Abn logo
Oct 20 2021 @ 02:43AM

అరాచకం!

 • డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో దర్జాగా దౌర్జన్యం
 • కర్రలు, రాడ్లు, సుత్తులతో స్వైర విహారం
 • అధికార పార్టీ శ్రేణుల విధ్వంసకాండ
 • ఫ్యాక్షన్‌ సినిమా తరహా ప్లానింగ్‌తో టీడీపీ ప్రధాన కార్యాలయంపై మూకదాడి
 • గేటును వాహనంతో గుద్ది కూల్చివేత.. రాళ్లు రువ్వుతూ మూకుమ్మడిగా ముందుకు
 • కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్‌ బద్దలు.. కర్రలు, రాడ్లు, సుత్తితో విధ్వంసం
 • ఆ సమయంలో రెండో అంతస్తులో పట్టాభి, వర్ల.. వారిపైనా దాడి చేసే యత్నం
 • 15 నిమిషాలపాటు యథేచ్ఛగా దౌర్జన్యం.. అడ్డుకున్న సిబ్బంది, నేతలపైనా దాడి
 • అంతకుముందు పట్టాభి ఇంట్లో విధ్వంసం.. విమర్శలపై నిరసన పేరుతో దండయాత్ర
 • డీజీపీ ఆఫీస్‌ పక్కన.. ఏపీఎస్పీ బెటాలియన్‌ ముందు.. అయినా పోలీసుల ప్రేక్షక పాత్ర 
 • ఏకకాలంలో వ్యూహాత్మకంగా!.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు
 • ఆ పార్టీ నాయకుల ఇళ్లపైనా వైసీపీ శ్రేణుల గురి.. పలుచోట్ల విధ్వంసకాండ


‘మేం మిమ్మల్ని తిడతాం. మమ్మల్ని మీరు విమర్శిస్తే మాత్రం కొడతాం’... అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, నవ్యాంధ్రలోనూ కనీవినీ ఎరుగని స్థాయిలో దాడులకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై మూకుమ్మడి దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడికి యత్నించారు. ప్రభుత్వంపై, తమ నేతలపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... అరాచకానికి పాల్పడ్డారు. మంగళగిరి-విజయవాడలో ఫ్యాక్షన్‌ తరహా దృశ్యాలను మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి చూపించారు. మంగళవారం సాయంత్రం పట్టాభి ఇంటిపై దాడి తర్వాత కొద్దిసేపటికే... మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ ఆఫీసులపైనా, ఆ పార్టీ నేతల ఇళ్లపైనా దాడులకు తెగబడ్డారు.మంగళగిరి/గుంటూరు/అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): చేతుల్లో కర్రలు, రాడ్లు! ‘పథకం’ ప్రకారం తెచ్చుకున్న సుత్తులు! వాహనానికి అటూ ఇటూ వేలాడుతూ... కర్రలను గాలిలో తిప్పుతూ వేగంగా వచ్చారు! మూసి ఉన్న ఇనుప గేటును వాహనంతో గుద్ది... కిందికి పడదోశారు! బిలబిల మంటూ లోపలికి పరిగెత్తి... వీలైనంతగా విధ్వంసం సృష్టించారు! ....ఇదేదో ఫ్యాక్షన్‌ సినిమాలోని దృశ్యం కాదు! మంగళగిరిలో, డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో... ఏపీఎస్పీ బెటాలియన్‌కు అతి సమీపంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి దృశ్యం! విజయవాడ నగరం నడిబొడ్డున టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి అనంతరం... ముష్కరులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు పది నుంచి పదిహేను వాహనాల్లో... డీజీపీ కార్యాలయం ముందు నుంచే, సర్వీస్‌ రోడ్డులో రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చారు. పోలీసు ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న సీకే కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద కొద్దిసేపు ఆగారు. అందరూ అక్కడ గుమికూడారు.


కొందరు మద్యం కూడా సేవించారు. ఆ తర్వాత ‘దాడి’కి సర్వం సిద్ధమై బయలుదేరారు. ఏపీ 07 బీఈ 2345 నంబరు నల్లరంగు ఫార్చ్యూనర్‌ వాహనానికి అటూ ఇటూ వేలాడారు. వారి చేతుల్లో కర్రలు! దాని వెనుకే మరిన్ని వాహనాలు! వాహనాలన్నీ ఒక్కసారిగా దూసుకొచ్చాయి.   కార్యాలయం గేటును వాహనంతో గుద్ది... కిందికి పడదోశారు. టీడీపీ ప్రధాన కార్యాలయం ముందు అందరూ బిలబిలా దిగారు. సుమారు 120 మంది... అందులో 40 మంది దాకా మహిళలే! కిందికి దిగీదిగగానే టీడీపీ కార్యాలయంపైకి రాళ్లు రువ్వుతూ మూకుమ్మడిగా ముందుకు కదిలారు. కార్యాలయంలోపలికి ప్రవేశించారు. కర్రలు, రాడ్లతోపాటు... సుత్తితో కార్యాలయ భవనంలోని అద్దాలను బద్దలు కొడుతూ విధ్వంసం సృష్టించారు. కుర్చీలను విసిరి కొట్టారు. కంటికి కనిపించిన ఫర్నీచర్‌నంతా ధ్వంసం చేస్తూ... కార్యాలయం రెండో అంతస్తువైపు కదిలారు.


