భారత్‌కు వచ్చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలపై దృష్టి సారించాల్సిందే!

ABN , First Publish Date - 2020-05-29T00:49:30+05:30 IST

కొవిడ్-19 కారణంగా ప్రపంచదేశాలు అతలాకుతలమైపోయాయి.

భారత్‌కు వచ్చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలపై దృష్టి సారించాల్సిందే!

న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా ప్రపంచదేశాలు అతలాకుతలమైపోయాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడింది. ఇదిలా ఉంటే.. అనేక దేశాలకు వలస వెళ్లిన వాళ్లు కొవిడ్-19 దెబ్బకు తిరిగి తమ దేశాలకు తిరిగి వచ్చేయాలని చూస్తున్నారు. తమ దేశాలకు తిరిగి రావాలనుకుంటున్న వారిలో భారతీయులు కూడా అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. విదేశాల్లో ఉద్యోగం పోవడం కారణాంగానో లేదా భారత్‌లో తమ కుటుంబంతోనే జీవించాలనో చాలా మంది ఎన్నారైలు స్వదేశానికి వచ్చేయాలనుకుంటున్నారు. అయితే ఎన్నారైలు భారత్‌కు శాశ్వతంగా తిరిగి వచ్చేస్తే ట్యాక్స్‌లు, బ్యాంకు ఖాతాలు తదితర విషయాల్లో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు భారత్‌కు వచ్చేయాలనుకుంటే.. కింద చెప్పే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


1. పన్నుల్లో మార్పులు: ఎన్నారైలు పన్నుల విషయంలో అనేక ప్రయోజనాలను పొందుతూ వస్తున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఎన్నారైల ఆదాయంపై ఎటువంటి పన్ను విధించడం లేదు. అయితే ఎన్నారైలు స్వదేశానికి వచ్చేస్తే.. తమ ఎన్నారై హోదాను కోల్పోతారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేసే ఎన్నారైలను రెండు విభాగాలుగా పరిగణిస్తారు. రెసిడెంట్ అండ్ ఆర్డినర్లీ రెసిడెంట్(ఆర్ఓఆర్), రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినర్లీ రెసిడెంట్(ఆర్ఎన్ఓఆర్). భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో 182 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్న ఎన్నారైలు ఆర్ఓఆర్ విభాగంలోకి వస్తారు. లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరవై రోజులు.. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో 365 రోజులైనా స్వదేశంలో ఉంటే ఆర్ఓఆర్ విభాగానికి వస్తారు. ఇక గత ఏడు ఆర్థిక సంవత్సరాలలో 729 రోజులు భారతదేశంలో ఉన్నట్టయితే ఆర్ఎన్ఓఆర్ కిందకి వస్తారు. ఆర్ఓఆర్ కింద ఉన్నవారు విదేశాల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరోపక్క ఆర్ఎన్ఓఆర్ కింద ఉన్నవారు భారతదేశంలో ఆదాయం వస్తే తప్ప విదేశాల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పని ఉండదు. 


2. బ్యాంకింగ్‌లో మార్పులు: ఎన్నారైలు రెగ్యులర్ బ్యాంకు అకౌంట్‌ను ఉపయోగించం నిషేధం. ఈ కారణంగా భారతదేశానికి వచ్చేసే ఎన్నారైలు నాన్ రెసిడెంట్ ఆర్డినరి(ఎన్ఆర్ఓ) లేదా నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్(ఎన్ఆర్ఈ) లేదా ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఓ ఖాతా ద్వారా భారత్‌లో వచ్చే ఆదాయాన్ని మేనేజ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ఖాతాలో డిపాజిట్ అయ్యే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఎన్‌ఆర్ఈ, ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలలో డిపాజిట్ అయ్యే డబ్బు ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. విదేశీ ఆదాయాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఈ రెండు ఖాతాలు ఉపయోగపడతాయి. 


3.పెట్టుబడుల్లో మార్పులు: ఎన్నారైలు స్వదేశానికి వచ్చేయాలనుకుంటే ఫిజికల్ ఆస్తులను లిక్విడ్‌గా మార్చుకుంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. చాలా మంది ఎన్నారైలు విదేశాల్లోని తమ ఆస్తులను అద్దెకు ఇచ్చేసి స్వదేశానికి వచ్చేస్తారు. అయితే ఇక్కడి నుంచి వాటిని మేనేజ్ చేయడంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఎన్నారైలు ఎప్పుడైతే తమ ఎన్నారై స్టేటస్‌ను కోల్పోతారో.. అప్పటి నుంచి విదేశాల్లోని ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 


4. ఇన్సూరెన్స్‌లో మార్పులు: ఎన్నారైలు భారతదేశానికి వచ్చేస్తే విదేశంలో ఉన్న ఇన్సూరెన్స్ పాలిసి ఇక్కడ అమలు కాదు. స్వదేశానికి వచ్చేవారు తమ ఆరోగ్య బీమా అవసరాలపై ముందుగానే అంచనా వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టర్మ్ ప్లాన్‌ తీసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-05-29T00:49:30+05:30 IST