ప్రక్షాళన ప్రయత్నం

ABN , First Publish Date - 2020-02-14T11:04:09+05:30 IST

నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా ఆపడానికి సుప్రీంకోర్టు కొంతకాలంగా ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అది ఇస్తున్న ఆదేశాలు, చెబుతున్న హితవులు మాత్రం మన పార్టీలకు పట్టడం లేదు..

ప్రక్షాళన ప్రయత్నం

నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా ఆపడానికి సుప్రీంకోర్టు కొంతకాలంగా ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అది ఇస్తున్న ఆదేశాలు, చెబుతున్న హితవులు మాత్రం మన పార్టీలకు పట్టడం లేదు. గురువారం సుప్రీంకోర్టు రాజకీయపార్టీలకు మరింత ఉచ్చుబిగించింది. ప్రతీ రాజకీయపార్టీ తాను పోటీకి దించుతున్న అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను పార్టీ వెబ్‌సైట్‌లోనూ, దాని అధీనంలో నడిచే వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లోనూ ఉంచాలనీ, ప్రింట్‌ మీడియా ద్వారా ప్రకటనలూ చేయాలని ఆదేశించింది. అభ్యర్థులపై ఉన్న కేసులు, అభియోగాలు, విచారణ దశ ఇత్యాది వివరాలను విపులంగా తెలియచెప్పడంతో పాటు, అలాంటి అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయవలసి వచ్చిందో వివరణ కూడా ఇచ్చుకోమన్నది. సదరు అభ్యర్థిని ఎంపిక చేసిన మూడురోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు కూడా ఈ వివరాలు నివేదించమన్నది. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన పార్టీలపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవచ్చని ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఇచ్చింది. రాజకీయాలు నానాటికీ నేరపూరితమైపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రక్షాళన యత్నాన్ని స్వాగతించవలసిందే. 

నేరచరిత్ర ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వనివ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించాలంటూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో వెలువడిన ఆదేశాలు ఇవి. పక్షం రోజుల క్రితం ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనమేరకు ఈ అంశాన్ని పరిశీలిస్తానని కోర్టు హామీ ఇచ్చింది. తాజా అధ్యయనం ప్రకారం ప్రస్తుత లోక్‌సభలో 46శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. చిన్నాచితకా కేసులున్నవారిని తీసివేసినా, 29శాతం మంది ప్రజాప్రతినిధులపై తీవ్రనేరారోపణలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేల్లో దాదాపు మూడోవంతు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటే, వారిలో దాదాపు సగంపైన అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణలు, బలవంతపు వసూళ్ళు, దోపిడీ తదితర తీవ్ర కేసులున్నాయి. ఇవన్నీ ఎన్నికల సంఘానికి సదరు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలోని వివరాలే. సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు కొత్తగా చేసినవేమీ కావు. 2018 సెప్టెంబరులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశాలను రాజకీయపార్టీలు బేఖాతరు చేసిన నేపథ్యంలో, కోర్టు ధిక్కారం కేసుతో ఇవి మళ్ళీ వెలువడ్డాయి.

కళంకితులు చట్టసభల్లోకి రాకుండా నివారిస్తూ బలమైన చట్టం చేయండని ఈ రెండేళ్ళనాటి తీర్పులో పార్లమెంటును సుప్రీంకోర్టు ఆదేశించినా అటువంటిదేమీ ఇంతవరకూ జరగలేదు. నిజానికి రాజ్యాంగ ధర్మాసనం అప్పట్లో ఇచ్చిన తీర్పు అనేకులకు సంతృప్తి కూడా కలిగించలేదు. సమస్త వ్యవస్థలు కలసి ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు ఎన్నటికీ తేలకుండా చూస్తున్నందున, అభియోగాలు ఎదుర్కొంటున్న దశలోనే అటువంటి వారిని వడకట్టి, నేరప్రవృత్తి ఉన్నవారిని చట్టసభల్లోకి రానివ్వకుండా చూడాలన్నది పిటిషన్‌దారుల అభ్యర్థన. కానీ, దోషులుగా నిర్థారణ కాకముందే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించలేమనీ, కేసులు ఎదుర్కొంటున్న వారిని ఆపాలా వద్దా అన్నది తేల్చాల్సింది పార్లమెంటేనని సుప్రీంకోర్టు తేల్చేసింది. అయితే, అభ్యర్థి గుణగణాలను, నేపథ్యాన్ని తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉన్నదంటూ కళంకితుల వివరాలను ప్రజలకు తెలియచేయాలన్న ఆదేశాలకు తన పాత్రను పరిమితం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో, గత రెండేళ్ళుగా కోర్టు ఆదేశాలను, సూచనలను బేఖాతరు చేస్తూ వచ్చిన చట్టసభలు, రాజకీయపార్టీలు ఇప్పుడు తక్షణమే స్వచ్ఛతకు నడుంబిగిస్తాయని ఆశించలేం. తమ ప్రయోజనాలను పరిరక్షించుకొనే విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపై నడవడం చూస్తున్నదే. వేలాదిమంది ప్రజాప్రతినిధులమీద క్రిమినల్‌ కేసులున్నాయంటే అన్ని పార్టీలూ ఈ దురన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. అవినీతిపై పోరాడి అధికారంలోకి వచ్చిన ‘చీపురు’ పార్టీ సైతం క్రిమినల్‌ కేసులున్నవారినే పెద్దసంఖ్యలో నిలబెట్టి తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు మిగతా పార్టీలనుంచి ప్రక్షాళన ఆశించగలమా? తాము ఓట్లు తెచ్చిపెడుతున్నంత కాలం ఈ పార్టీలు తమవైపు కన్నెత్తిచూడవని నేరచరితులకూ తెలుసు. బలంగా, గట్టిగా, దిట్టంగా ఓ కొత్త చట్టం తెండి అన్న సూచనతో ప్రక్షాళన బాధ్యతను సుప్రీంకోర్టు సైతం  రాజకీయపార్టీలకే వదిలేసినప్పుడు ఈ నేరమయ రాజకీయ వ్యవస్థను భరించడం తప్ప ప్రస్తుతానికి వేరేమార్గం లేదు. 

Updated Date - 2020-02-14T11:04:09+05:30 IST