విలువలు నేర్పిన ఉపాధ్యాయుడు అత్తలూరి

ABN , First Publish Date - 2021-09-15T05:44:39+05:30 IST

‘‘ఇంత నిరాశ చీకటిలోనూ/ ఎక్కడో ఓ మిణుగురుపురుగు/ ఎప్పుడో నువ్వు వస్తావన్న చిన్ని ఆశ/ ఆ నిరీక్షణే నా జీవితానికి ఊపిరి’’ (నిరీక్షణ, 14-7-1967, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక) ‘‘ఇది కుట్రదారులు విసురుతున్న....

విలువలు నేర్పిన ఉపాధ్యాయుడు అత్తలూరి

‘‘ఇంత నిరాశ చీకటిలోనూ/ ఎక్కడో ఓ మిణుగురుపురుగు/ ఎప్పుడో నువ్వు వస్తావన్న చిన్ని ఆశ/ ఆ నిరీక్షణే నా జీవితానికి ఊపిరి’’ (నిరీక్షణ, 14-7-1967, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక) ‘‘ఇది కుట్రదారులు విసురుతున్న వల/ సమాధానంగా తెగవల నాది తల/ అందుకే ఇది/ మహావిప్లవావిష్కరణకు పదును/ మరోసారి మోసపోవడానికి కాదు అదును’’ (ఇంక్విలాబ్‌, ‘లే’ కవితాసంపుటి, ఫిబ్రవరి, 1971) ‘‘నేను/ అనే భావన/ నాది అనే ఆలోచనకు దారితీస్తుంది/ ఇక చూసుకో సోదరా/ జనాన్ని నంజుకు తినేస్తాం! (నేను-నాది; కొత్తకలాలు 2–5-1975, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక). 


ఈ మూడు కవితలూ అప్పుడే కొత్తగా సాహిత్యప్రవేశం చేస్తున్న క్రొన్నెత్తురుల యువకవి రాసినవి. మొదటిది ప్రణయ భావన, రెండోది విప్లవం, మూడోది నాది అనే వ్యష్ఠి నుంచి మాది అనే సమష్టి భావనను చెప్పేది. ఈ మూడు కవితలూ నిన్న విశాఖపట్నంలో తీవ్ర అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూసిన అత్తలూరి నరసింహారావు రాసినవి.


ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, తెలుగు విభాగంలో ఆచార్యులుగా పనిచేసిన అత్తలూరి నరసింహారావు 1946 జూన్‌ 1న గుంటూరు జిల్లా బిక్కసానివారిపాలెంలో జన్మించారు. అమ్మ అనసూయ, నాన్న భాస్కరరావు. పెద్దక్క భర్త తమ్ముడైన త్రిపురనేని మధుసూదనరావుగారితో పరిచయం ఆయన్ని మార్క్సిజం వైపు ఆకర్షింపజేసింది. మరో అక్క కొడుకు త్రిపురనేని శ్రీనివాస్‌ ఆ తానులోని గుడ్డే. ప్రాథమిక విద్య గోగినేనివారిపాలెంలోను, డిగ్రీ తిరుపతిలోనూ పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్శిటీలో ఎం.ఎ తెలుగు చేసి తిలక్‌పై పరిశోధన చేసి డాక్టరేట్‌ చేశారు. ఆ సమయంలోనే తెలుగు శాఖలో వ్యుత్పత్తి పదకోశం ప్రాజెక్టులో చేరి తర్వాత లెక్చరర్‌గా కుదురుకున్నారు. సాహిత్యంలో ప్రయోగాలకు పెట్టింది పేరైన అత్తలూరి, మిత్రులతో కలిసి ‘అద్వయం భైచంకొ’ పేరుతో నిరసన కవిత్వం రాశారు. (అబ్బూరి, అత్తలూరి, భైరవయ్య, చందు సుబ్బారావు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ). ఈ విషయంలో వీళ్లకు దిగంబర కవులు ఆదర్శం. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చాసో, భూషణం, అర్నాద్‌, వివిన మూర్తి, పురిపండా, కెవిఎస్‌ వర్మ వంటి వారితో సన్నిహితంగా మెలిగారు. బంగోరె, వేల్చేరు నారాయణరావు వంటివారిని గురుమిత్రులుగా భావించేవారు.


