పొంచి ఉన్న వ్యాధుల ముప్పు

ABN , First Publish Date - 2020-12-04T05:13:33+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీవర్షాలు కురవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది.

పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
కందులాపురం పంచాయతీలోని రోడ్ల దుస్థితి

ఇప్పటికే ఒకవైపు చలి, మరోవైపు దోమలు

అధికారుల ఆదే శాలను పట్టించుకొని క్షేత్రస్థాయి సిబ్బంది

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3: జిల్లాలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీవర్షాలు కురవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినా పట్టించుకున్న పరిస్థితి లేదు. జిల్లావ్యాప్తంగా నివర్‌ తుఫాన్‌ కారణంగా నాలుగురోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అనేక గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ చేరింది. గ్రామాల్లో సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఆ వర్షపు నీరు రోడ్ల మీదనే పారి దుర్గంధం వేదజల్లుతోంది. వర్షాలను దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామపంచాయతీల్లో నిల్వ చేరిన నీటిని తొలగించడంతో పాటు ప్రజానీకం వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు బ్లీచింగ్‌ను కూడా చల్లాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినా అనేక గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టించుకున్న పరిస్థితి లేదు. తాజాగా మళ్లీ బురేవి తుఫాన్‌ భయపెడుతోంది. దాని ప్రభావంతో మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

కానరాని బ్లీచింగ్‌

కాగా గ్రామ పంచాయతీల్లో వర్షాలు తగ్గిన అనంతరం బ్లీచింగ్‌ చల్లిన పరిస్థితులు లేవు. ఉన్నతాధికారుల పర్యటన ఉంటే అప్పటికప్పుడు హడావుడిగా బ్లీచింగ్‌ను చల్లుతున్నారే తప్ప గ్రామాల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆయా పంచాయతీల్లో ఉండే నిధులను వినియోగించుకొని వర్షాల కారణంగా గ్రామాల్లో వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. 

పెరిగిన దోమలు ఉత్పత్తి

కాగా గ్రామాల్లో భారీవర్షాల కారణంగా దోమల ఉత్పత్తి పెరిగి ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురవడంతో ఎక్కడినీరు అక్కడే నిలిచిపోయింది. దీంతో దోమల ఉత్పత్తి పెరిగి చలికాలంలో వ్యాధుల బారిన పడాల్సి వస్తోందని ప్రజానీకం భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతున్న ప్రజానీకం ప్రస్తుతం దోమలతో ఏ వ్యాధిబారిన పడాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. పైగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

సత్వర చర్యలకు ఆదేశాలు ఇచ్చాం 

వర్షాల నేపథ్యంలో గ్రామపంచాయతీల్లో పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని ఆదేశాలు ఇచ్చాం. అనేక గ్రామాల్లో నీరు నిల్వ ఉంటే ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసి బయటకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నాం. 

-జీవీ నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి


Updated Date - 2020-12-04T05:13:33+05:30 IST