నడిరోడ్డుపై దారుణం.. కొనఊపిరితో చనిపోయే ముందు...

ABN , First Publish Date - 2021-02-18T06:30:13+05:30 IST

నడిరోడ్డుపై దారుణం జరిగిపోయింది.

నడిరోడ్డుపై దారుణం.. కొనఊపిరితో చనిపోయే ముందు...

సంచలనం రేపిన వామన్‌రావు దంపతుల హత్య

 కత్తులతో విచక్షణారహితంగా దుండగుల దాడి

 కారులో భార్య, రోడ్డుపై భర్త రక్తమోడిన వైనం

 చలించని జనం.. ఆసుపత్రికి తరలించని దైన్యం

 ఫొటోలు, వీడియోలతో చిత్రీకరణకు ప్రాధాన్యం


మంథని/మంథనిరూరల్‌, ఫిబ్రవరి 17: నడిరోడ్డుపై దారుణం జరిగిపోయింది. పట్టపగలు.. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై వాహనాలతో అడ్డుకొని.. కత్తులతో విచక్షణారహితంగా హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, ఆయన సతీమణి నాగమణిలను దండగులు హత్యచేసిన తీరు మంథని ప్రాంతంలో గురువారం సంచలనం రేపింది. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన గట్టు వామన్‌రావు, ఆయన భార్య గట్టు నాగమణిలు రామగిరి మండలంలోని మారుతినగర్‌ సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. వామన్‌రావు దంపతులు హైదరాబాద్‌లో ఉంటూ.. గట్టు లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈక్రమంలో మంథని కోర్టులో కేసుల సంబంధించి విచారణకు హాజరై తిరిగి హైదరాబాద్‌కు తమ కారులో వెళ్తుండగా దారికాచి దండగులు దాడికి తెగబడ్డారు. కారులోనే కత్తులతో దంపతులపై దండగులు దాడికి పాల్పడటంతో కారులోనే నాగమణి ఒరిగిపోగా, వామన్‌రావు మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డుపై పడిపోయాడు. నాగమణికి తల, మెడపై గాయాలు, వామన్‌రావుకు చాతి, పొట్టలో విచ్చలవిడిగా కత్తి గాట్లు పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగి కొద్దిసేపు రక్తపు మడుగులోనే పడి ఉన్నారు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ గట్టు దంపతులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. రోడ్డుపై రక్తపుమడుగులో ఉన్న వామన్‌రావు మాత్రం ఘటన స్థలంలోనే ఓ వ్యక్తి తీసిన వీడియో టేపులో తమపై దాడి చేసింది కుంట శ్రీను అని, అతనిది కూడా తమ గ్రామమేనని వెల్లడించిన తీరు, ఈవీడియో తోపాటు కుంట శ్రీనుతో మరో వ్యక్తి ఇద్దరు వామన్‌రావుపై కత్తులతో దాడి చేసిన మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దంపతుల హత్యపై అన్ని కోణాలతో విచారణ జరిపి, నింతులపై చర్యలు తీసుకుంటామని, ఇందు కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ ప్రకటించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సైతం గట్టు దంపతుల హత్య పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డుపై న్యాయవాదులను ఇలా హత్య చేయడం చూస్తే శాంతిభద్రతలు అదుపులో లేవని స్పష్టమవుతోందని, ఈ ఘటనకు సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 


ఆలయ వివాదాలే హత్యకు కారణమా..?

గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణం విషయంలో న్యాయవాది గట్టు వామన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనుకు మధ్య తలెత్తిన వివాదాలే గట్టు దంపతుల హత్యకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. గుడి నిర్మాణం కోసం కుంట శ్రీను పెద్దఎత్తున చందాలు వసూలు చేస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నాడని, గుడిని ఓ ప్రైవేట్‌ కంపెనీ నిర్మిస్తోందని వెల్లడిస్తూ.. నిర్మాణంపై వామన్‌రావు ఆలయ నిర్మాణంపై హైకోర్టులో వామన్‌రావు రిట్‌ ఫైల్‌ చేశాడు. మరో రిట్‌ మంథని కోర్టులో కూడా ఫైల్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య వివాఽదాలు గతకొద్డి నెలలుగా రాజుకున్నాయి. ఈ విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వామన్‌రావు సోషల్‌ మీడియాలో పోస్టులు సైతం చేశారు. ఈ కేసుతోపాటు మరికొన్ని కేసుల విషయంలో మంథని కోర్టుకు వచ్చిన గట్టు దంపతులను తిరుగు ప్రయాణంలో కుంట శ్రీను, గుంజపడుగు గ్రామానికి చెందిన మరో వ్యక్తి దారుణంగా హత్య చేశారు. గ్రామంలో రామాలయం కమిటీ నియామకం, నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ విషయంలో సైతం వామన్‌రావు తలదూర్చడంతో గ్రామానికి చెందిన రిటైర్డు అధికారితో సైతం విబేధాలున్నాయి. హత్యలో మాజీ అధికారికి ప్రయేమం ఉందని వామన్‌రావు కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మరణ వాగ్మూలం..

