Abn logo
Sep 27 2021 @ 00:25AM

కాపాడాల్సిన సొంత తమ్ముళ్లే అక్కపై హత్యాయత్నం

చికిత్స పొందుతున్న సత్యవతి

ఏకేసీ కాలనీలో దారుణం

మల్కాపురం, సెప్టెంబరు 26 : సొంత తమ్ముళ్లే అక్కను హతమార్చేం దుకు ప్రయత్నించిన ఘటన మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శని వారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపురం సమీపాన గల ఏకేసీ కాలనీలో కె.సత్యవతి తన భర్త, ఇద్దరు పిల్లలతో నివాసముంటోంది. అయితే కొద్ది కాలంగా తన ఇద్దరు తమ్ముళ్లతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కాలనీ పెద్దల సమక్షంలో ఆ గొడవలను సర్దుబాటు చేశారు. అయితే శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సత్యవతి ఇంటి నుంచి బయటకు వెళుతుండగా ఆమె పెద్ద తమ్ముడు గణేశ్‌, మరదలు సంతోషి, మరో తమ్ముడు శేఖర్‌, మరదలు సత్యవతి దాడి చేశారు. బ్లేడులతో ఆమె మెడపైన, చేతులపైన గాయపరిచారు. ఆమె కేకలు విని స్థానికులు అక్కడికి చేరడంతో వారు పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన సత్యవతిని మల్కాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు బాధితురాలి నుంచి, స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.