిరిజమ్మ ప్రమాణస్వీకారం చేయనున్నారనడంలో సందేహం లేదు.


ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్నదే సందిగ్ధతతకు దారితీస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఆ పార్టీలో ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులుగానూ, నామినేటెడ్‌ పదవుల్లోనూ అనేక మంది కొనసాగుతున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని ఆశించిన వారిలో కురబ సామాజికవర్గానికి చెందిన రాప్తాడు జడ్పీటీసీ సభ్యురాలు హేమావతి ఉన్నారు. ఆ సామాజికవర్గం నుంచి అనేక మంది నేతలు ప్రజాప్రతినిధులుగానూ, నామినేటెడ్‌ పదవుల్లోనూ ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ యాదవ సామాజికవర్గానికి ఆ పార్టీ నుంచి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలోనే... ఆ సామాజికవర్గం జడ్పీ చైర్‌పర్సన పదవిని ఆశించింది. ఆ మేరకు... ఆ సామాజికవర్గ నాయకులు వైసీపీ అధిష్టానాన్ని మీడియా ద్వారా డిమాండ్‌ చేశారు.


తనకల్లు జడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి చైౖర్‌పర్సన్ పీఠాన్ని ఆశించారు. ఆమె భర్త జక్కల ఆదిశేషు గట్టిగా ప్రయత్నాలు చేశారు. కడప జిల్లాకు చెందిన ఆ పార్టీకి అత్యంత ముఖ్య నేతలతోనూ మంతనాలు సాగించారు. అయినా అధిష్టానం బోయ గిరిజమ్మవైపే మొగ్గు చూపింది. రెండున్నరేళ్ల తరువాత ఏమైనా జడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశించి భంగపడిన సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారనే ప్రచారమూ ఆ పార్టీలో జోరుగా సాగుతుండటం గమనార్హం. ఏదేమైనప్పటికీ... జిల్లా పరిషత్ చరిత్రలో తొలి బీసీ మహిళగా బోయ గిరిజమ్మ జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించబోతున్నారు.


వైస్‌చైర్మన్లుగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌ రెడ్డి, నాగరత్నమ్మ?

జడ్పీ వైస్‌చైర్మన్ ఎంపికలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాఠశాలల విద్యా ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి చక్రం తిప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం జడ్పీటీసీ సభ్యుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శింగనమల నియోజకవర్గంలోని నార్పల జడ్పీటీసీ సభ్యురాలు నాగరత్నమ్మను వైస్‌ చైర్మన్ పదవులు వరించాయి. అధికార పార్టీ సామాజికవర్గానికి ఒకటి, ఎస్సీ సామాజికవర్గానికి వైస్‌చైర్మన్ పదవులు కట్టబెట్టారు. కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మ పేర్లు దాదాపుగా ఖరారైనప్పటికీ... ఆఖరు నిమిషంలో పార్టీ అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకున్నా.. అందుకు కట్టుబడే పరిస్థితులు లేకపోలేదనే అభిప్రాయం ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి వినిపిస్తుండటం కొసమెరుపు. 


రేపు ఎన్నిక లాంఛనమే...

జడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఖరారైన నేపథ్యంలో ఈనెల 25వ తేదీన ఎన్నిక లాంఛనమే. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశాల మేరకు.. జిల్లా పరిషత సీఈఓ ఆధ్వర్యంలో జడ్పీ సమావేశపు హాల్‌లో ఏర్పాట్లు చేయడంలో ఉద్యోగులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్లుగా ఎన్నిక కానున్న వారి అనుచరవర్గాలు పెద్దఎత్తున అనంతపురానికి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.