Abn logo
Sep 15 2021 @ 03:44AM

వచ్చే 17న కొత్త జట్ల వేలం

  • ఐపీఎల్‌ ముగిసిన రెండు రోజులకే..
  • ఇక పది జట్లతో లీగ్‌


న్యూఢిల్లీ: ఓవైపు ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లకు సమయం దగ్గర పడుతుండగా.. మరోవైపు ఈ లీగ్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీటి కోసం అక్టోబరు 5 వరకు తుది గడువును విధిస్తూ ఈపాటికే టెండర్లను కూడా విడుదల చేసింది. అదే నెల 17న రెండు కొత్త జట్ల కోసం వేలం పాట ఉంటుందని సమాచారం. తగిన అర్హతలున్న వారిని ఎంపిక చేసి బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. ఐపీఎల్‌ ముగిసిన రెండు రోజులకు జరిగే ఈ కార్యక్రమానికి దుబా య్‌ వేదిక కానుంది. ఈసారి ఈ-వేలం కాకుండా ప్రత్యక్షంగానే బిడ్డర్లు పాల్గొనవచ్చు. పోటీపడేవారు తాము కోట్‌ చేసిన ధరను సీల్డ్‌ కవర్‌లో అందిస్తారు

ఇటీవల బీసీసీఐకి సంబంధించి రెండు పెద్ద టెం డర్లు (మీడియా హక్కులు, టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌) ఈ-వేలం ద్వారానే జరిగాయి. ‘అక్టోబరు 17న బిడ్డింగ్‌ జరుగుతుంది. అలాగే ఈ ప్రక్రియపై సందేహాలుంటే ఈనెల 21 వరకు నివృత్తి చేసుకోవచ్చు’ అని బోర్డు అధికారి తెలిపాడు. అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, ఇండోర్‌, కటక్‌, గువాహటి, ధర్మశాల పేరిట రెండు కొత్త జట్లు బరిలో ఉన్నాయి. వీటి కనీస ధర రూ.2 వేల కోట్లుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో కనీసం 4 వేల కోట్లు బోర్డు ఖజానాలో చేరనున్నాయి. ఒక జట్టు కోసం పోటీ పడే బిడ్డర్లు ముగ్గురికి మించి కన్సార్టియంగా ఉండడానికి వీల్లేదు. ఇందులో కనీసం ఒక్కరి కంపెనీ అయినా రూ.2,500 కోట్ల నెట్‌వర్త్‌తో పాటు వార్షిక టర్నోవర్‌ రూ.3 వేల కోట్ల వరకు ఉండాలి.


  క్వారంటైన్‌లోనే ప్రాక్టీస్‌

రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో చెన్నైతో తలపడేందుకు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న అతడు తానుండే హోటల్‌లోనే సైక్లింగ్‌ చేస్తూ ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకుంటున్నాడు. ఈమేరకు రోహిత్‌ ఫొటోను ముంబై ఫ్రాంచైజీ ట్వీట్‌ చేసింది.


తొలి మ్యాచ్‌కు నీలి జెర్సీలో..

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్‌కు నీలి రంగుతో కూడిన జెర్సీలను ధరించనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధరించే ఈ జెర్సీని ఆర్‌సీబీ తమ ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. జెర్సీ వెనుక ఆటగాడి పేరుతో పాటు ‘చేతులు శుభ్రంగా కడుక్కోండి.. శానిటైజర్‌ వాడండి’ అనే స్లోగన్‌ కూడా ఉంది. కరోనా పోరులో ప్రాణాలకు తెగించి సేవలందించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మద్దతుగా ఆర్‌సీబీ ఈ ప్రయత్నం చేస్తోంది. 

వారికి రెండు రోజులే క్వారంటైన్‌..

ప్రస్తుతం శ్రీలంక-దక్షిణాఫ్రికా సిరీ్‌సతో పాటు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ఆడుతున్న ఐపీఎల్‌ ఆటగాళ్లకు యూఏఈలో క్వారంటైన్‌ రెండు రోజులే ఉండనుంది. అలాగే వారందరినీ రెండు ప్రత్యేక విమానాల్లో తరలించనున్నారు. లంక, కరీబియన్‌లో ఆడుతున్న ఐపీఎల్‌ ప్లేయర్స్‌ బయో బబుల్‌లోనే ఉన్నందున ఆరు రోజుల క్వారంటైన్‌ అవసరం లేదని యూఏఈ అధికారులను బీసీసీఐ ఒప్పించింది.


మోర్గాన్‌కు నాపై నమ్మకం లేదు: కుల్దీప్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తమ టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘చూస్తుంటే ఎవరికీ నాపై నమ్మకం లేనట్టు కనిపిస్తోంది. కనీసం నా బౌలింగ్‌లో ఉన్న లోపం గురించి కూడా చెప్పడం లేదు. స్వదేశీ కెప్టెన్‌ అయ్యుంటే నేరుగా వెళ్లి అడిగే అవకాశం ఉంటుంది’ అని కుల్దీప్‌ తేల్చాడు.


డుప్లెసికి గాయం..

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో డుప్లెసి గాయపడడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆందోళనలో ఉంది. ఈ గాయంతో అతడు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి రాబిన్‌ ఊతప్ప, అంబటి రాయుడులలో ఒకరు ఓపెనర్‌గా ఆడవచ్చు.


నాలాంటి ముసలోళ్లు తాజాగా ఉండాల్సిందే..:డివిల్లీర్స్‌

బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిల్లీర్స్‌ తొలిసారి నెట్స్‌లో పాల్గొన్నాడు. తనదైన శైలిలో షాట్లు బాదిన ఏబీ తమ ఫ్రాంచైజీ వీడియోలో మాట్లాడాడు. యూఏఈలో వేడి అధికంగా ఉందని, ఓరకంగా ఇది తమ బరువును తగ్గిస్తుందని చెప్పాడు. అలాగే తనలాంటి వయస్సు మీరిన ఆటగాళ్లు ఎప్పటికప్పుడు తాజాగా ఉండాల్సిందేనని అన్నాడు.