శుభ సూచికలతో ప్రారంభమైన ఆగస్టు

ABN , First Publish Date - 2021-08-03T06:52:36+05:30 IST

అనేక శుభ పరిణామాలతో దేశం అమృత మహోత్సవంలోకి ప్రవేశించిందని

శుభ సూచికలతో ప్రారంభమైన ఆగస్టు

  • పీవీ సింధు, హాకీ టీమ్‌ల చరిత్రాత్మక ప్రదర్శన..
  • జూలైలో 13కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ
  • అమృత మహోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని 

న్యూఢిల్లీ, ఆగస్టు 2: అనేక శుభ పరిణామాలతో దేశం అమృత మహోత్సవంలోకి ప్రవేశించిందని ప్రధాని మోదీ అన్నారు. దేశప్రజలందరూ గర్వించదగ్గ సంఘటనలతో ఆగస్టు నెల ప్రారంభమైందని తెలిపారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రతిభ, జీఎ్‌సటీ రికార్డు వసూళ్లు, వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకోవడంపై ప్రధాని స్పందించారు. అమృత మహోత్సవంలో ప్రజలందరూ ఇదే స్ఫూర్తిని, శ్రమను కొనసాగించడం ద్వారా దేశం కొత్త శిఖరాలకు చేరుకోనుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022 ఆగస్టులో దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోనుంది. ఈ ఆగస్టు నుంచి వచ్చే ఏడాది కాలాన్ని అమృత మహోత్సవంగా పరిగణించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.


ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... పీవీ సింధు తన అద్భుత కృషితో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతోపాటు... హాకీలో పురుషులు, మహిళల టీమ్‌లు కూడా చారిత్రాత్మక ప్రతిభ కనబరిచాయని అన్నారు. జూలైలో జీఎ్‌సటీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలకుపైనే నమోదయ్యాయి. గతేడాది జూలై వసూళ్లతో పోల్చుకుంటే ఇది 33శాతం అధికం. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడిందనడానికి దీన్ని సూచికగా భావిస్తున్నారు.


మరోవైపు జూలైలో దేశవ్యాప్తంగా 13కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. కాగా, ప్రధాన మంత్రి కార్యాలయంలో సీనియర్‌ అధికారిగా సేవలందిస్తోన్న అమర్‌జీత్‌ సిన్హా సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీకాలం పూర్తవకముందే రాజీనామా చేయడం గమనార్హం. మాజీ కేబినెట్‌ సెక్రటరీ పీకే సిన్హా కూడా మార్చిలో పీఎంఓ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-08-03T06:52:36+05:30 IST