140 గుళ్లలో దాడులా?

ABN , First Publish Date - 2021-01-08T07:40:52+05:30 IST

‘రాష్ట్రంలో 140 ఆలయాల్లో దాడులు జరిగాయా... చాలా ఎక్కువగానే జరిగినట్లుందే’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విస్మయం వ్యక్తంచేశారు.

140 గుళ్లలో దాడులా?

  • చాలా ఎక్కువే జరిగినట్లుందే!
  • తీసుకోవలసిన చర్యలు తీసుకుంటా
  • టీడీపీ నేతలకు గవర్నర్‌ హామీ!!

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో 140 ఆలయాల్లో దాడులు జరిగాయా... చాలా ఎక్కువగానే జరిగినట్లుందే’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విస్మయం వ్యక్తంచేశారు. దేవాలయాలపై దాడుల వ్యవహారంపై ిసీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ టీడీపీ ప్రతినిధి బృందం గురువారం రాజ్‌భవన్‌లో ఆయనకు వినతిపత్రంతోపాటు వివరాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ అందచేసింది. అందులో ఏముందో గవర్నర్‌ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై తన వంతు బాధ్యతగా తాను తీసుకోవలసిన చర్యలు తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు. ‘వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి 140 ఆలయాల్లో విధ్వంస సంఘటనలు జరిగాయి. తొలి దాడి జరిగినప్పుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఇన్ని జరిగేవి కావు. 19 నెలలుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణకు ఆదేశించండి’ అని టీడీపీ నేతలు తమ వినతిపత్రంలో కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కాగా.. రహదారుల విస్తరణ కోసం తొలగించిన దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇవాళ నిద్ర లేచారా అని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టలేని సీఎం నష్టనివారణ కోసం తొలగించిన ఆలయాలు కట్టిస్తామని బయలుదేరారు. ఆయనకు వాటి విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?’ అని నరేంద్ర విమర్శించారు.

Updated Date - 2021-01-08T07:40:52+05:30 IST