డాక్టర్లపై దాడి

ABN , First Publish Date - 2021-06-03T09:18:17+05:30 IST

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న డాక్టర్లపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అసోం,

డాక్టర్లపై దాడి

అసోంలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ఆస్పత్రిపాలు

విచక్షణారహితంగా కొట్టిన మృతుల బంధువులు

నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు


గువాహతి, బెంగళూరు, జూన్‌ 2: కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న డాక్టర్లపై రోగుల బంధువులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అసోం, కర్ణాటక రాష్ర్టాల్లో జరిగిన రెండు దాడులు తీవ్ర కలకలం రేపాయి. అసోంలో  పీపల్‌ పుఖురి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించగా, ఆ వ్యక్తి బంధువులు 30 మంది యువ డాక్టర్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. కాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్ది, స్టీల్‌ బేసిన్‌తోనూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం వీడియోలో కనిపించింది. కర్రలు, ఇటుకలతోనూ దాడి చేశారు. స్థానికులు సైతం డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. అసోంలోని హొజాయ్‌ పట్టణంలో ఉన్న ఉదాలి మోడల్‌ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. బాధిత డాక్టర్‌ ప్రస్తుతం ఆస్పత్రిపాలయ్యారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పోలీసులు రాత్రికిరాత్రి గాలింపు చేపట్టి 24 మందిని అరెస్టు చేశారు.


ఘటనకు నిరసనగా అసోంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్‌ పేషెంట్‌ సేవలను నిలిపివేశారు. అత్యవసర సేవలు, కొవిడ్‌ వైద్య సేవలను మాత్రం కొనసాగించారు. ఇక కర్ణాటకలోని చక్కమగళూరు జిల్లా తరికెరె పట్టణంలో డెంగీ చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు మరణించడంతో బంధువులు డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. డాక్టర్‌ దీపక్‌(50) తీవ్రంగా గాయపడిన వీడియో వైరల్‌గా మారింది. సోమవారం ఈ దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ ఎంహెచ్‌ అక్షయ్‌ తెలిపారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కాగా, ఇలాం టి దాడులను ఎదుర్కొనేందుకు లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటకలోని రెసిడెంట్‌ డాక్టర్లు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు లేఖ రాశారు. గత 10 నెలల్లో ఇలాంటి ఘటనలు డజనుకుపైగా నమోదయ్యాయని, వెలుగులోకి రాని దాడులు, డాక్టర్లను అసభ్యపదజాలంతో ధూషించిన ఘటనలు వందల సంఖ్యలోనే ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-03T09:18:17+05:30 IST