పట్టాభిపై గురి...

తన నివాసంపై దాడి జరుగుతున్నప్పుడు పట్టాభి టీడీపీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నారు. ముష్కరులు అక్కడికే వచ్చారు. ఆ సమయంలో ఆయన, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరికొందరు నేతలు పార్టీ ఆఫీసు రెండో అంతస్తులో ఉన్నారు. పట్టాభిని లక్ష్యంగా చేసుకునే దుండగులు రెండో అంతస్తులోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ... పైకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో వెనక్కి వచ్చి రాళ్లు రువ్వడం కొనసాగించారు. టీడీపీ కార్యాలయ సిబ్బంది బద్రి, అనిల్‌తోపాటు విశాఖపట్నం డిప్యూటీ మేయర్‌ దొరబాబు, గుంటూరు టీడీపీ పార్లమెంటు వ్యవహారాల ఇన్‌చార్జి విద్యాసాగర్‌ తదితరులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిపైనా దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో బద్రి తీవ్రంగా గాయపడ్డారు.


15 నిమిషాలు యథేచ్ఛగా...

సాయంత్రం 5:10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ విధ్వంసకాండ సుమారు 15 నిమిషాలకుపైగా సాగింది. సీకే కన్వెన్షన్‌ వద్ద వాహనాలు గుమికూడినప్పుడే... టీడీపీ శ్రేణులు గమనించి పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించారు. మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం పరిమితమైన సిబ్బందితో అక్కడికి వచ్చారు. అప్పటికే... దుండగులు చేయాల్సిందంతా చేసేసి, వెళ్తూ వెళ్తూ మళ్లీ రాళ్లు రువ్వుతున్నారు. పోలీసులు కూడా వారిని అడ్డుకోలేక ప్రేక్షకపాత్ర పోషించారు. ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లు దుండగులను నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ... ‘దాడి’కి వెరచి వెనక్కి తగ్గారు. మొత్తానికి... పట్టపగలు, జాతీయ రహదారి పక్కనే, డీజీపీ ఆఫీసుకు సమీపంలోనే అధికార పార్టీ నేతలు దర్జాగా దౌర్జన్యం చేసి ఎంచక్కా వెళ్లిపోయారు. దాడికి నిరసనగా... పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డుపై టీడీపీ నేతలు సుమారు గంటసేపు రాస్తారోకో చేశారు.

 ఆగంతకుడా!  ఇంటెలిజెన్స్‌ సీఐ నా!

మంగళగిరి, అక్టోబరు 19: వైసీపి ముష్కరుల దాడికి గురైన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి ఓ అగంతకుడు అనుమానాస్పదంగా తిరుగుతూ సెల్‌ఫోన్‌తో విజువల్స్‌ను చిత్రీకరిస్తుండడంతో పార్టీ కార్యకర్తలు అతనిని అడ్డుకుని నిర్భందించారు. టీడీపీ నాయకులు ఆలపాటి రాజా, అశోక్‌బాబు ప్రభృతులు వారిని అడ్డుకుని సదరు వ్యక్తిని తమ రక్షణలో వుంచుకుని మంగళగిరి రూరల్‌ పోలీసులకు అప్పగించారు. కాగా ఆ ఆగంతకుడు ఇంటెలిజెన్స్‌ సీఐగా పనిచేస్తున్న నాయక్‌ అని కొందరు చెబుతున్నారు.

రక్షణ కోరిన విలేకరి... పారిపొమ్మన్న పోలీసు

టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతున్న సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన మంగళగిరి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి విలేకరి శివన్నారాయణపైనా దుండగులు దాడికి దిగారు. ఆయన సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరగా... ‘‘ఇప్పుడేమీ చేయలేం. పారిపోయి ప్రాణాలు కాపాడుకో’’ అని సలహా ఇవ్వడం గమనార్హం.


టీడీపీ ఆఫీసులో ధ్వంసం అయిన ఫర్నీచర్‌, టీడీపీ కార్యాలయంలో ఉన్న వారిపై కర్రలతో దాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలు