తప్పు అయింది క్షమించండి అంటూ.. కార్ల దిగ్గజ సంస్థ..

ABN , First Publish Date - 2020-08-06T01:00:34+05:30 IST

ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఆడి ఓ అడ్వర్టైజ్‌మెంట్ విషయంలో విమర్శల పాలైంది.

తప్పు అయింది క్షమించండి అంటూ.. కార్ల దిగ్గజ సంస్థ..

బెర్లిన్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి ఓ అడ్వర్టైజ్‌మెంట్ విషయంలో విమర్శల పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆడి సంస్థ ఆడీ ఆర్ఎస్ 4 అవాంట్ అనే కొత్త ఎడిషన్ కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ప్రమోషన్ కోసం సంస్థ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆడి కారు ముందు చిన్న పాప అరటిపండు తింటూ నించుంది. పైనున్న ఫొటోలో ఈ దృశ్యాన్ని చూడవచ్చు. అరటిపండు తింటూ పాప కనిపించడంతో.. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. పైగా ‘ప్రతి అంశంలోనూ మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది’ అంటూ ఈ కారు ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ ఫొటో లైంగికంగా, శృంగార ప్రేరితంగా అనిపిస్తోందంటూ విమర్శకులు, నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పు జరిగిపోయిందంటూ ఆడి సంస్థ ట్విటర్‌లో క్షమాపణలు చెప్పుకొచ్చింది. పిల్లల విషయంతో తాము జాగ్రత్త వహిస్తామని తెలిపింది. ఇటువంటి ఫొటోలను భవిష్యత్తులో వాడబోమని హామీ ఇచ్చింది. అసలు ఈ ఫొటోతో ఉన్న యాడ్ ఏ విధంగా పబ్లిష్ చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. అయితే ఈ యాడ్‌లో తప్పేముందని వాదించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సమస్య యాడ్‌లో లేదని.. చూస్తున్న మనుషుల మెదడులోనే ఏదో సమస్య ఉందంటూ కొందరు నెటిజన్లు రీట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-06T01:00:34+05:30 IST