Abn logo
Sep 27 2021 @ 00:15AM

కాపురానికి రాలేదని భార్యపై హత్యాయత్నం

గాయపడిన తల్లీకూతుళ్లు

అడ్డొచ్చిన అత్తపై కూడా కత్తితో దాడి


ఇద్దరి పరిస్థితి విషమం... తిరుపతికి రెఫర్‌


మదనపల్లె క్రైం, సెప్టెంబరు 26: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని ఆవేశానికి గురైన భర్త భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తను  అదే కత్తితో పొడిచాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె  తాలూకా పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా కదిరి తాలూకా దొన్నికోటకు చెందిన రామరాజు కొంతకాలం కిందట ఉపాధినిమిత్తం మదనపల్లెకు వచ్చాడు. పట్టణంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆరేళ్లకిందట మదనపల్లె మండలం శానిటోరియానికి చెందిన వందనను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా వివాహం అనంతరం రామరాజు కాపురాన్ని తన స్వగ్రామానికి మార్చాడు. అయితే అత్తారింట్లో ఉండి కాపురం చేసేందుకు ఇష్టపడని వందన తరచూ భర్తతో గొడవపడేది. దీంతో ఏడాది కిందట అలిగి పుట్టింటికి వచ్చేసింది.  ఇదిలావుండగా రామరాజు తన భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు ఆదివారం అత్తారింటికి వచ్చాడు.  రానని తిరగబడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన రామరాజు వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్త ప్రసన్నకుమారిపై కూడా అదే కత్తితో దాడి చేశాడు. అనంతరం కుమారుడిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు తల్లీకుమార్తెలను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ సోమశేఖర్‌ చెప్పారు.

గాయపడిన తల్లీకూతుళ్లు