తేనె టీగల దాడి

ABN , First Publish Date - 2021-10-25T04:48:35+05:30 IST

తేనె టీగలు దాడి చేయడంతో ఓ వ్యక్తి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బావిలో దూకి మృతి చెందాడు.

తేనె టీగల దాడి
బావిలో నీరును మోటారు సహాయంతో తోడుతున్న అగ్నిమాపక సిబ్బంది, (ఇన్‌సెట్‌లో) మృతుడు ప్రసాదరావు (ఫైల్‌ ఫొటో)

తప్పించుకునే క్రమంలో బావిలో దూకి ఒకరి మృతి

దాడి నుంచి బయటపడిన మరో వ్యక్తి

జాజులవానిపాలెం సమీపంలో ఘటన


పరవాడ, అక్టోబరు 24: తేనె టీగలు దాడి చేయడంతో ఓ వ్యక్తి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బావిలో దూకి మృతి చెందాడు. ఈ దాడిలో మరో వ్యక్తి తోటల్లో దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నాడు. జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెం శివారు జాజులవానిపాలెం సమీపంలో గల పొలాల్లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజులవానిపాలేనికి చెందిన అప్పికొండ  ప్రసాదరావు(52) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం డ్యూటీకి సెలవు కావడంతో చేలో పశువులకు మేత పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ ఆ పని ముగించుకుని తోటల్లో వున్న ఆవు పెయ్యిల కోసం వెళ్లాడు. వాటిని తీసుకుని వస్తుండగా అక్కడే కొబ్బరి చెట్టుకున్న తేనె టీగల గూడు నుంచి తేనె టీగలు దాడి చేశాయి. దీంతో అతడు కేకలు వేసుకుంటూ తమ వ్యవసాయ బావి వద్దకు వచ్చాడు. అక్కడే వున్న మరో వ్యక్తి అప్పికొండ నాగేశ్‌కు పారిపోవాలని ప్రసాదరావు చెప్పడంతో అతడు సమీపంలోని సరుగుడు తోటల్లో దాక్కున్నాడు. తేనె టీగలు దాడి చేసి చంపేస్తున్నాయి.. తొందరగా రా నాగేశ్‌ అంటూ ప్రసాదరావు మరోసారి కేకలు వేశాడు. దీంతో తోటల్లో దాక్కొని వున్న నాగేశ్‌ బావి వద్దకు వచ్చే సరికి ప్రసాదరావు కనిపించలేదు. బావిలో దూకినట్టు ఆనవాళ్లు ఉండడంతో బయటకు వచ్చేస్తాడని నాగేశ్‌ ఎదురు చూశాడు. ఎంతకీ రాకపోవడంతో జరిగిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. బావిలో దూకిన ప్రసాదరావుకు ఈత వచ్చు. అయితే తేనె టీగల దాడి కారణంగా ఊపిరాడక మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఒక  కుమార్తెకు వివాహం చేయగా, మరో కుమార్తె బ్రాండెక్స్‌లో పనిచేస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకున్నారు. బావి నిండా నీరు ఉండడంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదు. దీంతో నీరును బయటకు తోడేందుకు రెండు మోటార్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నీరు తోడే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పరవాడ ఎస్‌ఐ సురేశ్‌ పర్యవేక్షణలో మృతదేహం వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. 


Updated Date - 2021-10-25T04:48:35+05:30 IST