సాహిత్యంలో ఆయనకు నచ్చిన విషయాల కంటే నచ్చని విషయాలే ఎక్కువ. అందుకే మా సహాధ్యాయి పురిపండా పార్వతీశ్వరరావు ‘‘మాస్టారూ! మీరు ఒక అయిష్టాల పుట్ట’’ అని ఆయన మొహం మీదే అంటే అవునా అని నవ్వి ఊరుకున్నారు. అయితే సాహిత్యంలో ఎక్కడ ఏ కొత్తదనం కనిపించినా ఆ రచననూ, ఆ రచయితనూ భుజాన వేసుకుని ఊరేగించేవారు. సాహిత్యసభలు అంటే ఆయనకు చాలా అనాసక్తి, అంతకంటే అసహనమూ. అందుకే సభల్లో వెనుక వరసలో కూచుని టీలు, సిగరెట్లు తాగుతూ సెటైర్లు వేసేవారు. ఈ అసహనమూ అసంతృప్తీ ఆయన చేత ఇటీవల ‘సరస్వతీ బజార్‌’ కథల పుస్తకం రాయించింది. తెలుగులో చదవదగ్గ పుస్తకాలు పెద్దగా లేవని భావించే అత్తలూరి, ఇంగ్లీషు పుస్తకాల వైపు దృష్టి సారించారు. తను చదివిన మంచి పుస్తకాల గురించి మిత్రులతో ముచ్చటించి, ఆ పుస్తకాలను మిత్రులకు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించారు. 


విశ్వవిద్యాలయ ఆచార్యునిగా ఆయన ఎన్నో కొత్త విలువలు, ప్రమాణాలు నెలకొల్పారు. విద్యార్థులను ఇంటి పనిమనుషులుగా భావించే విశ్వవిద్యాలయ వ్యవస్థలో ఆయన గొప్ప ప్రజాస్వామిక విలువలను ప్రవేశపెట్టారు. ఆయన తన జీవితంలో ఏ విద్యార్థినీ ఏకవచన ప్రయోగంతో పిలవలేదు. విద్యార్థులనే కాదు, డిపార్టుమెంటు అటెండరును కూడా ‘పోలారావు గారు’ అని పిలిచే గొప్ప సంస్కారి. ఆయన గదిలోని లైట్‌నో, ఫేన్‌నో, తలుపు గడియనో ఏ విద్యార్థి అయినా ముట్టుకుంటే, ‘ఇది నా గది మీకేమీ సంబంధం, ఆ పనులు చేయడానికి వేరేవారు ఉన్నారు. మీరు ఇక్కడ స్కాలర్లు’ అనేవారు. ఒక విద్యార్థి పరీక్ష తప్పితేనో, ప్రేమ విఫలమైతేనో, రండి బీచ్‍కి వెళ్లి కబుర్లు చెప్పుకుందాం అని విద్యార్థులతో త్రిబుల్‌ రైడింగ్‌ చేసి ట్రాఫిక్‌ పోలీసుల చేత ఫైన్ వేయించుకుందీ మా మాస్టారే! ప్రసాదమూర్తి, రాజేశ్వరిల ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా నూజివీడు వెళ్లి అమ్మాయి బంధువుల చేత దెబ్బలు తినడానికి సాహసించిందీ అత్తలూరి మాస్టారే!


