ఆటోలో ట్యూషన్‌కు బయలుదేరిన బాలికకు దారుణ అనుభవం.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు..!

ABN , First Publish Date - 2021-08-29T16:24:00+05:30 IST

ట్యూషన్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలికకు ఎదురైన దారుణ అనుభవం ఇది.

ఆటోలో ట్యూషన్‌కు బయలుదేరిన బాలికకు దారుణ అనుభవం.. సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు..!

ఇంటర్నెట్ డెస్క్: ట్యూషన్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలికకు ఎదురైన దారుణ అనుభవం ఇది. ఆటో ఎక్కిన కాసేపటికి డ్రైవర్ తన అసలు రంగు బయటపెడుతూ వేధింపులకు దిగాడు. అతడి తీరుతో తీవ్ర భయాందోళనలకు లోనైన ఆమె.. ముందూవెనుకా ఆలోచించకుండా కదులుతున్న ఆటోలోంచి ఒక్కసారిగా దూకేసింది. 


ఈ క్రమంలో ఆమె బలంగా నేలకు తాకడంతో ముఖం, చేతులపై తీవ్రమైన గాయాలయ్యాయి. అతడి తీరుతో షాక్‌కు గురైన ఆమె..తీవ్ర గాయాలపాలైనా ఆలాగే పరిగెత్తడం ప్రారంభించింది. అప్పటికీ వదలని డ్రైవర్..ఆమెను వెంబడించడం ప్రారంభించాడు. ఇదంతా చూసిన స్థానికులు.. ఆటో డ్రైవర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడు వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆటో వేగంగా వెళుతున్న సమయంలోనే ఆమె కిందకు దూకేసిందని, అదృష్టవశాత్తూ ఆమెకు పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.  


మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఇటీవల ఓ బాలిక ఎదుర్కొన్న పరిస్థితి ఇది.  ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి. గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత..ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఆటో ఎక్కిన కాసేపటికే డ్రైవర్ వేధింపులు ప్రారంభించాడని, విపరీత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఆటో ఆపమన్నా అతడు ఆపకపోవడంతో తాను భయపడి ఆటోలోంచి కిందకు దూకేశానని చెప్పింది. కాగా.. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల..సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 

Updated Date - 2021-08-29T16:24:00+05:30 IST