కేయూలో ఆత్మహత్యకు యత్నించిన..సునీల్‌ నాయక్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-03T08:19:41+05:30 IST

ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కాకతీయ యూనివర్సిటీలో పురుగు మందు తాగిన విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌(25) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.

కేయూలో ఆత్మహత్యకు యత్నించిన..సునీల్‌ నాయక్‌ మృతి

  • ఐదురోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స
  • శుక్రవారం ఉదయం కన్నుమూత
  • వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
  • కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి
  • జెన్‌కోలో ఉద్యోగానికి విపక్షం డిమాండ్‌
  • అంబులెన్సు ఎదుట నేతల బైఠాయింపు
  • ఆందోళనలో సీతక్క, చెరుకు సుధాకర్‌
  • దారి మధ్యలోనే కోదండరాం అరెస్టు
  • కుటుంబానికి గిరిజన శాఖలో ఉద్యోగం, 
  • లక్ష తక్షణ సాయం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్తాపంతో కాకతీయ యూనివర్సిటీలో పురుగు మందు తాగిన విద్యార్థి బోడ సునీల్‌ నాయక్‌(25) చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. సునీల్‌ గత నెల 26న కాకతీయ యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పటి నుంచి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణ వార్త తెలియగానే నిరసనలు భగ్గుమన్నాయి. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనంటూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా,విద్యార్థి సంఘాలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. సునీల్‌ స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం రాంసింగ్‌ తండా. సునీల్‌ మరణ వార్త విన్న పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల రాకతో తండా అట్టుడికింది. మృతుడి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి జెన్‌కోలో ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్‌తో విపక్షాలు, వివిఽధ సంఘాల నాయకులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. అధికారుల చర్చలు కొలిక్కిరాకపోవడంతో శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ధర్నా కొనసాగుతూనే ఉంది.   


సునీల్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తెస్తున్నారన్న సమాచారంతో ప్రధాన రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు మధ్యాహ్నం నుంచే రాంసింగ్‌ తండాకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని రాంసింగ్‌తండాకు తెస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌, ఎంసీపీఐ (యూ) పార్టీ నేతల ఆధ్వర్యంలో మెరుపు ధర్నాకు దిగారు. అంబులెన్సును కదలనివ్వకుండా ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు బీజేపీ నేతలు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, బీఎల్‌ఎఫ్‌, ఎంసీపీఐ (యూ) నేతలు బైఠాయించారు. దీంతో ఎస్పీ  కోటిరెడ్డి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. సునీల్‌ కుటుంబానికి సత్యవతి రాథోడ్‌ తరఫున.. గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం, అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.లక్ష, ఎంపీ మాలోతు కవిత తరఫున రూ.4 లక్షల ఆర్థిక సాయం, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ తరఫున డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తామన్న హామీలను ధర్నాలో వెల్లడించారు. కాగా, సునీల్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తున్న టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంను కేసముద్రం మండలం అర్పనపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.


ఆవేదనతో ఆత్మహత్య

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు తేజవత్‌రాంసింగ్‌ తండాకు చెందిన సునీల్‌ హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశాడు. గతంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టుదలతో హన్మకొండలో కోచింగ్‌ తీసుకున్నాడు. కేయూ క్యాంపస్‌ లైబ్రరీలో చదువుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశాడు. ఈక్రమంలో ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఇప్పట్లో నోటిఫికేషన్లు రావని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువత తీవ్ర అగచాట్లు పడుతున్నారని ఆవేదన చెందాడు. మార్చి 26న తను రోజూ చదువుకునే కేయూ లైబ్రరీ సమీపంలోని క్రీడా మైదానంలో పురుగు మందు తాగాడు. 

Updated Date - 2021-04-03T08:19:41+05:30 IST