అవి‘నీటి’ మయం!

ABN , First Publish Date - 2021-01-07T05:10:58+05:30 IST

జిల్లా గ్రామీణ నీటి సరఫరాల శాఖలో కొంతమంది అధికారులు కోట్ల రూపాయల బిల్లులు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించారు. చేయని పనులకు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. మొత్తం రూ.1.40కోట్లకు టెండర్‌ పెట్టేందుకు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపించారు. ఇప్పటికే స్వచ్ఛభారత్‌ మిషన్‌ పనుల కింద విడుదలైన లక్షల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా పొందూరు మండలంలో పనిచేసిన ఒక ఏఈ వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు జమ చేశారు. ఆయనపై అనేక ఫిర్యాదులు అందినా... ఎటువంటి చర్యలు లేవు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దాహార్తిని తీర్చే ఉన్నతాశయంతో అమలు చేస్తున్న జల జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద మంజూరైన నిధులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అవి‘నీటి’ మయం!

ఆర్‌డబ్ల్యూఎస్‌లో నిధుల స్వాహాకు యత్నం

పూర్తికాని జేజేఎం పనులకు బిల్లులు

ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు

రూ.1.40 కోట్లకు టెండర్‌ 

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లా గ్రామీణ నీటి సరఫరాల శాఖలో కొంతమంది అధికారులు కోట్ల రూపాయల బిల్లులు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించారు. చేయని పనులకు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. మొత్తం రూ.1.40కోట్లకు టెండర్‌ పెట్టేందుకు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపించారు. ఇప్పటికే  స్వచ్ఛభారత్‌ మిషన్‌ పనుల కింద విడుదలైన లక్షల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా పొందూరు మండలంలో పనిచేసిన ఒక ఏఈ వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు జమ చేశారు. ఆయనపై అనేక ఫిర్యాదులు అందినా... ఎటువంటి చర్యలు లేవు.  తాజాగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రజల దాహార్తిని తీర్చే ఉన్నతాశయంతో అమలు చేస్తున్న జల జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద మంజూరైన నిధులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి జేజేఎం కింద రూ.11.65 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉంది. 398 పనులకు సాంకేతిక అనుమతి లభించింది. దాదాపు 285 పనులు పూర్తి చేసేందుకు పరిపాలనా పరమైన ఆమోదముద్ర వేశారు. నెలలు గడచిపోతున్నా, గ్రామాల్లో ఒక్క ఇంటికి కూడా కుళాయి అమర్చలేదు. కరోనా సాకుతో పనులు చేపట్టకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడేమో అనూహ్యంగా పనులు పూర్తి చేశామంటూ నిధులు నొక్కేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. దాదాపు 253 పనులు పూర్తయినట్లు   ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు లెక్కలు చూపారు.  సుమారు రూ.1.40 కోట్ల బిల్లుల కోసం నివేదికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా ఇంట్రిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఐఎంఐఎస్‌)కు నివేదిక  సమర్పించారు. వాస్తవానికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ అమర్చిన వెంటనే సంబంధిత లబ్ధిదారుని ఆధార్‌ నెంబరు, ఫోన్‌ నెంబరు, తదితర వివరాలు రికార్డుల్లో పొందుపర్చాలి. కానీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు అవేమీ పట్టించుకోకుండా బిల్లుల కోసం నివేదికలు సిద్ధం చేయడం గమనార్హం.

నామినేషన్‌ పనుల పేరుతో అవినీతి

ఆర్‌డబ్ల్యూఎస్‌లో తాగునీటి సరఫరా పనుల కోసం విధిగా టెండర్లు పిలవాలి. కానీ, సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు మాత్రం సొంతంగా పనులు చేపట్టేందుకు నామినేషన్‌ పనుల పేరుతో అవినీతికి తెరలేపినట్లు తెలిసింది. దీనికోసం ఒక ముఖ్య ఇంజనీరు దిగువ స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రూ.5 లక్షల లోపు పనులు పూర్తయినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు కాజేసేందుకు పూనుకున్నట్లు తెలిసింది.  అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

 నేడు కలెక్టర్‌ సమీక్ష

శ్రీకాకుళం, పలాస ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజన్ల పరిధిలోని జేజేఎం పనులపై కలెక్టర్‌ జె.నివాస్‌ గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో సంబంధిత అధికారులు   పనుల వివరాలు నమోదు చేస్తున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో రూ.50లక్షల విలువైన పనులు, పలాస డివిజన్‌లో రూ.70లక్షల పనులు పూర్తయినట్లు రికార్డుల్లో చూపారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అధికంగా ఇంటింటికీ కుళాయిలు అమర్చినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే అవినీతి బయటపడే అవకాశం ఉంది. 

త్వరలో పూర్తిచేస్తాం 

శ్రీకాకుళం డివిజన్‌లో జేజేఎం కింద చేపడుతున్న ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇటీవల మెటీరియల్‌ వచ్చింది. పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. బిల్లుల విషయంపై ఎస్‌ఈ కార్యాలయంలో సమాచారం ఇస్తారు.

- ఈశ్వరరావు, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, శ్రీకాకుళం

Updated Date - 2021-01-07T05:10:58+05:30 IST