యాదాద్రి ఆలయ ప్రాంగణంలోయువకుడిపై దాడి

ABN , First Publish Date - 2021-10-20T08:38:07+05:30 IST

అతను వికలాంగుడు.. పాలమూరులోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకోపార్క్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా క్యాష్‌కౌంటర్‌లో పనిచేస్తున్నాడు..

యాదాద్రి ఆలయ ప్రాంగణంలోయువకుడిపై దాడి

కర్రతో కొట్టిన సెక్యూరిట్డీ, కానిస్టేబుల్‌..?

మర్నాడు ఛాతినొప్పి.. ఆస్పత్రిలో మృతి


మహబూబ్‌నగర్‌: అతను వికలాంగుడు.. పాలమూరులోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకోపార్క్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా క్యాష్‌కౌంటర్‌లో పనిచేస్తున్నాడు.. ఏడాది కిందట పెళ్లయింది. 21 రోజుల కిందట పాప పుట్టింది. ఎంతో సంతోషించాడు. మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్ట వెళ్లాడు.  తలనీలాలు ఇవ్వడానికి వెళ్లి.. శవమై ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్‌లోని వెంకటాద్రినగర్‌కు చెందిన ఎస్‌.కార్తీక్‌గౌడ్‌ (33) ఆదివారం యాదాద్రి వెళ్లాడు. అక్కడ రాత్రి సమయంలో మొదటిఘాట్‌ దగ్గర రూముల కోసం వెతుకుతుండగా ఆలయ సెక్యూరిటీ గార్డ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. దర్శనం కోసం వచ్చానని కార్తీక్‌ చెప్పినా వినిపించుకోలేదని, కర్రతో చెవి, చెంపపై కొట్టారని, పిడిగుద్దులు గుద్దారని కుటుంబసభ్యులు తెలిపారు. 


ఫోన్‌లో విలపించిన కార్తీక్‌

దాడి అనంతరం కార్తీక్‌.. జడ్చర్లలోని తన బంధువుకు ఫోన్‌ చేశాడు. ఇప్పుడా సంభాషణ వైరల్‌గా మారింది. ‘దర్శనానికి వస్తే ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారా? నేను ఉద్యోగినంటూ ఐడీ కార్డ్‌ చూపిస్తున్నా వినిపించుకోలేదు. చెవులు సరిగా వినిపించవని చెప్పినా కర్రతో చెవిపై కొట్టారు. వాళ్లను వదిలేది లేదు. అవసరమైతే ముఖ్యమంత్రికే ఫిర్యాదుచేస్తా’ అని  చెప్పాడు. గొడవ అనంతరం అక్కడికి వచ్చిన ఎస్సై రామకృష్ణారెడ్డితో కార్తీక్‌ తన బంధువుతో ఫోన్‌లో మాట్లాడించారు. కాగా, ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్న కార్తీక్‌.. మరుసటి రోజు హైదరాబాద్‌కు బయలుదేరాడు. హైదరాబాద్‌ దగ్గరికి రాగానే ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కార్తీక్‌ తండ్రి మహబూబ్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాదాద్రిలో దెబ్బలకు తట్టుకోలేకనే చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-20T08:38:07+05:30 IST