ఒక రకంగా నన్ను కవిగా డిస్కవర్‌ చేసింది అత్తలూరిగారే! రోజూ క్లాసు అయిపోగానే ఆయన చేతికి ఒక కవిత ఇస్తే చదివి సూచనలు చేసేవారు. ఒకరోజు మీ కవిత్వానికి ఒక స్టైలు ఏర్పడుతోంది గమనించారా అంటే, అవునా మాస్టారు అన్నాను. 1987లో వచ్చిన నా మువ్వల చేతికర్రకు సంపాదకుడిగా వ్యవహరించారు– నా ‘వాడే అశుద్ధ మానవుడు’ కవిత చదివి ఇంకా పదునుగా నరకాలి అని అత్తలూరి అంటే ఆ తర్వాత వచ్చిన విమర్శలు చూసి దిగంబరులను ఆహ్వానించిన శ్రీశ్రీలా కనిపించారు అత్తలూరి. ఆయనలో మరో గొప్ప కోణం నిత్య విద్యార్థిగా ఉండడం. అది అందరికీ, మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయ ఆచార్యులకు అసలే సాధ్యం కాదు      (చేరా లాంటివారు మినహాయింపు). ఎం.ఎ రెండో సంవత్సరంలో మాకు మొల్ల రామాయణం ఆప్షన్. దాన్ని కోలవెన్ను మలయవాసినిగారు చెప్పేవారు. ఆమె అమెరికా వెళ్లాల్సిరావడం వలన, దాన్ని అత్తలూరిగారికి ఇచ్చారు– ఆయన స్పెషలైజేషన్ ఆధునిక సాహిత్యం. అయినా మా క్లాసుకు ఒక గంట ముందు సీనియర్‌ ఫ్యాకల్టీ ఆచార్య జోశ్యుల సూర్యప్రకాశరావుగారితో రామాయణం పాఠం చెప్పించుకుని వచ్చి మరీ మాకు పాఠం చెప్పేవారు. ఆయనకు చాలా కొత్తవీ, తీవ్రమైన అభిప్రాయాలుండేవి. శ్రీశ్రీ, నారాయణబాబుల కవితలు పెద్ద పెద్ద హోర్డింగుల మీద రాయించి పెట్టాలనేవారు. శ్రీశ్రీ కవితాపంక్తులు అగ్గిపెట్టెల వెనుక ముద్రిస్తే సామాన్యులు చదువుకుంటారు అనేవారు. ఈయనకు పిచ్చా అనుకునేవాళ్లం. 


బహుశా ఆయన ఎదిగి వచ్చిన భావజాల ప్రభావంతో అనుకుంటా ఆయనకు కులమతాల పట్టింపులు పెద్దగా ఉండేవి కావు. ఒకసారి డిపార్ట్‌మెంట్‌లో కలిస్తే ‘సంజీవరావుగారూ ఈ రోజు మీ కులం తెలిసిందోచ్’ అన్నారు. అదేంటి మాస్టారు అంటే, ఈవేళ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చి కమిటీ మీటింగులో అందరి గైడ్స్‌ దగ్గర ఎస్‌సి విద్యార్థులు ఉండాలంట, మీ దగ్గర ఎవరున్నారు అని అడిగారు, నాకు తెలియదు అంటే, సంజీవరావు ఎస్‌సినే కదా అంటే నాకు తెలియదు అన్నారట అత్తలూరి. ఇలాంటిదే మరొకటి– చందు సుబ్బారావు, అత్తలూరి చిరకాలం జిగిరీ దోస్తులు. ఒకసారి అత్తలూరి ఒక కరపత్రంలో ‘కాపు మహానాడు’ సభలో చందుగారి పేరు చూసి ఈ సభకు నువ్వు ఎలా వెళ్తావోయ్‌, నువ్వు వెళ్తే మన దోస్తు ‘ఖటీఫ్‌’ అన్నారట. చందుకు వెళ్లక తప్పలేదు. అత్తలూరి అప్పటి నుంచి చందుతో మాట్లాడనూ లేదు. ఇవన్నీ ఆయనకు ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేం అని చెబుతాయి.


అత్తలూరిని చివరిసారి మొన్న మే 30న ఆయన డెబ్భైయ్యవ పుట్టినరోజుకు ఆయన పిల్లలు ‘జూమ్‌’లో ఏర్పాటుచేసిన సప్తతి సభలో చూశాను. ఇప్పుడు ఆలోచిస్తే మాస్టారు ఇన్ని చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. చేసినవి గుర్తుంచుకోకపోవడం, ఇతరులు గుర్తించనవసరం లేదు అనుకోవడానికి కొంచెం హృదయవైశాల్యం అవసరం. అటువంటి హృదయవైశాల్యం ఉన్న మాస్టారు అత్తలూరి. ఆయనకు నివాళులు.

శిఖామణి

(కవిసంధ్య సంపాదకులు)

Updated Date - 2021-09-15T05:44:39+05:30 IST