అసంతృప్తి ఆగ్రహమై..!

ABN , First Publish Date - 2020-11-30T06:36:21+05:30 IST

ఇసుక కొరత భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తోంది..

అసంతృప్తి ఆగ్రహమై..!
మంత్రి పేర్ని నానీతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

మంత్రి పేర్నిపై దాడికి ఇసుక కొరతే కారణం!

పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు విలవిల

వైసీపీ సర్కారు తీరుపై భగ్గుమంటున్న కార్మికులు

మంత్రి పేర్నినానిపై దాడికి తెగబడిన తాపీ మేస్త్రీ


విజయవాడ/మచిలీపట్నం(ఆంధ్రజ్యోతి): ఇసుక కొరత భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తోంది. ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. పాలకులపై అసంతృప్తికి దారితీస్తోంది. అది కాస్తా ఆగ్రహంగా మారి, ప్రజా ప్రతినిధులపైకి మళ్లుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆదివారం మంత్రి పేర్ని నానిపై ఓ నిర్మాణ రంగ కార్మికుడి దాడి. పనులు లేక విసిగి వేసారిపోయిన ఆ కార్మికుడు తన ఆగ్రహాన్ని మంత్రిపై ప్రదర్శించడం సంచలనం సృష్టిస్తోంది.


వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. నూతన పాలసీ పేరుతో కృత్రిమ ఇసుక కొరతకు అధికార పార్టీయే కారణమైంది. ఒకానొక దశలో లారీ ఇసుక లక్ష రూపాయలు పలికింది. ఇప్పటికీ లారీ ఇసుక రూ.19వేలు పెడితే కానీ ఇంటికి చేరడం లేదు. గతంలో ఇదే లారీ ఇసుక రూ.5వేలకు లభించేది. ఇసుక వ్యయం పెరగడం.. లభ్యత తగ్గడంతో భవన నిర్మాణ పనులు బాగా మందగించాయి. కార్మికులకు పని కరువైంది. ఇసుక విషయంలో అధికార పార్టీ నిర్ణయాలపై నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం మంత్రి పేర్ని నానిపై ఓ కార్మికుడు దాడికి తెగబడడానికి అదే కారణమయింది. ఇసుక కొరతతో పనుల్లేక ఆగ్రహంతో ఈ దాడికి తెగబడినట్లు నిందితుడు బడుగు నాగేశ్వరరావు పోలీసుల విచారణలో వెల్లడించారు. 


రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానిపై ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి వద్దే దాడి జరిగింది. తాపీ మేస్త్రీ బడుగు నాగేశ్వరరావు ఆయనపై తన వద్ద ఉన్న తాపీతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడి నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. దాడికి గల కారణం చర్చనీయాంశమైంది. ఇసుక కొరతతో పనుల్లేక పస్తులుండే పరిస్థితికి కారణమైన వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతోనే ఈ దాడికి తెగబడినట్లు నిందితుడు నాగేశ్వరరావు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నాయకులు ఈ కారణాన్ని మరుగు పరిచి, ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు మొదలుపెట్టడం గమనార్హం. జిల్లా రాజకీయ చరిత్రలో ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడమే తప్ప వ్యక్తిగత దాడులకు తెగబడిన ఉదంతాలు లేవు. ఈ నేపథ్యంలో మంత్రిపై దాడి ఘటనకు అసలు కారణాన్ని మరుగునపర్చి రాజకీయ రంగు పులమడం విమర్శలకు తావిస్తోంది. 


అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఇసుక

జిల్లావ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్‌లన్నీ అధికార పార్టీ నేతల కబ్జాలో ఉన్నాయి. ఇసుక లోడింగ్‌ అన్‌లోడింగ్‌, రవాణా కాంట్రాక్టులన్నీ అధికార పార్టీ నేతలవే. రీచ్‌ల నిర్వహణ పేరుకే ఏపీఎండీసీ నేతృత్వంలో ఉన్నా అసలు నిర్వహణ అంతా అధికార పార్టీ నేతలదే. జిల్లాకు చెందిన ఓ మంత్రి, మైలవరానికి చెందిన అధికార పార్టీ నేతల కబ్జాలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలించుకుపోవడం ద్వారా ఈ ఇద్దరు నేతలు వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసి 100 టిప్పర్లు కొనుగోలు చేసిన జిల్లా మంత్రి ప్రస్తుతం వాటిని ఇసుక రీచ్‌ల వద్ద తిప్పుతూ అప్పు తీర్చేయడంతోపాటు భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్న వారి జేబులు గుల్లయిపోతున్నాయి. ఈ మొత్తం పరిణామాలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 50వేల మంది భవన నిర్మాణ కార్మికులపై ఇసుక ప్రభావం ప్రత్యక్షంగా పడుతోంది. మరోవైపు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న ప్రకటనలతో జిల్లాలో నిర్మాణ రంగం పూర్తిగా చతికిలపడిపోయింది. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. దీంతో ఆ కార్మికుల్లో అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆగ్రహమే ఆదివారం మంత్రి పేర్ని నానిపై దాడికి కారణమయింది. 


దాడికి రంగు పులమొద్దు: టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు 

విజయవాడ సిటీ : రాష్ట్ర మంత్రి పేర్ని నానీపై జరిగిన భౌతికదాడిని ఖండిస్తున్నట్టు టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు పేర్కొన్నారు. మంత్రిపై జరిగిన దాడికి కారణం ఒక వ్యక్తి బాధ కాదని, కుదేలైన భవననిర్మాణ కార్మిక రంగం వ్యథ అన్నారు. సీఎం జగన్‌పై ఉన్న అక్కసును కార్మికులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలపై వెళ్లగక్కుతున్నారన్నారు. వైసీపీ నాయకులు ఈ దాడి ఘటనను ఒక కులానికో, ఒక పార్టీకో ముడిపెట్టకుండా సమస్యను గుర్తించి పరిష్కరించాలన్నారు. భవన నిర్మాణరంగ కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-11-30T06:36:21+05:30 IST