Abn logo
Nov 25 2021 @ 09:52AM

కారులో యువతిపై It ఉద్యోగుల అత్యాచారయత్నం

చెన్నై: నగరంలో బుధవారం వేకువజామున కారులో ఓ యువతిపై ఐటీ సంస్థ ఉద్యోగులు ముగ్గురు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వేగంగా వెళుతున్న కారులో ఆ యువతి బిగ్గరగా కేకలు పెట్టడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు అడ్డుకుని ఆమెను కాపాడారు. నుంగంబాక్కం నెల్సన్‌మాణిక్కం రోడ్డులో శ్రీలంకరాయబార కార్యాలయం సమీపంలో వేగంగా వెళుతున్న కారులో ఓ యువతి బిగ్గరగా అరుస్తూ ముగ్గురు యువకులను చెప్పులతో కొడుతూ వచ్చింది. ఆమె కేకలు విని గస్తీ తిరుగుతున్న పోలీసులు వెంటనే ఆ కారును నిలిపి విచారణ జరిపారు. కారులో యువతి, ఆమెతోపాటు ఉన్న ముగ్గురు యువకులు పీకల దాకా మద్యం తాగి మత్తులో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ముగ్గురు యువకులు వేలూరు జిల్లాకు చెందినవారని, దురైపాక్కంలోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ యువతి, ముగ్గురు యువకులు అన్నాసాలైలోని స్టార్‌ హోటల్‌లో మందుపార్టీలో పాల్గొని కారులో తిరిగి వెళుతున్నారని, మత్తులో ఉన్న యువకులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అత్యాచారయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కనుగొన్నారు. ఇదిలా వుండగా కారును నడిపి డ్రైవర్‌ పోలీసులను చూడగానే పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై థౌజెండ్‌ లైట్స్‌ మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

క్రైమ్ మరిన్ని...