చంద్రబాబును చంపేందుకు ప్రయత్నాలు: టీడీపీ

ABN , First Publish Date - 2020-02-28T11:45:19+05:30 IST

చంద్రబాబును చంపేందుకు ప్రయత్నాలు: టీడీపీ

చంద్రబాబును చంపేందుకు ప్రయత్నాలు: టీడీపీ

అనంతపురం: దేశంలో కొందరికే జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది. అలాంటి వీఐపీ భద్రత చంద్రబాబుకు ఉన్నా... విశాఖలో పోలీసుల సమక్షంలోనే రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో వైసీపీ రౌడీలు దాడులు చేయడం దుర్మార్గమని టీడీపీ నేతలు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ మాట్లాడుతూ విశాఖపట్టణంలో ప్రజా చైతన్య యాత్రకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకుని దాడులు చేయడం బాధాకరమన్నారు. అదికూడా అభంశుభం తెలియని కొందరు కూలీలకు డబ్బులిచ్చి తీసుకెళ్లి వైసీపీ నేతల కనుసన్నల్లో కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరివేయించారన్నారు. వందమంది అల్లరిమూకలపై అక్కడ ఉన్న పోలీసులు చర్యలు తీసుకోకపోగా... ప్రేక్షక పాత్ర పోషించడం మరింత బాధ కలిగిస్తున్నదన్నారు. జగన్‌ ప్రభుత్వం, జగన్‌ కుర్చీ శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే రాష్ట్రం  పరిస్థితి ఏంటన్నారు. వైసీపీ ముసుగులో పులివెందుల రౌడీలు వచ్చి విశాఖలో ఇది ట్రయల్‌ రన్‌ దాడి చూపించారన్నారు. మమ్ములను కాదన్నా... మేము చెప్పినట్లు వినకపోయినా ఇదే శాస్తి జరుగుతుంది.. చంద్రబాబుకే దిక్కులేదు... మీకెవరు దిక్కు అంటూ విశాఖ ప్రజలను బెదిరింపుకు ఈ దాడి చేశారన్నారు. చంద్రబాబును చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర సాగితే విశాఖలో వైసీపీ చేసిన భూదందా బయటకొస్తుందనే ఈ దాడులు చేయించి యాత్రను అడ్డుకున్నారన్నారు.


  మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మీరు (జగన్‌) కూడా పాదయాత్రలు చేశారు.. ఎక్కడైనా చిన్న సమస్య సృష్టించామా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుపై దాడులు చేయించడానికి జగన్‌కు సిగ్గు... ఎగ్గు ఉండాలని మండిపడ్డారు. పోలీసుల తీరు మరింత బాధ కలిగిస్తున్నదన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదన్నారు. ఫ్యాక్షనిస్టు కాబట్టి ఆయనకు ప్రజాస్వామ్యం, చట్టం అంటే గౌరవం లేదన్నారు. తన ఇంటి వద్ద కూడా 144 సెక్షన్‌ పెట్టుకుని పాలన సాగిస్తున్నారని. దేశంలో ఎక్కడా ఇలాంటి సీఎం ఉండరన్నారు. విశాఖలో చంద్రబాబుపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు. రౌడీ పాలనకు నిలువుటద్దమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణి, బీవీ వెంకటరాముడు, వెంకటశివుడు యాదవ్‌, రాప్తాడు వెంకటరాముడు, బుగ్గయ్య చౌదరి, శింగనమల షాలినీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:45:19+05:30 IST