సమస్యలపై నిర్లక్ష్యం వల్లే దాడులు

ABN , First Publish Date - 2021-09-18T08:21:07+05:30 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అటవీ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేయడాన్ని రాష్ట్రంలోని అటవీ శాఖ అధికారుల సంఘాలు ఖండించాయి.

సమస్యలపై నిర్లక్ష్యం వల్లే దాడులు

  • అటవీ అధికారుల సంఘాల ఆవేదన
  • బాధితులకు ఇంద్రకరణ్‌ రెడ్డి పరామర్శ


హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అటవీ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేయడాన్ని రాష్ట్రంలోని అటవీ శాఖ అధికారుల సంఘాలు ఖండించాయి. అటవీశాఖలో సంస్కరణలు చేపట్టి, ఇలాంటి సంఘటనలను నివారించాలని  యునైటెడ్‌ ఫారెస్ట్‌ ఫ్రంట్‌(టఫ్‌), తెలంగాణ రాష్ట్ర అటవీ అధికారుల అసోసియేషన్‌, తెలంగాణ అటవీ క్షేత్రాధికారుల అసోసియేషన్‌, తెలంగాణ జూనియర్‌ అటవీ అధికారుల అసోసియేషన్‌ నేతలు ప్రభుతాన్ని డిమాండ్‌ చేశారు. ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అటవీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని, ఉన్నతాధికారులు వీటిపై స్పందించడం లేదని ఆరోపించారు. సిబ్బందిపై దాడులకు అటవీ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.


రాష్ట్రంలో ఫారెస్ట్‌ బీట్‌లు, సెక్షన్లు, రేంజ్‌లను పెంచారని, వాటికి అవసరమైన సిబ్బందిని నియమించలేదని అన్నారు. మూడు అటవీ విభాగాలను  అశాస్త్రీయంగా కలిపారని, దీనివల్ల అటవీ శాఖ విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందన్నారు. అటవీ శాఖను కేవలం మొక్కలు నాటే విభాగంగా మాత్రమే చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాజా సంఘటనపై రాష్ట్ర అటవీ శాఖ స్పందించింది. అటవీ సంపదను సంరక్షించేందుకు ఇన్ఫార్మర్ల వ్యవస్థ కావాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరింది.


దాడులు సమంజసం కాదు: ఇంద్రకరణ్‌ 

అటవీ శాఖ అధికారులపై పోడు రైతులు దాడి చేయడం సమంజసం కాదని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాడి సమాచారం తెలుసుకున్న మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసిందని, తొలి సమావేశం శనివారం జరుగుతుందని చెప్పారు. అటవీ ప్రాంత ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

Updated Date - 2021-09-18T08:21:07+05:30 IST