తమ గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌ తమపై దాడి చేశారని రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావు చెప్పిన మాటలు, దాడి చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఏ గ్రూప్‌లో చూసినా కూడా ఇదే వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో చనిపోయే ముందు వామన్‌ చెప్పిన మాటలు మరణ వాగ్మూలంగా మారాయి. పోలీసులకు ఈ కేసు విచారణకు, దాడిపై పలు అనుమానాలు కల్గకుండా వామన్‌రావు చివరి మాటలు సాక్ష్యంగా మారాయి. 


కోర్టు కేసులతో వివాదాస్పదంగా మారిన వామన్‌రావు.. 

పలు ఆంశాలపై రాజకీయ, పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరుపై పలు ఆంశాల్లో హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసిన తీరు ఆయా వర్గాలకు వివాదాస్పదుడి గా వాహన్‌రావు మారాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు రూ. 900 కోట్లు ఇసుక క్వారీలతో అక్రమంగా సంపాదించాడని హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసి మధు పోటీ చేయకుండా ప్రయత్నించిన తీరు అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుత శ్రీధర్‌బాబుకు అనుకూలంగా వ్యవహరించారనే రాజకీయ విమర్శలు పుట్ట మధు ఆయన వర్గీయులు ఆరోపణలు చేశారు. వన్యప్రాణి వేట కేసులో మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న నిందితుడి సంఘటనలో సైతం పోలీసులే కొట్టి చంపారని కోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేసిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఇలా పలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల విషయాల్లో తలదూర్చారని ప్రచారం ఉంది. గతంలో సైతం వామన్‌రావు నక్సలైట్ల పేరు చెప్పి డబ్బులు వసూల్‌ చేసినట్లు, ఓ అధికారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు, హైకోర్టులో తనపై ఉన్న కేసులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్లు, పలు కేసుల విషయాల్లో బాధితులుగా వచ్చిన వారిని బలహీనతలను ఆసరా చేసుకొని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు పలు కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. ఆది నుంచి కూడా వామన్‌ రావుది వివాదాస్పద వ్యవహారంగానే ప్రచారం సాగుతోంది. 


వాహన్‌రావు కుటుంబ నేపథ్యం.. 

గుంజపడుగు గ్రామానికి చెందిన వామన్‌రావు తండ్రి రిటైర్డు టీచర్‌ కాగా, తల్లి ఇంద్రసేనమ్మ గృహిణి, సోదరుడు ఇంద్రశేఖర్‌, సోదరి బుడెంగారి శారద . ప్రస్తుతం వాహన్‌రావు నాగమణితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. 

మంథని, గుంజపడుగులో భారీ పోలీస్‌ సిబ్బంది.. 

న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య నేపథ్యంలో మంథనితో పాటు వారి స్వగ్రామమైన గుంజపడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలోని నిందితుడు కుంట శ్రీను కొడుకు, బిడ్డను పోలీసులు ఆదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. గ్రామంతో పాటు మంథనిలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు భారీ ఎత్తున పోలీస్‌ బలగాలను దింపారు. గతంలో మంథనిలో చోటు చేసుకున్న రాజకీయ ఘర్షణలు దృష్టిలో ఉంచుకొని మరికొద్ది రోజుల పాటు పోలీస్‌ బందోబస్తును కొనసాగించే అవకాశముంది. 


హత్యలను ఖండించిన బార్‌ అసోసియేషన్‌.. 

వామన్‌రావు దంపతుల హత్యను మంథని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు హరిబాబు, చంద్రుపట్ల రమణకుమార్‌రెడ్డిలు ఖండించారు. నడి రోడ్డుపై న్యాయవాదులను హత్య చేయడం దారుణమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-02-18T06:30:13+05:30 IST