రైలు ప్రయాణికులు స్మార్టు కార్డులను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు

ABN , First Publish Date - 2021-08-07T01:19:47+05:30 IST

హైదరాబాద్: డిజిటలైజేషన్‌లో భాగంగా భారతీయ రైల్వే మరో ముందడుగు వేసి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించింది.

రైలు ప్రయాణికులు స్మార్టు కార్డులను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు

హైదరాబాద్: డిజిటలైజేషన్‌లో భాగంగా భారతీయ రైల్వే మరో ముందడుగు వేసి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించింది. ముఖ్యంగా అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్ మెషిన్స్‌ (ఏటీవీఎమ్‌లు) ద్వారా కొనే సౌలభ్యాన్ని కలిగించింది. స్మార్ట్‌ కార్డులు కలిగిన వినియోగదారులు ఇకమీదట వెబ్‌ పోర్టల్‌లో యూటీఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో వారి కార్డులను రీఛార్జ్ చేసుకోవచ్చు. 


గతంలో స్మార్ట్‌ కార్డులో డబ్బులు అయిపోతే ప్రయాణికులు వారి స్మార్ట్‌ కార్డుల రీఛార్జ్ కోసం ప్రతిసారీ బుకింగ్‌ కౌంటర్లకు రావలసి వచ్చేది. రైలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు డిజిటల్‌ పద్ధతిలో స్మార్టు కార్డులను రీఛార్జ్ చేసుకునే వసతిని భారతీయ రైల్వే కల్పించింది. దీంతో ప్రయాణికులు బుకింగ్‌ కౌంటర్ల వద్ద క్యూలలో నుంచోవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించవచ్చు.



వినియోగదారులు క్రింద తెలిపిన పద్ధతిలో ఈ సౌకర్యాన్ని పొందవచ్చు 


www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.

మెనూలో ‘‘స్మార్ట్‌ కార్డు రీఛార్జ్’’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి అన్ని డిజిటల్‌ విధానాల ద్వారా చెల్లింపు చేయవచ్చు.

చెల్లింపైనట్లు నిర్ధారించిన తర్వాత, అకౌంట్‌లో డబ్బులు మినహాయించిన తర్వాత, ప్రయాణికులు సంబంధిత జోన్‌లోని ఏటీవీఎమ్‌ను 15 రోజులలో సందర్శించాలి. ఈ లోపు కార్డు గడువు ముగిసినట్లయితే గడువు లోపల ఏటీవీఎమ్‌ను సందర్శించాలి. 

ప్రయాణికులు ఏటీవీఎమ్‌ రీడర్‌ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘‘రీఛార్జ్ స్మార్ట్‌ కార్డు’’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఏటీవీఎమ్‌లో ఆన్‌లైన్‌ రీఛార్జ్ వివరాలు వస్తాయి. తదనుగుణంగా ఏటీవీఎమ్‌ స్మార్టు కార్డు రీఛార్జ్ చేయబడుతుంది.

దీంతో టికెట్‌ కొనుగోలుకు స్మార్ట్‌ కార్డును సంబంధిత రైల్వే జోన్‌లోని ఏదేనీ ఏటీవీఎమ్‌లో వినియోగించుకోవచ్చు. 

మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామా రుజువు మరియు ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. అనంతరం, ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌ కార్డు రీఛార్జ్ చేసుకోవాలి.

 

ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి పరిస్థితులలో ఆన్‌లైన్‌ రీఛార్జ్ సౌకర్యం స్వాగతించాల్సిన అంశమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అన్నారు. ఈ ఆన్‌లైన్‌ సౌలభ్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-08-07T01:19:47+05:30 IST